Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బడ్జెట్ అంటే కేవలం అంకెలు.. సంఖ్యలు మాత్రమే కాదు. అది దేశ ప్రజల జీవన ప్రమాణాలు. వారి దైనందిన జీవితాలను ప్రభావితం చేసే అతి కీలకమైన పద్దు...' ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు పదే పదే చెప్పే మాట ఇది. అంటే జనం జీతాలు, భత్యాలు, వాటిపై వేసే పన్నులు, ధరలు తదితరాంశాలతో మిళితమై అనునిత్యం వారి జీవనంపై ప్రభావాన్ని చూపేదే బడ్జెట్. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటుకు సమర్పించిన 2023-24 ఆర్థిక సంవత్సరపు పద్దు మాత్రం పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు, వేతన జీవులకు ఊరట కలిగించకపోగా వారి నడ్డి విరగ్గొట్టేదిగా ఉంది. హిడెన్ బర్గ్ నివేదికలు బయటి కొచ్చినా అలాంటి వాస్తవాలను పట్టించుకోకుండా ఇది మోడీ స్నేహితులైన సంపన్నుల కోసమే రూపొందించిన బడ్జెట్ అని చెప్పేందుకు ఎలాంటి సంశయమూ అక్కర్లేదు. ఇదే సమయంలో ఇది ఫక్తు ఎన్నికల కోణంలో ప్రవేశ పెట్టిన ఒక రాజకీయ పద్దని మాత్రం చెప్పక తప్పదు. ముఖ్యంగా మరో మూడు నెలల్లో నిర్వహించబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఏడాది నిర్వహించాల్సిన పార్లమెంటు ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ను సమర్పించారనేది సుస్పష్టమవు తున్నది. అంతేతప్ప కరోనా సమయంలో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన ప్రజలకు ఊరటనిచ్చేందుకు గానీ, పెరుగుతున్న ధరల అదుపునకుగానీ ఈ బడ్జెట్లో ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటం గమనార్హం.
ఇక తెలంగాణ కోణంలో ఈ బడ్జెట్ను పరిశీలించి నప్పుడు...రాష్ట్రానికి 'శుష్క వాగ్దానాలు- శూన్య హస్తాలే...' మిగిలాయి తప్ప ఒక్కటంటే ఒక్కటీ ఉపయోగపడేది లేదు. గత ఎనిమిదిన్నరేండ్లుగా 'మాకు చాలినన్ని నిధులివ్వండి మొర్రో...' అంటూ బీఆర్ఎస్ సర్కారు వినతులు, విజ్ఞప్తులు చేసినా ప్రధాని మోడీ కనుసన్నల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ కనీసం కనికరం చూపలేదు. చివరి సారిగా సమర్పించిన పూర్తిస్థాయి పద్దులోనూ విభజన హామీల్లోని ఏ ఒక్క దాని గురించీ పట్టించుకోలేదు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఊసే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడ చెవిన పెట్టింది. రాష్ట్రం లోని వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలకు హక్కుగా ఇవ్వాల్సిన రూ.1,350 కోట్ల గురించి చెప్పకుండా మరోసారి మొండి చేయి చూపారు. ఇదే సమయంలో కర్నాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అక్కడి వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.5,300 కోట్లను విత్త మంత్రి కేటాయించటం గమనార్హం. గతంలో దేశవ్యాప్తంగా మొత్తం 157 వైద్య కళాశాలలను ప్రకటించిన కేంద్రం... అందులో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు. ప్రస్తుత బడ్జెట్లోనూ అదే దుస్థితి పునరావృతమైంది. గమ్మత్తేమిటంటే... నర్సింగ్ కాలేజీల ఏర్పాటు విషయంలోనూ గతంలో మాదిరి గానే వ్యవహరిస్తామనటం విడ్డూరం. అంటే రాష్ట్రా నికి ఇప్పుడు కూడా అదనంగా ఒక్క నర్సింగ్ కాలేజీ రాబోదన్నమాట. మరోవైపు వస్త్రాలపై విధించిన జీఎస్టీ, నేతన్నలకు భారంగా మారిన నేపథ్యంలో... దాన్ని ఎత్తేయాలంటూ తెలంగాణ సర్కారు కోరినప్పటికీ నిర్మలమ్మ దయ చూపకపోవటం బాధాకరం. ఇవన్నీ ప్రత్యక్షంగా తెలంగాణకు నష్టం చేకూర్చిన అంశాలు కాగా... పరోక్షంగా రాష్ట్రంలోని పేదలు, రైతులు, కార్మికులపై ప్రభావం చూపే అనేకాంశాలు బడ్జెట్లో దాగున్నాయి. ఉపాధి హామీ పథకానికి గత బడ్జెట్లో రూ.89,400 కోట్లను కేటాయించగా, ఈసారి రూ.60 వేల కోట్లకు ఆ నిధులను కుదించారు. ఇది అనివార్యంగా తెలంగాణలోని పేదలు, వ్యవసాయ కార్మికుల ఉపాధికి గండి కొట్టనుంది. పేదల ఆహార భద్రత కోసం గత పద్దులో రూ.2,87,194 కోట్లను కేటాయించగా... ప్రస్తుత బడ్జెట్లో ఆ కేటాయింపులను రూ.1,97,350 కోట్లకు తగ్గించారు. ఇది రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదల నోటికాడి బువ్వకు ఎసరు పెట్టనుంది. పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం... 2022-23 బడ్జెట్లో పట్టణ స్థానిక సంస్థల కోసం రూ.22,908 కోట్లను ప్రతిపాదించారు. ఆ తర్వాత ఆ కేటాయింపులను రూ.15,026 కోట్లకు సవరించినట్టుగా ప్రస్తుత బడ్జెట్లో పేర్కొన్నారు. గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.46,513 కోట్లను కేటాయించి... రూ.41 వేల కోట్లకు కుదించినట్టుగా పద్దులో ప్రస్తావించారు. ఈ రకంగా స్థానిక సంస్థల నిధుల్లో కోతలు పెట్టటమనేది... తెలంగాణలోని నగరాలు, పట్టణాలు, పంచాయతీల అభివృద్ధికి శరఘాతమే కదా..? ఈ రకంగా చూసినప్పుడు ఆర్థిక మంత్రి గారి పద్దు... రాజ్యాంగంలోని ఆహార భద్రత, పని భద్రత, జీవించే హక్కులకు భిన్నంగా ఉంది. రాష్ట్రాల, ముఖ్యంగా తెలంగాణ హక్కులను హరించేదిగానూ ఉంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అన్ని ప్రాంతాల, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి విఘాతం.