Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూసేముందు జిమ్మిక్కులెన్నో! కొన్నింటిని కడుపుమాడ్చి! మరికొన్నింటిని గొంతు నులిమి! ఇంకెన్నింటినో బకాసురుల నోటికందించి! ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటొకటిగా ''కృష్ణా''ర్పణమవుతున్నాయి. మోడీ సింహాసనాధీశుడవడంతో ఊపందుకున్న ప్రక్రియలో తాజాగా బలవబోతున్నది సిసిఐ. ఇప్పటి వరకు పత్తి రైతులకు కాస్తోకూస్తో అండగా ఉన్న భారత పత్తి సంస్థ (సిసిఐ)ను కూడా ఇప్పుడు మూసివేత బాట పట్టించారు. తాజా బడ్జెట్ కేటాయింపులు దానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. పత్తి కొనుగొలుకు ఈ ఏడాది కేవలం లక్షంటే లక్ష రూపాయిలు కేటాయించి చేతులు దులుపుకుంది మోడీ సర్కార్. 'లోగుట్టు పెరుమాళ్ళకెరుక' అన్నట్టు ఈ కేటాయింపులు సిసిఐకి దేనికి సరిపోతాయో ఆర్థిక మంత్రికే తెలియాలి. కేంద్రం ఇచ్చే లక్ష రూపాయిలు వాటి కార్యాలయాల వెలిసి పోయిన బోర్డులకు కొత్త రంగులు వేయడానికి కూడా సరిపోవు అనేది స్పష్టం.
2021-22 బడ్జెట్లో రూ.8,331 కోట్లు ఖర్చు చేస్తే... గతేడాది రూ.9,232 కోట్లు... ఈ ఏడాది ఆ కేటాయింపులు పెంచాల్సింది పోయి మొండిచేయి చూపించింది. ఒకప్పుడు తెల్లబంగారంగా విరాజిల్లిన పత్తి నేడు రైతుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నది. ప్రకృతికి కోపం వచ్చినా, సర్కారు చిన్న చూపు చూసినా నష్టపోయేది రైతులే. దీనికి తోడు బహిరంగ మార్కెట్లో దళారుల జోక్యం, సిండికేట్ వ్యాపారుల కుమ్మక్కు ఇలా సవాలక్ష అడ్డంకులను దాటి పంట పండించినా కొనే దిక్కు లేకపోతే.. ఆ రైతు పరిస్థితేంటి? దేశవ్యాప్తంగా 226.65 లక్షల ఎకరాలల్లో పత్తి సాగుచేస్తున్న రైతుల బతుకులేమికావాలి?
సంపన్నవర్గాలకు కొమ్ముకాసే బడ్జెట్ ప్రతిపాదిస్తూ... వేతనజీవులకు ఊరటనిస్తున్నాం అంటూ ఆర్భాటాలు చేయడం కమల దళ ద్వంద్వ నీతిని తెలియజేస్తోంది. పేద రైతులు, కూలీలకు అండగా ఉండే ఉపాధి హామీ నిధుల్లో 33శాతం కోత విధించడం, ఎరువుల సబ్సిడీలో రూ.50 వేల కోట్లు, ఆహార సబ్సిడీలో రూ.97 వేల కోట్లు, పెట్రోల్ సబ్సిడీలో రూ.6,900 కోట్లు కోత విధించడం ఊరట నివ్వడం ఎలా అవుతుందో వారే చెప్పాలి?
75ఏండ్ల స్వాతంత్ర దేశంలో ఆర్థిక రంగంలో ఇన్ని జిమిక్కులు బహుశా ఎవరూ చూసి ఉండరు. దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన నవరత్నాలను పూర్తిగా నిర్వీర్యం చేసి... డబ్బున్నోళ్ల కబంధహస్తాల్లోకి నెట్టేసి... దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసరచనకు పూనుకున్నది మోడీ ప్రభుత్వం. తోపుడుబండిపై 'హరేక్మాల్' అన్న చందాన ప్రభుత్వ ఆస్తుల్నీ, సంస్థల్నీ ఎంత వీలైతే అంత మేరకు అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నది. ప్రజల ఆస్తులన్నీ కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతూ 'అభివృద్ధిలో దూసుకు పోతున్నాం... అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నాం' అని చెబుతున్న పాలకుల వాగాడంబరం చూస్తోంటే 'ఊపర్ షేర్వాణి... అందర్ పరేషానీ' అన్న సామెత గుర్తుకు రాక మానదు. ఈ తొమ్మిదేండ్ల మోడీ పాలనలో ఏకంగా 23సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించారు. రైల్వేశాఖను ముక్కలు చెక్కలు చేసి ప్రయివేటు సేట్లకు అమ్ముకోవడానికి ఎందుకు సిద్ధపడినట్టు? ప్రపంచంలోనే అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీని సైతం ప్రయివేటు పరం చేయాలని ఎందుకు కంకణం కట్టుకున్నట్టు? బంగారు బాతులను కోసుకొని తినే పనిలో నిమగమైన మోడీ ప్రభుత్వానికి ఈ ప్రశ్నలు సహించడం లేదు. ప్రభుత్వరంగంలో పలు సంస్థలు దేశ స్వాలంబనకు వెన్నెముకగా నిలిచాయి. అద్భుతమైన ప్రగతిని సాధించాయి. అలాంటి ఈ సంస్థలను ఇప్పుడు మోడీ ప్రభుత్వం అంగట్లో వేలానికి పెడుతోంది. రోజూ ఏదో ఒక రంగాన్ని ఎవరో ఒకరికి ధారాదత్తం చేస్తోంది. తాజాగా ఆ జాబితాలోకి సిసిఐ చేరుతోంది.
పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐది ప్రత్యేక పాత్ర. 2022-23ఏడాదిలోనూ పత్తి కొనుగోళ్లు చేపట్టక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో ప్రయివేటు వ్యాపారులదే పైచేయి కావడం... వారి ఇష్టం వచ్చినట్టు ధరలో కోత విధించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తరుణంలో సిసిఐ వాణిజ్య పరంగా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు, వివిధ రైతుల సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తడంతో దిగొచ్చిన సదరు సంస్థ 2022-23 ఏడాదిలో వాణిజ్య కొనుగోళ్లలో దిగింది. కానీ ప్రయివేటు వ్యాపారుల కంటే తక్కువ ధర నిర్ణయించడంతో రైతులెవరూ ఈ సంస్థకు పత్తిని విక్రయించలేదు. దీంతో ఈ వార్షిక ఏడాదిలో సిసిఐ కనీసం కిలో పత్తి కూడా కొనుగోలు చేయలేదు. ఇది మోడీ సర్కార్ ఎత్తుగడలో భాగమే. ఇలాంటివి బూచిగా చూపి రైతుల చెవిలో కమలాన్ని తురమాలని చూస్తోంది. ఇది రద్దు చేసిన రైతుచట్టాలను పరోక్షంగా అమలుచేయడమే.