Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ దశాబ్ధకాలంలో తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఒక్క ఏడాదిలోనే దాదాపు 2.25లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారంటూ స్వయంగా విదేశాంగ మంత్రి జైశంకరే రాజ్యసభలో తెలియజేశారు. ఎందుకీ పరిస్థితి ఇంత ఘోరంగా తయారైంది. ఈ దుస్థితికి కారణమెవరు? విదేశాల్లో చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయ యువత సంఖ్య పెరుగుతోంది. ఎంట్రీ లెవల్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ వరకు... బ్లూ కాలర్ టు వైట్ కాలర్ ప్రొఫెషనల్స వరకు... విదేశీ ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారి సంఖ్య ఏటికేడు గణనీయంగా పెరుగుతోంది. వర్క్ వీసాలు, వర్క్ పర్మిట్లు... ఇలా ఎన్ని నిబంధనలున్నా... విదేశీ కొలువులు చేజిక్కించుకోవడంలో మనవాళ్లు శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున విదేశీ ఉద్యోగాల్లో కొలువు దీరుతుండటం విశేషం. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధి కోసం పలు దేశాల్లో స్థిరపడ్డవారు న్నారు.
'అచ్చేదిన్' హామీతో 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మరో ఏడాదిలో మూడో మారు ఎన్నికలకు సిద్ధం కాబోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాకాశాలు కల్పించడం తమ ధ్యేయమని మోడీ చెప్పిన మాటలన్ని జుమ్లాలే అని తెలిపోయింది. యువతకోసమే నా తాపత్రయం అంటూ నెలలో 20రోజులు విదేశాల చుట్టూ తిరిగే మోడీ సార్... ఉద్యోగాలు అడిగితే పకోడిలు అమ్ముకోమని ఉచిత సలహా పడేశారు. ఏదేశ నిర్మాణానికైనా యువతరమే కీలకం. కానీ మన దేశంలో యువత పరిస్థితేమిటి? అభివద్ధిలో వారి పాత్ర ఏమిటి..? నిజానికి అపారమైన మానవ వనరుల నెలవు మన దేశం. జనాభాలో 50శాతానికి పైగా యువజనులే..! ప్రపంచంలో మరేదేశానికీ ఇంతటి యువసంపత్తి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ, ఇప్పుడీ యువతరం విదేశీ బాట పట్టడమే కాదు. ఈ దేశ పౌరసత్వాన్ని కూడా తృణప్రాయంగా వదులుకోవడం అత్యంత విషాదం. ప్రగతి లక్ష్యాల్ని అలవోకగా వల్లెవేసే ప్రభువులకు యువతరాన్ని భారత భాగ్యవిధాతలుగా రూపొందించే పటుతర కార్యాచరణే లేదన్నది పచ్చి నిజం.
'ఎక్కడ స్వచ్ఛమైన వివేకధార ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ నిరంతర ఆలోచన, ఆచరణ వైపు నీవు బుద్ధిని నడిపిస్తావో... ఆ స్వేచ్ఛాస్వర్గానికి నా దేశాన్ని మేల్కొలుపు'- అని గీతాంజలి సమర్పించాడు విశ్వకవి. దోపిడీ పీడనల పరాయి ఏలుబడికి భరతవాక్యం పలికేలా ప్రాణాల్నే పణంగా పెట్టిన కోట్లాది జనావళి అవిరళ త్యాగనిరతే దారిదీపమైతే ఏడున్నర దశాబ్దాల గణతంత్రం ఇప్పటికే స్వేచ్ఛాస్వర్గం అయి ఉండేది. కానీ, దేశ ప్రగతికి చోదక శక్తులుగా భావితరాల్ని తీర్చిదిద్దలేని ఏలికల మందభాగ్యంతో 'ఆశలు ఆకాశంలో- అవకాశాలు పాతాళంలో' అన్న చందంగా నిట్టూర్పు సెగలే ఇప్పటికీ యువతను చుట్టుముడుతున్నాయి. జాతి నిర్మాణంలో క్రియాశీల భూమిక పోషించగలిగేలా యువతరాన్ని నైపుణ్య శక్తులుగా ఇప్పటికీ తీర్చిదిద్దుకోలేకపోవడం దిగులు పుట్టిస్తోంది. ప్రపంచమంతా సైన్సు అండ్ టెక్నాలజీతో ముడిపడి అభివృద్ధి చెందుతుంటే, మన విద్యావిధానం అందుకు భిన్నంగా తిరోగమన బాట పట్టింది. ఈ చదవులతో ప్రపంచంతో పోటీ పడటం అసాధ్యం. పురోగమనాన్ని అందివ్వలేని చదువులు అనవసరమని భావించిన యువత, అవి పుష్కలంగా ఉన్న చోట చదువుకోవడానికైనా, ఉద్యోగంతో పాటు సిర్థపడటానికైనా ఆసక్తి చూపుతుంది. తత్ ఫలితమే ఈ విదేశీ బాట.
ఒకవైపు చదువుకు తగిన ఉపాధిలేక, ఉపాధికి అవసరమైన చదువు అందక నిరుద్యోగం దినదిన ప్రవర్థమానమవుతుంటే, మరోవైపు దేశంలో ప్రబలుతున్న అసహనం, అరాచకం, మతోన్మాదం, దిగజారుతున్న విలువలు యువతరం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తమ ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధిని అందిపుచ్చుకొని యువత అభివృద్ధిలోకి రావాలంటున్నారు మోడీ గారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కోటికి పైగా ఖాళీలు ఉన్నట్టు పార్లమెంటులోనే మోడీ సర్కార్ నిసిగ్గుగా ప్రకటించుకుంది. ఈ ఏనిమిదేండ్లల్లో 22కోట్ల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం 7లక్షల మందికే ఉపాధి దక్కింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భ్రమలకు కొనసాగింపుగా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి నినాదాలతోనే ఇప్పటి వరకూ మోడీ సర్కార్ నిరుద్యోగులను వంచించింది. పాలకులు ఉద్బోధలను పక్కన పెట్టి, జీవన నైపుణ్యాలను పాఠశాల స్థాయి లోనే ప్రవేశపెట్టి పనికొచ్చే చదువులతో భావితరాల్ని తీర్చిదిద్దే మహాక్రతువును ఆరంభించాలి. 'ఎంత చదువుకు అంత నిరు ద్యోగిత'గా గుల్లబారిన వ్యవస్థను ప్రక్షాళించి, రేపటి అవసరాలకు ధీటైన జాతి రత్నాలుగా తీర్చిదిద్దగలిగితేనే ఈ దేశానికి భవిష్యత్తు.