Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొద్ది కాలంగా సినిమారంగ ప్రముఖులు అనేకమంది సెలవంటూ వెళ్లిపోతున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మరణించిన కొద్ది రోజులకే కైకాల సత్యనారాయణ నిష్క్రమించారు. మొన్న సినీ సత్యభామ జమున, నిన్న కళాదర్శకుడు కె. విశ్వనాథ్ మృతి చెందగా, ఇప్పుడు అకస్మాత్తుగా మధురస్వరగాన వాణీ జయరాం వెళ్ళిపోయారన్న వార్త సినీరంగాన్ని ప్రేక్షకులనూ బాధకు గురిచేసింది. వీరంతా దాదాపు యాభైయేండ్లుగా అంతకుపైగా సినిమారంగంలో కళాత్మక సృజనతో కొనసాగినవారే. జేమ్స్ బాండ్ హీరోగా, మాస్ కథానాయకుడుగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కృష్ణ అల్లూరి సీతారామరాజుగా చెరగని ముద్రవేసిన నటుడు ఆయన. ఇక నవరసాలను పలికించగలిగి యముడంటే ఇలానే ఉంటాడనిపించిన సత్యనారాయణ విలన్‌గా, హాస్య నటుడుగా మెప్పించిన నటసార్వభౌముడు. సత్యభామ పాత్రలో తన సహజగుణ నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించి పేరు తెచ్చుకున్న జమున, ప్రజా కళాకారుడు గరికపాటిరాజారావు శిష్యరికంలో, అతను నిర్మించిన 'పుట్టిల్లు' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి అనేక చిరస్మరణీయ పాత్రలలో తన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. వీళ్లంతా పాతతరం వాళ్లే. సినిమా రంగంలోనే కాదు, సమాజంలోనూ అనేక మార్పులు, ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఎంతో పెరిగింది. ఇప్పటి సినిమాతో పోల్చకపోయినా ఆనాటి చిత్రాల ప్రత్యేకత ఏమీ తక్కువ చేయలేము.
సినిమా అనేది మన సామాజిక నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూనే ఉంటుంది. దీంతో సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. రాజకీయ ఆర్థిక ప్రభావాలూ వాటిపై ఉంటాయి. జనం నాడిని పట్టుకోగలిగిన రచయితలు, దర్శకులు జనం ఆదరించే చిత్రాలను నిర్మించ గలుగుతారు. ఇంకొందరు సాధారణ ప్రజల హృదయాలను కదిలించే పనికి తమ కళను ఉపయోగించి చిత్రాలు తీస్తారు. ఇవి అనుభూతి ప్రధానంగా సాగుతాయి. ఇక జీవన వాస్తవికతలను చిత్రిస్తూనే ఉన్నత విలువలను, కర్తవ్యాలను కళాత్మకం చేస్తారు. ఇవి సామాజిక మార్పుల కోసం చైతన్యాన్ని అందిస్తూ ఉంటాయి. ఎన్ని రకాలుగా సినిమాలొస్తున్నా వాటిని ఏ విభాగానికి చెందిందో తేల్చేది కళా విమర్శకులు. కానీ సామాన్య ప్రేక్షకులు మాత్రం కళాసృజనకు ప్రియులుగానే ఉంటారు. అభిమానించే కథానాయకులు, నాయికలూ వారికుంటారు. ఆ చిత్రాలను రచించిన, దర్శకత్వం వహించిన వారిని గుర్తించడమనేది చాలా కాలం తర్వాతే జరిగింది. నటీనటులు ఎవరు అని గతంలో సినిమాలు చూసేవారు. ఇప్పుడు దర్శకులు ఎవరు అని తెలుసుకుని చూడటమూ జరుగుతోంది. ఇదొక పరిణామం.
కె. విశ్వనాథ్ సినిమాలు ఒక తరహా సినిమాలుగా ప్రసిద్ధి చెందినవి. కళాత్మక విలువలతో సినిమా తీస్తాడనే పేరువల్ల ఆయనను కళాతపస్వీ అని కూడా అంటారు. 'శంకరాభరణం' సినిమాతో తెలుగునేలపైనే కాదు, దేశం మొత్తంలోనే ఒక గొప్ప పేరును పొందారు. సంగీత ప్రాధాన్యాన్ని చిత్రీకరించిన సినిమా అది. మన సంప్రదాయ సాహిత్యమూ సంగీతమూ రెండూ కూడా ఆధ్యాత్మిక ధార్మిక సంబంధమైనవిగానే భావిస్తారు. ఆ రకమైన భావాన్నే ఆయన మరింత కళాత్మకంగా చిత్రీకరించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతిలయలు సినిమాలు కూడా సంగీత నృత్య ప్రధానమైనవే. ఇక సప్తపది, శుభసంకల్పం, శుభలేఖ, స్వయం కృషి, సూత్రదారులు మొదలైన చిత్రాలలో సామాజిక సమస్యలను కొంత చర్చించారు. ఇప్పుడున్న వ్యవస్థలోనే సంస్కరణ తేవాలన్న కోరిక తపన ఉన్న దర్శకుడుగా మనం విశ్వనాథ్‌ను చూడవచ్చు. వినసొంపైన సంగీతాన్ని, సాహిత్యాన్ని తిరిగి సినీరంగంలోకి తెచ్చినవాడు, సంప్రదాయ, సంస్కరణ కళా దర్శకుడు విశ్వనాథ్.
ఇక యాభైయేండ్ల పాటు వేయిసినిమాలలో పదివేల పాటలు పాడిన వాణీజయరాం (కలైవాణి) ఆకస్మిక మరణం సినీసంగీత రంగానికి లోటుగానే భావించాలి. విశ్వనాథ్ సినిమాలలో అనేక పాటలు పాడారీమె. 'దొరుకునా ఇటువంటి సేవా', 'ఆనతి నీయవా హరా!', 'మానస సంచరరే..', అందెల రవళిది పదమునదా', 'ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాదీ...' 'ఒక బృందావనం - సోయగం' మొదలైన ఎన్నోపాటలతో శ్రోతల అభిమానాన్ని పొందింది వాణీజయరాం. తమిళనాడులో జన్మించిన వాణి, ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ దగ్గర హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నారు. కర్నాటక సంగీతాన్ని అవపోసన పట్టారు. ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలను బాగాపాడగలిగిన ఆమె పద్దెనిమిది భాషలలో పాటలు పాడారు. ఆమె మొదటి సినిమా పాట హృషీకేష్ ముఖర్జీ సంగీత సారథ్యంలో 'గుడ్డి' సినిమాలోని 'బోల్రే పప్పీ హరా!' అనే పాటకు తాన్సేన్ సమ్మాన్ అవార్డు అందుకున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు జాతీయ అవార్డులందుకున్న ఆమెను పద్మభూషణ్ పురస్కారానికి ఇటీవలనే ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమెది ఒక విభిన్నమైన కంఠస్వరం. పాటలున్నంత వరకూ ఆమెను తలచుకుంటూనే ఉంటాం. రెండు నెలల కాలంలోనే ఇందరు సినీ కళాకారులు మన నుండి దూరమయ్యారు. వారందరికీ కళాంజలి.