Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెట్టుబడి'కి పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో పాటు ప్రపంచమంతటా మాంద్యం మేఘాలు ఆవరించాయి. సంపద కేంద్రీకరణ వినాశకర విధానాల వల్ల ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దశలో కోవిడ్ మహమ్మారి ముంచెత్తడం, లాక్డౌన్లు తదితర పరిణామాలతో మళ్లీ కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే ఎత్తుగడలనే పాలకులు అవలంబించడంతో ఎక్కడికక్కడ ఆర్థిక అసమానతలు పెరిగి సంక్షోభం మరింతగా ముదిరింది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం కారణంగా, రైల్వే సిబ్బంది, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇతర రంగాల ఉద్యోగులు సమ్మెలతో హోరెత్తిస్తున్నారు. లక్షలాది మంది ప్రజానీకం వీధుల్లోకి వచ్చి సంఘీభావం తెలియజేస్తూ ప్రజా ఐక్యత చాటుతుండటం హర్షణీయం. ఫ్రాన్స్‌లో పెన్షన్ వయస్సును 64ఏండ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ 11లక్షల మందికి పైగా కార్మికులు రెండు వారాల్లో రెండోసారి నిరసన చేపట్టారంటే ఆర్థిక సంక్షోభ ప్రభావాలు వారిపై ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో రవాణా కార్మికుల సమ్మె సైతం పెట్టుబడిదారీ దోపిడీపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహంలో నుంచి పుట్టుకొచ్చిందే. శ్రీలంక, ఆ తరువాత పాకిస్థాన్ ఇలా ఒక్కొక్కటిగా ఆసియా దేశాలు కూడా సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలతో భారత్ కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిందే దరిమిలా మౌలిక, సేవా, ఆహార రంగాలన్నింటిని అంబానీ, అదానీలకే దోచిపెడుతున్న వైనాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ కుంభకోణం... దానికి బ్యాంకులు, ఎల్ఐసీ వంటి విత్త సంస్థలు రూ.వేలాది కోట్లు రుణాలు కుమ్మరించినందున దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంకెంతటి ప్రభావం చూపనుందో!
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి దారీ దేశాలను కుదిపేస్తున్న ప్రజాందోళనలకు కారణం ఆయా దేశాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న నయా ఉదారవాద విధానాలే. సంక్షోభం అనేది 'పెట్టుబడి' విత్తులోనే దాగుందన్నది మార్క్సిజం ఏనాడో చెప్పింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సంక్షేమ రాజ్య విధానాలు అనుసరించిన పెట్టుబడిదారీ దేశాలు.. ఆ తర్వాత థాచర్-రీగన్ సూత్రీకరణలతో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి మార్కెట్‌కు దోచిపెట్టడమే ప్రధాన బాధ్యతగా నయా ఉదారవాద దోపిడీ మంత్రాంగాన్ని జపిస్తూవచ్చాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థల మాటున రుణాలు ఎరగా వేసి పేద, వర్థమాన దేశాలను పెట్టుబడిదారీ దేశాలు నడ్డివిరుస్తూ వస్తున్నాయి. విత్త సంస్థల షరతులతో పాలకులు మోకరిల్లడంతో శ్రామికులు, రైతులు, సాధారణ ప్రజానీకం బతుకులు అగమ్యగోచరంగా మారిన సంగతి విదితమే. స్వేచ్ఛా వాణిజ్యం మాటున పెట్టుబడిదారీ గుత్తాధిపత్యానికి అన్ని రంగాలలో స్వేచ్ఛను అనుమతించడంతో ప్రపంచంలో అసమానతలను ఆకాశమంత పెరిగిపోయాయి.
ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలతో సహా ప్రస్తుత ఆర్థిక మాంద్యం మేఘాలు ఆవరించడానికి కోవిడ్‌ను, రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని పెట్టుబడిదారీ దేశాలు సాకుగా చెబుతున్నాయి. వాస్తవానికి 2008లో అమెరికాలో మొదలైన ప్రపంచ సంక్షోభానికి ఇది కొనసాగింపే తప్ప కొత్తగా పురుడుపోసుకున్నది కాదు. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్ద టెక్ కంపెనీలన్నీ ఉద్యోగుల తొలగింపును ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. గత ఏడాది టెక్ కంపెనీలు లక్షన్నర మందికి పైగా ఉద్యోగులను ఇళ్లకు పంపినట్లు అంచనా. రోబోల కంటే హీనంగా వేతనజీవులను అమెజాన్ రాచిరంపాన పెడుతోందంటూ గతవారం బ్రిటన్‌లోని అమెజాన్ కార్మికులు సెంట్రల్ ఇంగ్లండ్‌లోని కంపెనీ గిడ్డంగి వద్ద సమ్మె చేపట్టారు. ఒక్క అమెజానే కాదు... కార్పొరేట్ కంపెనీలన్నీ ఇదే తీరుతో శ్రమదోపిడీకి పాల్పడుతున్నా..పాలకులు నోరు మెదపడం లేదు. సులభ వ్యాపార ర్యాంకింగ్‌లో పోటాపోటీగా కార్పొరేట్ సేవలో పునీతమవుతున్నారే మినహా కష్టజీవుల గోడుపట్టడం లేదు. భారత్‌లో ఆర్థిక సంక్షోభాన్ని కప్పిపుచ్చేందుకు జాతియత, మెజారిటీ మతన్మోద ఆగడాల కత్తి దూస్తోంది. ఈ దరిమిలా విశాల ఐక్య వేదికలు నిర్మించి అటు కార్పొరేట్ దోపిడీనీ, ఇటు మతోన్మాద దాడులను తిప్పికొడితోనే ప్రజానీకానికి మనుగడ.