Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్షిణాఫ్రికాలో మహిళల తొలి అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో ఆదివారం సాయంత్రం భారతీయ బాలికలు ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించి, ప్రపంచ విజేతగా నిలిచిన క్షణాలు. మహిళా క్రికెట్లో భారత్‌కిది మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ. ఈ ప్రతిభాపాటవాలు భారత మహిళా క్రికెట్ భవిష్యత్తుకు బలమైన పునాది. తెలుగమ్మాయిలు త్రిష, షబ్నమ్లూ మువ్వన్నెల పతాకను రెపరెపలాడించడంలో కీలక భూమిక పోషించారు. నిజానికి, అర్ధశతాబ్ద కాలంలో మన మహిళా క్రికెట్ అనేక శంఖలాలు తెంచుకొంది. పంజరాలను దాటింది. సామాన్య స్థాయి నుంచి అసామాన్యతకు ఎదిగింది. గడచిన రెండు సీనియర్ల టీ20 వరల్డ్ కప్‌లలో మన మహిళా జట్టు సెమీ ఫైనలిస్టుగా, ఫైనలిస్టుగా నిలిచింది. దక్షిణాఫ్రికాలో తాజా టీ20 కప్‌లో బాలికలు ఏకంగా విజేతలయ్యారు. ఇది వారి జీవితాల్లోనే కాదు.యావత్ భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే కీలక మలుపు.
నిరుడు ఫిబ్రవరిలో 19 ఏండ్లలోపు అబ్బాయిలు జయకేతనం ఎగరవేస్తే.. నేడు షెఫాలీ వర్మ సేన అదే ఇంగ్లాడ్‌ను చిత్తుగా ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీ ఆసాంతం శ్వేత, షెఫాలీ, త్రిషలు పరుగుల వరద పారిస్తే, పార్శవి చోప్రా, మన్నత్ కశ్యప్, అర్చనాదేవి ప్రభృతులు వికెట్లు కూల్చి భారత్‌ను విజయపథాన నిలబెట్టారు. పురుషులతో పాటు సమాన పారితోషికం లేకున్నా, ఇంటా బయటా ఎన్ని అవమానాలు ఎదురైనా, ఆర్థిక, సామాజిక అవరోధాలున్నా అవన్నీ దాటుకొని వచ్చిన అమ్మాయిలు కాబట్టి తాజా విజయం మరింత గొప్పది. ఆడపిల్లలను ప్రోత్సహిస్తే వారు కుటుంబానికే కాదు... దేశానికీ ఎంతటి పేరు తెస్తారో చెప్పడానికి ఇదొక తాజా దర్పణం. బ్యాడ్మింటన్ తర్వాత భారత మహిళా క్రీడాంగణంలో ఇక క్రికెట్ కొత్త దీపశిఖ.
వాస్తవానికి దేశం నలుమూలలా క్రీడా పాఠశాలల్లో రకరకాల సమస్యలు తిష్టవేయడం నిర్ఘాంతపరుస్తోంది. విజేతల సృజనలో తలమునకలు కావాల్సిన ప్రాంగణాలు శిక్షకుల కొరతతో, నిధుల లేమితో కిందమీదలవుతున్నాయి. ఒకప్పుడు దేశమంతటా మోతెక్కిపోయిన 'ఖేలో ఇండియా' స్ఫూర్తి నిలువునా నీరోడుతోంది! ఆ మాటకొస్తే, దక్షిణ భారతదేశంలోని మూడోవంతు పాఠశాలలకు ఆటస్థలాలు లేవు. బిహార్, ఒడిశా, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో మైదానాలు కలిగిన బడులు 40శాతం లోపే. దేశీయంగా అత్యంత నిరాదరణకు గురవుతున్న క్రీడల దౌర్భాగ్య పరిస్థితికి అధికారిక గణాంకాలే నిలువుటద్దం.
'కంప్యూటర్ ప్లే స్టేషన్లో కాదు... నిజమైన క్రీడామైదానాల్లో యువత స్వేదం చిందించాలి' అని 'మన్ కీ బాత్'లో ప్రధాని మోడీ పిలుపిచ్చారు. కానీ, అందుకు తగిన కార్యచరణ గురించి ఎప్పుడూ ప్రధాని ఉలకరూ,పలకరు. గత కొంత కాలంగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలకు ప్రధాని మనసు అంగీకరించడం లేదు. ప్రతి పాఠశాలలోనూ ఆటస్థలం, క్రీడాసామగ్రి ఉండి తీరాలన్న విద్యాహక్కు చట్టం దశాబ్దాలుగా చట్టుబండలవుతోంది! పాఠశాల దశనుంచీ ఆటలకు ప్రోత్సాహం, అంశాలవారీగా ప్రత్యేక శిక్షణా సంస్థల అవతరణ, విస్తృత మౌలిక వసతుల పరికల్పనలకు విశేష ప్రాధాన్యమిస్తున్న చైనా, థారులాండ్, జపాన్, యూకే ప్రభత దేశాలు ప్రతిష్టాత్మక వేదికలపై పతకాల పంట పండిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటివి క్రీడను పరిశ్రమగా సమాదరిస్తూ అద్భుత ఫలితాలను ఒడిసిపడుతున్నాయి. అదే ఇక్కడీ ఉన్నత స్థాయి క్రీడా సదుపాయాలు, మేలిమి శిక్షణ ఏర్పాట్ల విషయంలో మాటలకు, చేతలకు మధ్య ఉన్న యోజనాల దూరం తరగడంలేదు.
ఇప్పుడు కండ్లు తెరిస్తే కనిపించే నిజం ఒక్కటే 'ఆడవాళ్ళకు ఆటలేమిటి' అన్న సమాజానికి ఇప్పుడు ఆ ఆడవాళ్లే విజయాలను అందిస్తున్నారు. పాఠశాలల్లో ఆడుకోవడానికి ఖాళీ స్థలం మొదలు కనీస సౌకర్యాలు కూడా కష్టమైన దేశంలో, మార్కులు తప్ప ఆటలెందుకని ఆలోచించే పెంపకంలో, 'వంటింట్లో తప్ప మైదానంలో ఆడవాళ్ళకేం పని' అనే పాలకనేతల మానసిక స్థితి మారనంత కాలం ఇంతే. ఎంత ప్రతిభ ఉన్నా ఆర్థిక, హార్దిక ప్రోత్సాహం కరమైన పరిస్థితుల్లో, ఆటల్లోనూ అధికార, కులమత రాజకీయ రొచ్చు క్రీడల్లో సైతం చొరబడటం శోచనీయం. ప్రభుత్వాలు మెండి చేయి చూపినా పట్టుదలతో అంతర్జాతీయ పోటీల్లో ప్రతిసారీ దేశ ప్రతిష్టను నిలబెట్టే బాధ్యతను భుజాన వేసుకొంటున్న మగువలను అభినందించాలి. ఇకనైనా, తరతరాలుగా సమాజంలో అణచివేతకు గురైన స్త్రీమూర్తులకు ఇంటా బయటా తగినంత ప్రోత్సాహం, శిక్షణ అందించడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. అతివలంటే అబలలు కాదని నిరూపించిన వీర వనితలకు జేజేలు.