Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెన్షన్ సంస్కరణల పేరుతో తమ మీద తలపెట్టిన దాడిని ఫ్రెంచి కార్మికవర్గం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 64కు పెంచాలని అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మక్రాన్ చేసిన ప్రతిపాదనకు నిరసనగా మరోసారి మంగళవారంనాడు సమ్మె, నిరసన ప్రదర్శనలు జరిగాయి. శనివారంనాడు ఆందోళన పునరావృతం కానుంది. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగాలన్న అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతోంది. వెనక్కు లాగాలని చూస్తున్న కొందరు కార్మిక నేతలను ఏమిటీ మెతక వైఖరి అంటూ నిలదీస్తున్నారు. పెన్షన్ సంస్కరణలకే పరిమితం కాకుండా మొత్తం ప్రభుత్వ విధానాల గురించి చర్చ సాగుతోంది. 1995 నిరసనల తరువాత కార్మికవర్గం మరోసారి పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఎలాగైనా సరే నిరసనను అణచివేసేందుకు ప్రభుత్వం దారులు వెతుకుతోంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో మక్రాన్ అధ్యక్షుడిగా నెగ్గినప్పటికీ పార్లమెంటులో మెజారిటీని సాధించటంలో అధికారపక్షం విఫలమైంది. దీంతో ప్రతిపక్ష మితవాద పార్టీలను కలుపుకొని పెన్షన్ సంస్కరణల బిల్లును నెగ్గించుకోవటం, లేకుంటే ఓటింగ్‌తో నిమిత్తం లేకుండా అధ్యక్షుడికి ఉన్న అధికారాలతో ఉత్తరువులు జారీ చేయటమా అన్న గుంజాటనలో అధికారపక్షం ఉంది.
ఐరోపాలోని అనేక దేశాల్లో ఉద్యోగ విరమణ వయస్సుతో పోల్చితే ఫ్రాన్స్‌లో తక్కువగా ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పుడు గనుక పెంచకపోతే తరువాత మొదటికే మోసం అంటూ బెదిరిస్తోంది. పెన్షన్ చెల్లింపు సంవత్సరాలను తగ్గించుకొనేందుకు, కార్మికుల నుంచి వసూలు చేసే మొత్తాలను పెంచేందుకు అనేక దేశాల్లో పాలకవర్గం చూస్తోంది. వివరాలను చూసినపుడు పూర్తి మొత్తం పెన్షన్ పొందాలంటే కార్మికులు నిర్ణీత ఉద్యోగ విరమణ వయస్సుకంటే ఎక్కువ సంవత్సరాలు పని చేయాల్సి వస్తోంది. ఫ్రాన్సులో 62 ఏండ్లే ఉన్నప్పటికీ 64.5 సంవత్సరాలు చేస్తే తప్ప పూర్తి పెన్షన్‌కు అర్హత రావటం లేదు. నిర్మాణం వంటి కొన్ని రంగాలలో యజమానులు వృద్ధులుగా ఉన్న వారిని పనిలోకి తీసుకొనేందుకు నిరాకరిస్తుండటంతో పాక్షిక పెన్షన్ మాత్రమే లభిస్తోంది. అదే విధంగా మహిళలు ప్రసూతి ఇతర కారణాలతో తీసుకొనే సెలవుల వలన వారు కూడా ఎక్కువ సంవత్స రాలు పని చేయాల్సి వస్తోంది. అందువలన మక్రాన్ ప్రభుత్వం మరో రెండు సంవత్సరాలు అధికారికంగా పెంచితే ఆ మేరకు అదనంగా పనిచేయాలి. పూర్తి పెన్షన్ పొందాలంటే 43 సంవత్సరాల పాటు సర్వీసులో ఉండాలి.
మంగళవారంనాడు నిరసన ప్రదర్శనల్లో ఉన్నవారు ఏడున్నరలక్షల మంది అని అధికారులు చెప్పినప్పటికీ కార్మిక సంఘాల సమాచారం ప్రకారం 20లక్షల మంది కార్మికులు పాల్గొన్నట్లు అంచనా. ఒక్క పారిస్ నగరంలోనే నాలుగు లక్షల మంది ఉన్నారు. రైలు, విమాన,బస్సు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది, పెట్రోలు బంకులు పని చేయలేదు. నిరసన ప్రదర్శనలు, దిగ్బంధనం, సమ్మెలో అనేక చోట్ల టీచర్లు, విద్యార్థులు, పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించే వారు పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటూ ప్రతిపక్ష మితవాద పార్టీలను అధికారపక్షం కోరుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పెన్షన్ సంస్కరణలపై వామపక్ష ఎంపీలు కార్మికవర్గం తరఫున గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సోమవారంనాడు సమావేశం వాడివేడిగా జరిగింది. అడుగడుగునా అడ్డు తగలటంతో వచ్చే పదిహేను రోజులూ ఇలాగే సభను సాగనివ్వరా అంటూ మక్రాన్ మండిపడ్డాడు. అవును అంటూ ప్రతిపక్షం అంతే గట్టిగా చెప్పింది.
పార్లమెంటులో మెజారిటీ లేనందున ప్రభుత్వం ప్రజాస్వామ్యవిరుద్దమైన చర్యలకు పూనుకొనేందుకు సిద్దమవుతోంది. రాజ్యాంగంలోని 49.3 నిబంధన ప్రకారం చర్చతో నిమిత్తం లేకుండా ఉత్తరువుల జారీకి అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టి పాలకపార్టీని ఓడిస్తే కొత్తగా ఎన్నికలు జరపటం తప్ప మరొక అవకాశం లేదు. ప్రతిపక్ష పార్టీలు అందుకు సుముఖంగా లేనందున మక్రాన్ ముందుకు పోవచ్చు. మరొక నిబంధన ప్రకారం 50 రోజుల పార్లమెంటు చర్చల తరువాత కూడా ఆర్థిక అంశాలకు ఆమోదం పొందకపోతే అధ్యక్షుడి ప్రత్యేక అధికారాలను వినియోగించి అమలు జరపవచ్చు. ఇంతవరకు ఈ అస్త్రాన్ని ఏ ప్రభుత్వమూ ఉపయోగించనందున అది మరింత పెద్ద రాజ్యాంగ చర్చకు దారితీస్తుంది. వామపక్షాలు మినహా మిగిలిన మితవాద ప్రతిపక్షాలన్నీ అధికారం కోసం తగాదా పడటం తప్ప కార్మిక వ్యతిరేక సంస్కరణల మీద పెద్దగా పట్టుబట్టే అవకాశం లేదు. పశ్చిమ దేశాల్లో మాంద్యం ముంచుకు వస్తున్నందున పాలకవర్గం ఎంతకైనా తెగించే అవకాశం ఉంది. అందువలన పాలకవర్గంతో పాటు ఫ్రెంచి కార్మికవర్గానికి కూడా ఇది ఒకసవాలు వంటిదే.