Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేర్లు మార్చడం, నిర్మాణాలు కూల్చడం, ఇదే మన మనుగడకు మూలమని తలుస్తున్నారు కాషాయనాధులు. వాళ్ళు చేయగలిగింది ఇంకేమున్నది మరి! చెప్పుకోవటానికీ ఏమీలేదు కదా! ఇక చేయగలిగింది ఇదొక్కటే. కట్టడాలు కూల్చడంలోంచే ఎదిగినవారు వాళ్లు. కూలగొట్టడం, విద్వేషాన్ని మూటగట్టడం, విభజన చిచ్చును రెచ్చగొట్టడం మొదలైనవాటిపై నుండే అధికారాన్ని వెంటబెట్టుకుంటున్న వాళ్లు. ఒక్క కట్టడాలే కాదు, తరతరాలుగా ఈ నేలవాసులు నిలుపుకున్న సౌహార్థతను, సహనశీలతనూ కూల్చేపనికి పూనుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కూలుస్తున్నారు. ప్రజాస్వామిక, లౌకిక విలువలనూ శిథిలం చేస్తున్నారు. డెబ్బయిఐదేండ్లుగా నిలబెట్టుకున్న మన రాజ్యాంగ మౌలిక సూత్రాలను, దాని ఉనికినీ కూల్చేసే ప్రయత్నాలూ చేస్తున్నారు. వీళ్లయినా మా బతుకులు మారుస్తారేమో అని ఆశపడ్డ ఈ దేశపు అశేష ప్రజల ఆకాంక్షలను కూల్చేసారు. దేశానికి అన్నం పెట్టే రైతుల జీవితాలనూ, సంపద సృష్టికర్తలైన కార్మికుల భవితను కూల్చారు. ఆఖరికి ప్రతిపక్ష ప్రభుత్వాలనూ అక్రమంగా కొల్లకొట్టారు. కూల్చడం వినా ఏమున్నది వీరి చరిత్ర.
ఇప్పుడు మన తెలంగాణలో కాషాయనాధుని ప్రకటన, వారి నైజాన్ని పునరనుద్ఘాటించింది. మేము అధికారంలోకి వస్తే సచివాలయ గుమ్మటాలను కూల్చేస్తామని, అవి నిజాం వారసత్వ నమూనాలుగా ఉన్నాయనీ వాటిని సమూలంగా తుడిచేస్తామని గర్జించారు. ప్రజలు అధికారమిచ్చేది కట్టడాలను కూల్చటానికా? నూతనంగా ఏదైనా నిర్మించడానికా! ప్రజలకు పేదలకు అందవలసిన తిండి, ఇల్లు, బట్ట, చదువు, వైద్యం, ఉపాధి మొదలైన విషయాలపైన వీరి డిమాండ్లుండవు. వాగ్దానాలూ ఉండవు. కూల్చడం మార్చడంపైనే వీరి దృష్టింతాను. అంతకు ముందు వీరి అనుచరులు కుతుబ్ మినార్నూ, తాజ్మహల్నూ కూలుస్తామన్నారు. వీరి ఈ కూల్చే విధానాలు వింటుంటే 1952లో నిర్మించిన బాలీవుడ్ సినిమా 'బైజు బావ్పా'లో రఫీ పాడిన పాటలోని చరణం గుర్తుకొస్తుంది. అందులో... ''మందిర్ గిర్తా, ఫిర్ బన్ జాతా, దిల్‌కో కౌన్ సంభాలే!'' అని అంటాడు. అవును కదా! భౌతిక నిర్మాణాలు కూలగొడితే మళ్ళీ నిర్మించుకుంటారు. కానీ మనుషుల హృదయాలు అలాకాదు కదా! వీళ్ళకు మనుషుల గురించీ వారి హృదయాలు, బాధల గురించి ఆలోచనలే లేవు.
మొన్ననేమో ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్భయి ఐదేండ్లు అయిన సందర్భంగా ఈ మార్పు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఢిల్లీ యూనివర్సిటీలోని నార్త్ క్యాంపస్‌లో ఉన్న మొగల్ గార్డెన్‌ను గౌతమబుద్ధ సెంటినరీ గార్డెన్‌గా మార్చినట్టు అధికారులు చెప్పారు. అంతేకాదు, అది మొఘల్ డిజైన్ ప్రకారం లేదనీ సెలవిచ్చారు. మొఘల్ గార్డెన్స్ అనేవి పర్షియన్ శైలిలో నిర్మించిన తోటలు. చార్బాగ్ విధానంలో కట్టినవి. పానిపట్టు యుద్ధంతో ఇక్కడ మొఘలుల సామ్రాజ్యం మొదలయింది. బాబరు మొదట నిర్మించిన గార్డెన్ ఆగ్రాలోని ఆరామ్ బాగ్. ఈ నిర్మాణాలు వారి ప్రియమైన సామ్రాజ్య కాలక్షేపం. ఆ తర్వాత ఇవి ఇండో ఇస్లామిక్ నిర్మాణ రీతిని అభివృద్ధి చేశారు. బాబరు తర్వాత అక్బర్ అనేక తోటలను నిర్మించాడు. గోల్బాగ్ అనేది భారత ఉపఖండంలో నమోదు చేయబడిన అతిపెద్ద ఉద్యానవనం. జమామసీదు, ఫతేపూర్ సిక్రి, ఆగ్రాఫోర్ట్, బులంద్ దర్వాజ, షాలిమార్ గార్డెన్స్, లాహౌర్ఫోర్ట్, తాజ్‌మహల్, వీటి పేర్లన్నీ మారిస్తే చరిత్ర మొత్తం మారిపోతుందా! పేర్లను చెరిపేస్తే కొత్త చరిత్ర నిర్మాణం కాదు. ఏ కట్టడాలయినా రాజుల తమ రాజ్యాధికారానికి చిహ్నంగా మలచినవే అయినప్పటికీ అవి అంత అందంగా సౌందర్యాత్మకంగా వెలుగొందటానికి ఆనాటి నిర్మాణ కార్మికులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు శ్రమేకారణం. కట్టడాల్లో వారి పేర్లేవుండవు. తాజ్‌మహల్‌ని చూసి, దాని అందానికి ముగ్ధుడవ్వని వాళ్లు ఉంటారా! ఒక చారిత్రక కట్టడాన్ని మతం, కులం, జాతి ఆధారంగా చూడటమేకాక, దాన్ని ధ్వంస మొనర్చాలనుకోవడం మూర్ఖమైన ఆలోచన. అవన్నీ ఇక్కడి సామాన్యుల చేతుల్లోంచి సృష్టించబడ్డవే. ఒక్క కట్టడాలే కాదు, ఆహారము, వస్త్రధారణ, సంప్రదాయాలు, భాషలు, సంగీతము, సాహిత్యము అనేకంగా ఆదాన ప్రదానాలు ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్నవే. అలా జరిగిన మూలాన్నే అనేక కొత్త రీతులు, నైపుణ్యాలు పెంపొందాయి కూడా. వాటిని చెరిపేయాలని అనుకోవడం వెర్రితనమే. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయి అన్నట్టు.... ''ఇంతకు ముందులాగా నేను మొఘలారు పరోటా, ముర్గ్ము సల్లంలను తినవచ్చునా? లేక వాటి పేర్లను మార్చుకోవాల్సిందేనా? బాలివుడ్ సినిమా 'మొఘల్ ఏ ఆజం' పాట వింటున్నాం... ఎవరూ ఆ సినిమా పేరు మార్చమని అడగరనే ఆశిస్తున్నా...' అని ప్రకటించడం కంటే ఏం చేయగలరు? ఇప్పుడు వాళ్లు అలవాటు చేసిన బిర్యాని, సెమ్యా పాయసం తినటం కూడా మార్చేస్తారా! మానేస్తారా!