Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏది చీకటి ఏది వెలుతురు! ఏది జీవితమేది మృత్యువు! ఏది పుణ్యం, ఏది పాపం! ఏది సత్యం ఏదసత్యం! ఏది కారణమేది కార్యం! ఏది నీతి ఏదనీతి! ఓ మహాత్మా! ఓ మహర్షి!...'' ఇప్పటికీ ఈ శ్రీశ్రీ పాటలోని ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కుంటూనే ఉన్నాము. అసత్యాలన్నీ సత్యాలుగా చలామణి అవుతున్నాయి. మన కెదురవుతున్న సవాళ్ళకు సమస్యలకు కారణం తెలుసుకోలేకపోతున్నాం. మనం చేయాల్సిన కార్యమేమిటో కూడా స్పష్టంగా నిర్ణయించుకోలేకపోతున్నాం. మహాత్ముని పేర పాడుకున్న ప్రశ్నాపాదాలు నేటికీ పదునెక్కిన పదాలుగానే మనకెదురవుతున్నాయి. సత్యం, అహింస గురించి బోధించిన మహాత్మాగాంధీ అత్యంత హింసాత్మకంగా హత్యగావించబడిన డెబ్భయి ఐదేండ్ల తర్వాత హింస, అసత్యం ధర్మాలుగా ప్రవచించబడుతున్నాయి. ఇది సరికాదన్న చోట హింస చెలరేగుతోంది.
'ఈశ్వర్ అల్లా తేరానామ్, సబ్కో సమ్మతి దేభగవాన్' అని పాడుకున్న నాయకుని గుండెలపై తుపాకీ గుండు పేలిన విషాద సంఘటనకూ, ఇరువైయేండ్ల క్రితం గుజరాత్లో జరిగిన మారణకాండకు అవినాభావ సంబంధం ఉంది. రెండూ హత్యాకాండలే, ఇప్పుడు హత్యల గురించే మాట్లాడు కుంటున్నాం. మహాత్ముడి సత్యాహింసలు, సత్య్రాగ్రహా సూత్రాలు ప్రపంచ ప్రాచూర్యం పొందినట్లుగానే ఆ మహాత్మునికి జన్మనిచ్చిన నేలలో జరిగిన హింసోన్మాదం గురించీ ప్రపంచ మీడియా చర్చిస్తూన్నది. కానీ అధర్మం, అసత్యం రాజ్యమై సత్యాలోచనలను అణచివేస్తున్నది. విశేషమేమంటే సత్యమూ, అహింస గురించి ప్రబోధించిన గాంధీ జన్మభూమిలో నుండే హింస, అసత్య ప్రబోధకులూ నాయకులై ఎదిగి రాజ్యం చేస్తున్నారు. ఇదొక వైచిత్రి. ఆనాడు మహాత్ముణ్ణి జాతిపితగా పిలుచుకుని నేటికీ పూజనీయునిగా భావిస్తున్న ప్రజలే మరో వైపు అందుకు పూర్తి భిన్న ఆలోచనలు గల వారిని నేతలుగా కొలవటం అంటే... ఇంకా ఏది సత్యం, ఏదసత్యం? ఓ మహాత్మా! అనే మీమాంసలోనే ప్రజలు ఉన్నట్టు కదా! ఇంకా ముఖ్యమైన విషయమే మంటే, ఎవరైతే మహాత్ముని అంత మొందించారో, ఆ హంతకున్ని దేశభక్తుడుగా పేర్కొంటూ, అతని ఆలోచనతో కొనసాగే వారు నేడు మన పాలకులుగా కొనసాగడం బాధాకరమైన యధార్థం. అందుకనే గాంధీ వర్థంతి రోజు కానీ జయంతిరోజు కానీ గాంధీని గురించి మాట్లాడుతారు తప్ప అతన్ని హతమార్చిన హంతకుని గురించి చర్చే చేయరు.
అందుకే మనమిప్పుడు హంతకుల గురించి మాట్లాడుకోవాలి. అతని ఆలోచనలూ రాజకీయాల గురించీ చర్చించాలి. అప్పుడే సత్యా సత్యాల విషయం బోధపడుతుంది. మహాత్ముని ఎందుకు చంపాడు గాడ్సే. మత సామరస్యాన్ని బోధించినందుకు. హిందువులు, ముస్లింలు అన్ని మతాల ప్రజలు అన్నదమ్ములుగా సహనంతో జీవించాలని ఘోషించినందుకు మతోన్మాదికి ఆగ్రహం తెవచ్చింది. చెప్పేదానికి, చేసేదానికి భేదం ఉండరాదనీ సత్యాన్నే పలకాలనీ చెప్పాడు గాంధీ. ఇది కూడా వాళ్లకు నచ్చే విషయం కాదు. స్వేచ్ఛ, సమానత్వాలను కోరుకున్నాడు. ఇవేవీ గాడ్సే భావానుచరులకు మింగుడుపడని విషయాలు. అందుకే వాళ్లిప్పుడు సత్యం, న్యాయం, సమానత్వం గురించి మాట్లాడే వారిని అణచివేసే హత మార్చే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే పన్సారేను హతమార్చారు. కల్బుర్గీని, గౌరీలంకేశ్లను అంతమొందించారు. ఎవరు గొంతు విప్పినా నిర్భంధకాండకు పూనుకుంటున్నారు. ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మరోవైపు వాళ్ళు మాట్లాడుతున్న దానికీ ఆచరణకూ పూర్తి వైరుధ్యము కొనసాగుతున్నది. మత సామరస్యత పోయి, మత విద్వేషం, మానవతా విధ్వంసం పెల్లుబుకుతున్న సందర్భాన శాంతి, అహింసల గాంధీతత్వాన్ని చర్చించటం ఒక అవసరమే అనుకుంటా.
ఒక మతాన్ని అవలంభించినా పరమత సహనాన్ని బోధించి, ఆచరించిన వాడిగా, మన దేశ సామాజిక సాంస్కృతిక బహుళత్వాన్ని అర్థం చేసుకుని, ఐక్యతను సాధించాలని తపన పడిన నాయకుడిగా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్ర, ప్రజలను ఏకం చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయే ఒక అధ్యాయం. కానీ నేడు గాంధీ చరిత్రనూ కనుమరుగు చేసే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. గాంధీ ఆలోచనలపై ఆచరణపై భిన్నమైన అభిప్రాయాలెన్ని ఉన్నప్పటికీ నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకూ, భారతీయ జీవన గమనానికి ముంచుకొస్తున్న ముప్పుకూ ఆనాటి గాంధీని హతమార్చిన విద్వేష హింసాలోచనల పరంపరనే కారణమన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన హత్య ఒక ఉన్మాద సంఘటనయితే, ఇప్పుడదే ఉన్మాదం సామూహిక విపత్తుగా పరిణమించింది. దీన్ని అందరూ కలిసి ఎదుర్కోవాల్సి ఉంది. మహాత్ముని స్మరణకు సార్థకమదే.