Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రాష్ట్రంలో గిరిజనాభ్యుదయం..', 'బడి ఎరుగని ఆదివాసీ పల్లెలు..', 'అర్థరాత్రి.. అటవీ ప్రాంతం.. మార్గమధ్యంలో ప్రసవం...' మూడు ప్రధాన తెలుగు పత్రికల్లో ప్రధాన శీర్షికలతో బుధవారం ప్రచురితమైన కథనాలివి. మొదటిది మొన్నటి బడ్జెట్లో గిరిజనులు, ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను వివరిస్తే... మిగతా రెండూ కేటాయింపులున్నా, అవి ఖర్చు చేయకపోవటం, ఫలితంగా ఆదివాసీలు పడుతున్న గోసను ఏకరువు పెట్టే కథనాలు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75ఏండ్లు దాటినా ఇప్పటికీ అనేక గిరిజన తండాలు, ఆదివాసీ పల్లెల్లో మలేరియా, టైఫాయిడ్ బారిన పడి అమాయకులు మృత్యువాత పడుతున్న ఉదంతాలు కోకొల్లలు. ఇక్కడే పాలకుల వైఫల్యాలు మనకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి.
విద్య, వైద్య రంగాలు బాగున్న దేశాలు, రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నాయనేది అనుభవం చెబుతున్న నిజం. అవి రెండూ ప్రభుత్వ రంగంలో ఉండి... ప్రజలకు మెరుగ్గా సేవలందించగలిగితే మానవాభివృద్ధి సూచికలు సైతం పైపైకి ఎగబాకుతాయి. కానీ బడ్జెట్లలో అంకెలు, సంఖ్యల చుట్టూ తమ రాజకీయాలను తిప్పుతూ పబ్బం గడుపుకునే మన పాలకులు మాత్రం... ఆ రెండు రంగాలను కార్పొరేట్, ప్రయివేటుకు అప్పజెప్పేశారు. ఈ క్రమంలో మైదాన ప్రాంతాల్లో సైతం విద్య, ఆరోగ్యం పేదోడి దరికి చేరటం లేదు. ఇక అటవీ ప్రాంతాల్లోని గిరి పుత్రులకు ఇవి అందని ద్రాక్షలే. కొద్ది నెలల క్రితం ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఒక గర్భిణీ.. ఆమె కడుపులో ఉన్న బిడ్డతో సహా మరణించిన హృదయ విదారక ఘటనను చూశాం. తాజాగా నిర్మల్ జిల్లాలోనూ అర్థరాత్రి... అటవీ ప్రాంతంలో ఓ ఆదివాసీ మహిళ ప్రసవించింది. అంబులెన్సు రావటానికి కూడా దారిలేని దుస్థితిలో ఎడ్లబండే తొలుత ఆమెకు అంబులెన్సయింది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల దుస్థితి... అక్కడి అడవి బిడ్డలను చదువులకు దూరం చేస్తున్నది. ఇప్పటికీ ఆ జిల్లాలో అసలు బడులే లేని గ్రామాలు 20 వరకు ఉన్నాయంటే వారి పట్ల మన పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఎస్టీల అభివృద్ధికి మొత్తం రూ.89,838 కోట్లను కేటాయించినట్టు సర్కారు చెబుతున్నది. 2014-15లో వారికోసం రూ.4,539 కోట్లను కేటాయిస్తే... రాబోయే ఆర్థిక సంవత్సరాని (2023-24)కి రూ.14,388 కోట్లను కేటాయించినట్టు విత్త మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రకటించారు. ఈ రకంగా ఎనిమిదిన్నరేండ్ల నుంచి ఇప్పటిదాకా గిరిజనాభివృద్ధికి నిధులు కేటాయింపులు పెరుగుతున్నప్పటికీ వారి ఎదుగుదల మాత్రం 'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే...' అన్న చందంగా ఉండటం విస్మయకరం. అంటే వారికి కేటాయించిన నిధులను ఖర్చు చేయటం లేదా..? ఒకవేళ ఖర్చు చేసినా ఒక నిర్దిష్ట పద్ధతి లేకుండా వ్యయం చేస్తున్నారా..? లేక ఎలాగూ నోరు లేదు కదా అని ఎస్టీల నిధులను ఇతర రంగాలకు మళ్లిస్తున్నారా..? అనేది ఇక్కడ తేలాల్సిన విషయం. అది తేలితేనే అసలు సమస్యకు సిసలైన పరిష్కారం దొరుకుతుంది.
ఇక్కడే మనం ఒక విషయాన్ని కచ్చితంగా ప్రస్తావించుకోవాలి. కేరళలో మారుమూల ప్రాంతానికి చెందిన ఒకే ఒక విద్యార్థి కోసం అక్కడి వామపక్ష ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సు నడుపుతున్నదంటూ పత్రికల్లో వార్తలొచ్చాయి. అంటే విద్యకు, ముఖ్యంగా బాలికా విద్యకు అక్కడి సర్కారు ఇస్తున్న ప్రాముఖ్యతేంటో విదితమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల బడ్జెట్ సందర్భంగా మన ప్రభుత్వాధినేత నొక్కి వక్కాణించిన విషయాన్ని గుర్తు చేసుకుందాం. 'మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక పనులు చేశారు. కానీ ఆయన చేసిన పనులను చెప్పుకోలేకపోయారు. ఇప్పటి ప్రధాని చేసేదానికంటే చెప్పుకోవడం ఎక్కువ' అంటూ ఆయన తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధించారు. ఇది నిజమే. కానీ ఇక్కడ మనం కూడా అట్టడుగున ఉన్న దళితులు, గిరిజనుల కోసం ఏం చేస్తున్నాం..? ఎలాంటి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నాం..? అవి సత్ఫలితాలనిస్తున్నాయా..? లేదా..? అనే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ క్రమంలో ఎస్సీలు, ఎస్టీల అభివృద్ధి కోసం సహేతుకమైన, శాస్త్రీయమైన ప్రణాళికలను రూపొందించు కోవాలి. వాటిని పక్కాగా అమలు చేయాలి. అందుకోసం నిబద్ధతతో పని చేసే అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రధాన పత్రికలో రాసుకున్నట్టుగా... 'గిరిజనాభు ద్యయం...' సాధ్యమవుతుంది. లేదంటే మన రాతలు రాతలు గానే... నేతల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతాయి.