Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామీణ భారతావనిలో కాస్తంతయినా బతుకు భరోసానిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌జిఎ)పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపరీత ఆంక్షలు విధిస్తూ నిర్వీర్యానికి కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోంది. వేతన బకాయిలు, ముఖ ఆధారిత హాజరు, చెల్లింపులకు ఆధార్‌తో ముడిపెట్టడం వంటి ఆంక్షలు రుద్దుతోంది. 'ఉపాధి'పై ఆంక్షల కత్తి వేలాడదీయడమంటే గ్రామీణ పేద ప్రజానీకంపై ప్రత్యక్ష దాడికి పూనుకోవడమే. వ్యవసాయమే ప్రధానంగా ఉన్న గ్రామీణ భారతావనిలో నాట్లు, కోతల సమయంలో మినహా ఏడాదంతా ఖాళీగానే ఉండాల్సిన పరిస్థితులు, కరువు కాటకాలున్న ప్రాంతాల్లో ఆ పనులు కూడా దక్కక ప్రజానీకం బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్లాల్సిన పరిస్థితులను కొంత మేరకైనా నిలుపుదల చేయడానికి ఉపాధి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గ్రామంలోని ప్రతి వయోజనుడికి ఏడాదికి కనీసం 100రోజులు పనిని ఈ చట్టం ఒక హక్కుగా కల్పించింది. ఉపాధి చట్టం కింద పనులు చేసిన వారందరికీ వేతనాలను కేంద్రమే చెల్లించాలి. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ఏడాది 'ఉపాధి' పథకానికి భారీగా కోత పెట్టడంతో దాడిని తీవ్రం చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వేతనాల చెల్లింపు బాధ్యత నుంచి తప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
'ఉపాధి' వేతనాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలన్న నిబంధన ఉండటంతో రాష్ట్రాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అక్రమాలను పట్టించుకోవడం లేదన్నది మోడీ సర్కార్ చేస్తున్న వాదన. కేంద్రం 100శాతం భరించాలన్న నిబంధనను ఎత్తివేసి దానిస్థానంలో 60శాతం కేంద్రం, 40శాతం రాష్ట్రం భరించాలన్న నిబంధనతో ఉపాధి చట్టాన్ని సవరించాల్సిన అవసరముందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఇటీవల సెలవిచ్చారు. అప్పుడే రాష్ట్రాలు కూడా 'ఉపాధి'లో అక్రమాలు జరగకుండా జాగ్రత్త వహిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు దేశంలో ఎక్కడా పని దొరకకపోతే అప్పుడు మాత్రమే ఈ పథకం కింద ఉపాధి పొందాలట! గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమేనన్న సంగతి విస్మరించి 'ఉపాధి' కార్మికులకు మొబైల్ యాప్‌లో ముఖ ఆధారిత హాజరు వేయడమేంటన్న ప్రశ్నకు కూడా గిరిరాజ్ గొప్ప బదులిచ్చారు! పారదర్శకత విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడబోదని చెప్పారు. మోడీ సర్కార్‌కి ప్రజాధనం దుర్వినియోగం కాకుండదన్న అంతటి చిత్తశుద్ధి నిజంగానే ఉంటే యేటా లక్షలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ విత్త సంస్థలకు ఎగవేస్తున్న కార్పొరేట్లు కనిపించడం లేదా? అదానీ అక్రమాలపై ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతున్నా ఎందుకు వెనకేసుకొస్తోంది? ఎక్కడకుపోయింది పారదర్శకత? అదానీ దోచుకున్నది ప్రజాధనం కాదా? దోచిపెట్టింది.. పెడుతున్నదీ మోడీ సర్కార్ కాదా? కోట్ల దోపిడీ కానరాదు కానీ చిన్నోచితకో ఉపాధి కూలీల వేతనాల్లో మాత్రం దోపిడీ కనిపెట్టడం మోసకారితనమే! పైగా ఉపాధి చట్టాన్ని తీసుకొచ్చిన లక్ష్యమే వలసలు నివారించడం.. అయితే దానికి కేంద్రం వక్రభాష్యం చెబుతోంది.
'ఉపాధి' కార్మికులకు వేతనాలు చెల్లింపు కోసం ఆధార్‌తో ముడి పెట్టడం పట్ల అసలు చట్టం లక్ష్యానికే ప్రమాదం వాటిల్లుతుందని ఈ పథకానికి సంబంధించిన కార్మిక సంఘాల ఐక్య వేదిక ఎన్ఆర్ఇజిఎ సంఘర్ష్ మోర్చా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసినా మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారమే అధార్ అనుసంధానిత వేతన చెల్లింపుల విధానం వల్ల 57శాతం ఉపాధి కార్మికులు ఈ చట్టానికి దూరమవుతారు. ఈ ఏడాది బడ్జెట్లో గతేడాది కంటే 33శాతం తక్కువ కేటాయింపులు చేయడం కూడా 'ఉపాధి'ని నిర్వీర్యం చేయడంలో కుట్రగానే చూడాలి. ఇప్పటికే 14రాష్ట్రాలకు రూ.6157 కోట్ల 'ఉపాధి' బకాయిలను కేంద్రం చెల్లించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌కే రూ.836 కోట్లు బకాయి పడింది. వేతన బకాయిలు నిలిపివేయడం, మొబైల్ యాప్ ద్వారా హాజరు, ఆధార్ చిక్కుముడులు ఇలా ఒకదానికి ఒకటి లింక్ చేసి మొత్తంగా 'ఉపాధి' పని దినాలను కుదించేసి మొత్తం చట్టానికే సమాధి కట్టాలన్నది మోడీ సర్కార్ మదిలోని కుట్ర. గ్రామాలకు రక్షగా ఉంటున్న ఉపాధిని కాపాడుకోవడం అందరి బాధ్యత.