Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కోట్లల్లో ఉన్న బీద బిక్కి జనానికి కాస్తంత ఆహార ఆసరా కల్పించే ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ను నిర్వీర్యం చేసి పేదల నోటికాడి ముద్ద లాగేసే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం ఒడిగట్టడం దారుణం. పిడిఎస్‌కు అవసరమైన ఆహార సేకరణను ప్రయివేటీకరించేందుకు అడుగులు వేస్తున్న మోడీ సర్కార్, పంపిణీని సైతం ప్రయివేటీకరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. లక్ష్యం పిడిఎస్లోనూ కార్పొరేట్లను ప్రవేశపెట్టి లాభాలు దోచిపెట్టడం. మోడీ ప్రభుత్వ అంతరంగం మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆవిష్కృతమైంది. ఆహార సబ్సిడీకి రూ.90 వేల కోట్లు కోత పెట్టడంతో ప్రభుత్వ కుతంత్రం ప్రజలకు బోధ పడింది. పిడిఎస్ వ్యయ నియంత్రణలు, ఉచిత ఆహార పథకం పరిధి కుదింపునకు నిటిఅయోగ్ చేసిన సిఫారసులకు అనుగుణంగానే బడ్జెట్లో కేంద్రం ఆ పద్దుకు కత్తెర వేసిందని 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' ఆధారాలతో బట్టబయలు చేసింది. ఆహార భద్రతా కార్యక్రమాలకు, పిడిఎస్ అమలుకు నిటిఅయోగ్ వ్యతిరేకంగా ఉందని వెల్లడించింది. రిపోర్టులోని అంశాల ఆధారంగానే సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వగా, తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం, 2021 జనాభా ప్రాతిపదికన ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయాలంది. సుప్రీం సూచన అమలుకు బడ్జెట్లో నిధులు పెంచాల్సి ఉండగా తగ్గించడాన్నిబట్టి అత్యున్నత న్యాయస్థానం కంటే నిటిఅయోగ్ నివేదికనే మోడీ సర్కార్ గీటురాయిగా పరిగణించింది.
జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లో యూపీఏ-2 హయాంలో వచ్చింది. కిలో రూ.3కు బియ్యం, రూ.2కు గోధుమలు పేదలకు ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలోల వంతున అందించడం యాక్ట్ లక్ష్యం. చట్టానికి కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రజల్లో 75శాతం, పట్టణాల్లో 50శాతం చట్టం పరిధిలోకొచ్చారు. దాదాపు 81 కోట్లకుపైన ప్రజలు కాస్తయినా ఊరట పొందుతున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చింది లగాయతు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ను పలచన చేసేందుకు కంకణం కట్టుకుంది. పేదలకు నేరుగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయకుండా నగదు బదిలీ (డిబిటి) నినాదం ఎత్తుకుంది. ఆహార ధాన్యాలు పంపిణీ చేయకుండా ఇచ్చే సబ్సిడీని లెక్కకట్టి నగదు బదిలీ చేస్తే, బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరిగితే, ఆ ధరలకు ధాన్యాలను పేదలు కొనుక్కోలేక ఆహారానికి దూరమవుతారు. డిబిటి కోసం రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ప్రజలు వ్యతిరేకిస్తుండటంతో మన రాష్ట్రం సహా చాలా చోట్ల అమలు తాత్కాలికంగా వాయిదా పడింది. పిడిఎస్‌ను కుదించే చర్యల్లో మరొకటి 'ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు'. దీని లక్ష్యమూ వీలైన మేరకు కార్డులను, లబ్ధిదారులను కుదించి నిధులు మిగుల్చుకోవడం. పేదలందరికీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వర్తించట్లేదు. పేదరికం కొలబద్దలు అసంబద్ధంగా ఉన్నాయి. రాష్ట్రాలు తమ పరిధిలో రేషన్ కార్డులిస్తున్నాయి. వాటన్నింటికీ కేంద్రం సబ్సిడీపై ఆహార ధాన్యాలు సరఫరా చేయట్లేదు. కేంద్రం ఇచ్చేది పోను మిగతా ఖర్చు రాష్ట్రాలే భరిస్తున్నాయి. పేదలకు చేసే ఆ కొద్ది సాయానికీ మోడీ ప్రభుత్వం ఎసరు పెట్టాలని చూస్తోంది.
2023-24 బడ్జెట్లో ఆహార సబ్సిడీ పద్దు కుదించుకు పోయింది. ఈ యేటా సవరించిన అంచనాలు రూ.2.14 లక్షల కోట్లు కాగా వచ్చే ఏడాదికి రూ.1.37లక్షల కోట్లకు తగ్గింది. ఆహార భద్రతా చట్టం అమలుకు ఆహార ధాన్యాల సేకరణకు రూ.72వేల కోట్ల నుంచి 59వేల కోట్లకు తగ్గించారు. కరోనా ఇక్కట్లు ఇంకా తొలగలేదు. ఉచిత ఆహార ధాన్యాలు కొనసాగించాల్సి ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో మన దేశం పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే దిగువన 107వ స్థానంలో ఉంది. పోషకాహార లోపంతో శిశువులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మరణాలూ సంభవిస్తున్నాయి. కోట్లాది మంది ఒక్కపూట తిండికీ నోచక ఆకలికి అలమటిస్తున్నారు. ప్రభుత్వ నయా-ఉదారవాద విధానాల వలన అంతరాలు పెరిగి పేదరికం తీవ్ర రూపం దాల్చుతోందని పలు గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఆహార సబ్సిడీ పెంచాల్సి ఉంది. సార్వజనీన పిడిఎస్ అవశ్యంగా మారింది. మోడీ సర్కారు కార్పొరేట్ల లాభాల కోసం పరితపించి పేదల కడుపు కాల్చడాన్ని ప్రజలు ప్రతిఘటించాలి.