Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చార్లెస్ డికెన్స్ రాసిన అద్భుత నవలా రాజం ''టేల్ ఆఫ్ టు సిటీస్'' (రెండు నగరాల కథ). ఫ్రెంచ్ విప్లవం నేపథ్యంలో సాగుతుంది ఇది. లండన్, ప్యారిస్ నగరాల్లో ఘటనలను తన కాల్పనిక శక్తితో సృజనాత్మకంగా మేళవించాడు డికెన్స్. బలిపీఠంపై నిలబడ్డ రెండు స్టీల్ ప్లాంట్ల వ్యధ నేటి సందర్భం. రెండు పక్క పక్క రాష్ట్రాల్లో వధ్య శిలపై నిలబడ్డ వీటి కథ కేవలం కాకతాళీయం కాదు. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నదే!
మొన్న పార్లమెంటులో కర్నాటకలోని భద్రావతి స్టీల్ ప్లాంట్‌ను (దాని పూర్తిపేరు విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ (వి.ఐ.ఎస్.పి.) వయస్సు వందేండ్లు) మరణించుట తథ్యం అన్నాడు 'ఉక్కు' మంత్రి. ''ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికి!'' అని మోడీ 2013లోనే చెప్పిన విషయం మన గమనంలో ఉండాలి. ఆ హామీ ఇచ్చే ఆయన 2014లో పరమపద సోపానపటంలో అధికార పీఠం అధిష్టించాడు. ఆ రాజ్యంలో, అదీ పదేండ్ల పాలన దగ్గర పడుతున్న వేళ వందేండ్ల ప్రభుత్వరంగ పరిశ్రమ కాష్టంలో కదా ఉండాల్సింది!? ఇక్కడ 'వీర' కాకతాళీయమైన రెండు పేర్లున్నాయి. ఒకటి వి.ఐ.ఎస్.పి, రెండోది వి.ఎస్.పి. కాని రెంటి సమస్యా ఒక్కటే! అది కావాలనే జరుగుతున్నది!
బామ్మ వారసత్వం వేలు పట్టుకుని బీజేపీలోకి వలసొచ్చిన 'యువరాజు' ప్రస్తుతం స్టీల్‌శాఖ మంత్రి. భద్రావతి స్టీల్ ప్లాంట్‌ని ఎందుకు మూతేస్తున్నారని పార్లమెంటులో నిలదీస్తే... ''దాన్ని కొనడానికి ఎవరూ రాలేదు కాబట్టి'' అని ఏడు చేపల కథ ప్రారంభించాడు సదరు మంత్రి. ఆ ఒక్క చేపకీ గడ్డివాము అడ్డంమొచ్చినట్లే ఖరీద్దార్లు రాకపోవడానికి కారణం సొంత ఇనుప గనులు లేకపోవడమేనట! ''ఇవ్వాల్సింది మీరే కదా'' అంటే చప్పుడు చేయడు. విశాఖ స్టీల్ ప్లాంటు (వి.ఎస్.పి.) సొంత గనుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నది. అయినా అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ మొండి చేయే చూపుతున్నాయి. ఇనుప ఖనిజం ప్రాధాన్యత ఎంతంటే వి.ఎస్.పి. మొత్తం ఖర్చులో 47శాతం ఇనుపఖనిజానిదే. ఇతర ప్రభుత్వ, ప్రయివేటు కంపెనీలకు టన్ను రూ.600కి దొరికితే, దీనికి మాత్రం రూ.2400కి అందుబాటులో ఉంది. టన్నుకు నాలుగింతల భారం ఏ కంపెనీ అయినా భరించగలదా?!
అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో వడ్డనంటే ఏమిటో తెలియాలంటే విశాఖ పక్కనే ఉన్న ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు గనుల కోసం రూ.361కోట్లు కట్టించుకుని, గనులివ్వరు, డబ్బు వాపస్ ఇవ్వరు, అనుమతులివ్వరు. పైగా లక్ష్మీమిట్టల్ ప్లాంట్‌కి, దక్షిణ కొరియాకి చెందిన పోస్కోకి గనుల 'దక్షిణ' ఇచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కి మాత్రం శఠగోపం పెట్టారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఊరువాడ ఏకం చేసి పోరాడుతున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులను అభినందించకుండా ఉండలేం!
ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్, బీజేపీల దోబూచులాటకు పెద్ద నిదర్శనం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. 2011లో బళ్ళారిలోని 140 హెక్టార్ల గనులను కేటాయిస్తే, దానిలో 14 హెక్టార్ల మీద లీగల్ సమస్యలొచ్చాయి. మిగతా 126 హెక్టార్లైనా ఇచ్చి ఉండవచ్చు కదా అని భద్రావతి స్టీల్ ప్లాంట్ యూనియన్ ప్రశ్నిస్తోంది. పైగా రమణదుర్గ అటవీ ప్రాంతంలో ఇనుప ఖనిజం గనులు కేటాయించి ఉన్నారు గతంలోనే. అది ఉండగానే గనుల్లేవనే సాకు చెప్పి మూసేయడాన్ని కూడా యూనియన్ ప్రశ్నిస్తోంది. చంపదల్చుకున్న కుక్కకు పిచ్చి ఉందనే సాకు కాక మరేమి చేపుతారు?! తమ ప్రభుత్వం గనులు కేటాయించిందని బీజేపీ ఎందుకివ్వలేదని ప్రశ్నించే కాంగ్రెస్ వారిని 2011 - 2014 మధ్య తమరేమి చేశారని కార్మికులడుగుతున్నారు. దానికేమి సమాధానం చెపుతారు? విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులే కాక ఉత్తరాంధ్ర ప్రజలంతా గనులివ్వండని మొత్తుకున్న దశాబ్దాల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలో ఉంది కదా! మరి దానికెందుకివ్వలేదంటే ఏం సమాధానం చెపుతారు?
'టేల్ ఆఫ్ టు సిటీస్'లో దేశ ద్రోహం మోపబడ్డ కేసులున్నాయి. కోర్టు విచారణలున్నాయి. పేదల్ని కచ్చడం కింద నలిపేసే సంఘటనలున్నాయి. తిరుగుబాట్లున్నాయి. గెలిటన్లతో శిరచ్ఛేదాలున్నాయి. ప్రేమ త్యాగాలున్నాయి. ఈ రెండు స్టీల్ ప్లాంట్ల మధ్య కూడా పాలక పార్టీల దేశద్రోహాలున్నాయి. ప్రజలను కలుపుకుని పోరాడుతున్న ఘటనలున్నాయి. నిరంతరం కార్మికల రక్తం తాగుతున్న పెట్టుబడిదార్లున్నారు. దేశంలో సైద్ధాంతిక ప్రచార యుద్ధంలో మునిగితేలుతున్న కార్మిక సంఘాలు ఉన్నాయి. ఆబగా ఆశ్రిత పెట్టుబడిదార్లకు దారులు పరుస్తున్న పార్టీలున్నాయి. ఒకర్నొకరు తోసుకుంటూ దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్న రాజకీయ 'క్లోన్'లున్నాయి. నలిగిపోతున్న ప్రజలున్నారు.
''కోర్టులు, పత్రికలు, మేధావులు పట్టించుకోకుండా మిగిలి పోయిన వాస్తవాలు'' అని సి.వి. సుబ్బారావు చెప్పిన సత్యాలివి. ఆయనే చెప్పినట్లు ''జనం భూమిలో సంఘాలు నాటడం నేర్చుకుంటే''నే పరిష్కారాలు దొరుకే ప్రశ్నలివి.