Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపగలమని అనుకొనే వారు బుర్ర తక్కువ కాదు అసలు లేని వారు. నా కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తా అన్నాడట వెనుకటికెవడో. ఇప్పుడు సరిగ్గా అమెరికా కూడా ఇదే స్థితిలో ఉంది. జపాన్ మీద అణుబాంబును వేసి తనకు లొంగకపోతే మీకూ ఇదే గతి అని బెదిరించిన అమెరికాకు మా దగ్గర కూడా ఉంది చూడమంటూ నాలుగేండ్లలోనే చూపిన సోవియట్ నేత స్టాలిన్ సంగతి తెలిసిందే. ఇప్పుడు టెక్నాలజీ యుద్ధం నడుస్తోంది. మేము, మా మిత్రదేశాలు మీకు అవసరమైన చిప్స్‌ను అందించకపోతే మీరెలా ముందుకు పోతారో చూస్తాం అని అమెరికన్లు విసిరిన సవాలును తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడన్నట్లుగా చైనా స్వీకరించింది. శాస్త్ర-సాంకేతిక రంగాల్లో స్వావలంబన సాధించేందుకు కావలసిన చర్యలన్నింటినీ చేపట్టాలని చైనా అధినేత షీ జింపింగ్ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో కర్తవ్యనిర్దేశం చేశారు. జనవరి 31న కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో దీని గురించి చర్చించారు. నెల రోజులు కూడా గడవక ముందే ఫిబ్రవరి 21న పొలిట్ బ్యూరో పూర్తిగా ఈ అంశం గురించే చర్చించి అమెరికా విసిరిన సవాలును అధిగమించేందుకు దిశానిర్దేశం చేసిందంటే దానికి ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.
అమెరికా ఎంతకు తెగించిందంటే ఒక వేళ చైనా గనుక తైవాన్ విలీనాన్ని బలవంతంగా అమలు చేస్తే అక్కడ ఉన్న చిప్స్ ఫ్యాక్టరీలన్నింటినీ పేల్చివేస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధునాతన మైక్రో చిప్స్ తయారీలో చైనాలోని కంపెనీలు తిరుగులేని ఆధిక్యతలో ఉన్నాయి. దేశీయంగా చైనాలో పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నప్పటికీ చిప్స్ రూపకల్పన ఒక ఎత్తైతే వాటి తయారీకి అవసరమైన ఆధునిక యంత్ర పరికరాల తయారీ, పరిజ్ఞానంలో పశ్చిమ దేశాలు, జపాన్‌దే పైచేయి. తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, అమెరికాల నుంచి ఎక్కువ భాగం చైనా దిగుమతి చేసుకుంటున్నది. ఇదే సరఫరా గొలుసు కొనసాగితే త్వరలోనే చైనా ఆర్థిక అగ్రదేశంగా, మిలిటరీ రీత్యా మరింత పటిష్టంగా మారితే తన స్థానానికి ఎసరు వస్తుందని అమెరికా ఆందోళన చెందుతోంది. 2018లో డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య పోరు పేరుతో సాగిస్తున్న ప్రచ్చన్నయుద్ధంలో శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, చైనాకు అవసరమైన విడి భాగాల ఎగుమతులను అడ్డుకోవటం కూడా ఒకటి. జో బైడెన్ ఏలుబడిలో అది మరొక రూపం తీసుకుంది. తమతో పాటు ఏ దేశమూ కూడా చిప్స్ సాంకేతిక పరిజ్ఞానం, వాటి ఎగుమతి, తయారు చేసే యంత్రాలను కూడా చైనాకు ఇవ్వకూడదని ఇతర దేశాల మీద అమెరికా ఒత్తిడి తెస్తోంది. అలా చేస్తే విస్తారమైన చైనా మార్కెట్‌ను కోల్పోతే తమ కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బ అని ఒక వైపు చెబుతూనే సదరు దేశాలు అమెరికా ఒత్తిడికి లొంగుతున్నాయి. ఏడాది క్రితం బ్రిటన్‌లోని అతి పెద్ద చిప్స్ తయారీ కంపెనీ న్యూపోర్ట్ వాఫర్లో 86శాతం వాటాలను చైనా సంస్థ వింగ్టెక్కు విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది. రెండుసార్లు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష తరువాతే ఇదంతా జరిగింది. అలాంటి ఈ ఒప్పందం తమ దేశ భద్రతకు ముప్పు అంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇటీవల దాన్ని రద్దు చేశాడు.
ఇలాంటి పరిస్థితి ఏదో ఒక నాడు ఎదురు కానుందనే ముందు చూపుతో చైనా ఇటీవలి కాలంలో శాస్త్ర-పరిశోధనా రంగంలో పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నది. స్టాటిస్టా వెల్లడించిన సమాచారం ప్రకారం 2022లో అమెరికా 679 బిలియన్ డాలర్లు కేటాయిస్తే చైనా 551, జపాన్ 182 బి.డాలర్లు కాగా ఏడవ స్థానంలో ఉన్న మన దేశం 65 బి.డాలర్లని పేర్కొన్నది. ఈ లెక్కన త్వరలో అమెరికాను వెనక్కునెట్టేసి చైనా ముందుకు పోనుంది. పిండికొద్దీ రొట్టే అన్నట్లు ఖర్చును బట్టే ఫలితాలు కూడా ఉంటాయి. మన పరిశోధనలు మాత్రం ఆవు పేడ, మూత్రంలో బంగారాన్ని కనుగొనటం చుట్టూ తిరుగుతున్నాయి. 2012లో చైనాలో 49వేల హైటెక్ కంపెనీలు ఉంటే 2021 నాటికి మూడులక్షల 30వేలకు పెరిగాయి. ప్రపంచంలో పరిశోధనకు పెద్ద మొత్తాలలో ఖర్చు చేస్తున్న అగ్రశ్రేణి రెండున్నరవేల కంపెనీలలో చైనావి 680 ఉన్నాయి.
కరోనా అమెరికాతో వాణిజ్యపోరులో చైనా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నది. రానున్న మూడు దశాబ్దాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అధునిక దేశంగా మారనున్నదని చైనా డైలీ పేర్కొన్నది. ఇప్పటి వరకు ప్రపంచ వినియోగదారులకు సరుకులు అందించిన దేశంగా ఉన్నది కాస్తా అదే ఒక ప్రధాన వినియోగదారుగా మారనున్నది. అందుకు అవసరమైన వస్తూత్పత్తికి పథకాలు వేస్తున్నది. కమ్యూనిస్టు చైనాకు ఇబ్బందులు, సవాళ్లు, వాటిని అధిగమించటం కొత్తేమీ కాదు. సాంకేతిక పరిజ్ఞానాన్నే కాదు, పెట్టుబడులను కూడా రాకుండా అడ్డుకున్న పశ్చిమ దేశాల కుట్రలను ఎదిరించి తాను ఎంచుకున్న మార్గంలో పురోగమించటంలో మరొక దేశానికి పోటీ కాదు, పోటీ లేదు. అణుబాంబు పథకం నుంచి సోవియట్ అర్థాంత రంగా తప్పుకున్నప్పటికీ తొలి పది సంవత్సరాల్లోనే అణు బాంబును రూపొందించింది. అంతరిక్ష రంగంలో పరిశోధన లకు సోవియట్, తరువాత రష్యా మనకు అందించినమేరకు కూడా చైనాకు ఇవ్వలేదు. అమెరికా సంగతి చెప్పనవసరం లేదు, అది అడ్డుకున్నప్పటికీ విఫలమైంది. స్వంతంగా చైనా చంద్రుడు, అంగారకుడి మీదకు నౌకలను పంపటంతో పాటు స్పేస్ స్టేషన్ నిర్మాణం కూడా చేస్తున్నది. కృత్రిమ మేథలో సవాలు విసురుతున్నది. అందువలన కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరి ఇప్పుడు టెక్వార్లో అమెరికా దాని మిత్ర దేశాల కుట్రలను అధిగమించి స్వావలంబన సాధించనుందనటంలో ఎలాంటి సందేహం లేదు.