Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆవే మన జీవం! ఆవే మన దైవం! ఆవును మించిన జీవులే లేవు! ఆవు లేక నేను లేను నీవు లేవు, అసలు ఆవు లేక ఏ పదవులూ లేవు'' అన్న చందంగా మారింది ఏలినివారి తీరు. ఇప్పటికే వీరికి ఈ ''ఆవు జపం'' ఓ అధికార సోపానంగా మారి చాలా కాలం కాగా, ఇప్పుడిది చాలదన్నట్టు దేశంలో జనమందరూ ఆవును కౌగిలించుకోవాలట! అందుకోసం ఇకపై ఫిబ్రవరి 14న ''లవర్స్ డే'' బదులు ''కౌ హగ్ డే'' జరుపుకోవాలట! కావునా మనమిప్పుడు మనుషుల్ని ప్రేమించడం మానేసి కేవలం ఆవుల్ని కౌగిలించుకోవాలన్నమాట. ఇది ఏ 'పరివారం' పిలుపో అనుకుంటే పొరపాటు. సాక్షాత్తూ భారత ప్రభుత్వ జంతు సంక్షేమ శాఖ వారి ఉత్తర్వు కావడం వైచిత్రి! ఈ ఉత్తర్వులకు గల కారణం ఏలినవారి తెరచాటు సందేశమో, లేక వారి మనసెరిగి నడచుకోవాలన్న శాఖాధిపతుల తాపత్రయమో తెలియదుగానీ ఇది అధికారం దుర్వినియోగం మాత్రమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా. అందుకే వెల్లువెత్తిన విమర్శల ధాటికి ఏలినవారు వెనక్కు తగ్గక తప్పలేదు. బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం శుక్రవారం నాటికి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
ఈ ఉపసంహరణ ఆహ్వానించదగిందే. కానీ, ఉత్తర్వులు వెలువడటమే ఆలస్యమన్నట్టుగా 'పరివారం' ఊరుకున్నారా? ఆవు మహత్యం గురించి స్తోత్రాలు మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ పశుసంవర్దకశాఖ మంత్రి ధరంపాల్ సింగ్ అయితే... ఆవు పేడలో, ఆవు మూత్రంలో ఉన్న అనేకానేక ఔషధగుణాల గురించి మీడియా ముందు ఏకరువు పెట్టారు. కేవలం ఆవు స్పర్శతోనే వ్యాధులన్నిటి నుంచీ విముక్తి పొందవచ్చని సెలవిచ్చారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ప్రవచనాలే ఇంకా అనేకానేకం...! వీరి నుండి ఇలాంటి అశాస్త్రీయ ప్రవచనాలు కొత్తేమీ కాకపొయినా, ఇప్పుడు ప్రభుత్వ శాఖలే ఇందుకు పూనుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇది శాస్త్రీయ సమాజ నిర్మాణమనే రాజ్యాంగ లక్ష్యానికే విరుద్ధం. ఈ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న మరికొన్ని విషయాలను పరిశీలిస్తే ఇది మరింత స్పష్టంగా బోధపడు తుంది. వైదిక సంప్రదాయంలో గోమాతకున్న పవిత్రతను తెలియచేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని యానిమల్ వెల్ఫేర్ బోర్డు ప్రకటించడం ఇక్కడ గమనార్హం. ఇది రాజ్యం మతాతీత మైనదని చెప్పే లౌకిక సూత్రాలకే సవాలు కదా?! కాబట్టే ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటూ, ఒక మతాన్ని, ఆ మతానికి చెందిన మధ్య యుగాల నాటి సనాతన భావాలను ప్రచారం చేసే ఉద్దేశపూర్వక ప్రయత్న మంటూ విమర్శలు, నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రం నిర్ణయాన్ని తిప్పికొట్టాయి.
''ఆవులనే కౌగిలించుకోవాలా? మరి కుక్కలు, పిల్లులు ఏం పాపం చేశాయి'' అంటూ సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ సంధించిన వ్యంగాస్త్రాలకు కొదవేలేదు. ''ఆవుకు ఇష్టం లేకపోతే తన్నుద్దేమో... కౌ హగ్ డే కు కేంద్రం శిక్షణిస్తే మేలు'' వంటి నెటిజన్స్ కామెంట్స్ కోకొల్లలు. రాజకీయ క్షేత్రంలోనూ విమర్శలకు తక్కువేం లేదు. ''మీరు మాత్రం అదానీని కౌగిలించుకుంటూ జనాన్ని మాత్రం ఆవుల్ని కౌగిలించుకోమంటారా'' అంటూ సంజరు రౌత్ వంటి నేతలు సూటిగానే ప్రశ్నించారు. కేరళ చిత్రకారుడు అభిలాష్ తిరువోత్ గీసిన భావయుక్తమైన చిత్రం ఆసక్తి కలిగించగా, మరో కవి మిత్రుడు రవీంద్రుని ప్రఖ్యాత కవితా శైలిని అనుకరిస్తూ రాసిన పంక్తులు అలోచనలు రేకెత్తించాయి. ఇవన్నీ వివిధ వేదికలపై, వివిధ రూపాల్లో వెల్లువెత్తిన నిరసనలకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు. ఇప్పటికే ఫిబ్రవరి 14 'ప్రేమికుల దినోత్సవం' రోజున పరివార్ ప్రేరేపిత మూకల ఆగడాలకు అంతూపొంతూ లేదు. అలాంటిది ఇలా అధికారిక పోటీ కార్యమ్రానికి అవకాశమిస్తే అది ఎలాంటి దారుణాలకు దారితీస్తుందీ? అందుకే ప్రజల్లో ఇంతటి నిరసన పెల్లుబుకుతోంది. కావునే మరోసారి ఆవును పావుగా వాడుకోవాలనే వ్యూహాన్ని కేంద్రం విరమించుకుంది. ఎవరికైనా ప్రజలు గురువులనుకుంటే దారి సక్కగుంటది, కాదు గొర్రెలనుకుంటే బుద్ధి గడ్డి తింటదనడానికి ఇదొక ఉదాహరణ.
నిజానికి ఆవు మీద వీరి కారుణ్యానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. కానీ అందుకు ఆవుకు మాత్రమే అర్హత ఉందనే రాజకీయాలను మానవత్వమున్న ప్రజలు ఎలా అంగీకరిస్తారు. ఆవు సాధు జంతువు. ప్రజల జీవితం కూడా ఆవును అల్లుకునే ఉంటుంది. కనుక ఆవును కౌగిలించుకోవాలని వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మనుషుల్ని చంపైనా సరే ఆవుల్ని కాపాడాలని చెప్పే క్రూర స్వభావం గల వారికి మాత్రం ఆవును కౌగిలించుకోవడం అత్యంత అవసరం. అలాగైనా దాని సాధుస్వభావం వీరికి అలవడితే అంతకు మించిన ప్రయోజనమేముంటుంది. అయినా నిన్నటి బడ్జెట్లో ఆవుల మేతకు రాయితీలివ్వడానికి కూడా చేతులరు రాని వారికి ఆవు మీద ఇంతటి ''అపారమైన ప్రేమ'' ఎందుకు అన్నది అంతుచిక్కని రహస్యమేమీ కాదు. ఆవు ప్రపంచ వ్యాపితంగా పాలు మాత్రమే ఇస్తుంది. కానీ ఈ దేశంలో ఓట్లు కూడా ఇస్తుంది మరి...!