Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలు ప్రశ్న తలెత్తటమే సహించలేని వాళ్లకు, ఆ ప్రశ్న పాట రూపమెత్తితే ఇక కంపరమెత్తదా! ఇప్పుడా జానపద గీతం దేశాన్ని మేల్కొలుపుతోంది. సామాన్య జనాన్ని, పల్లీయులను చైతన్య పరుస్తున్నది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలేమిటో, ఆలోచించాల్సిన అంశాలేమిటో తట్టి మరీ హెచ్చరిస్తోంది. తేలికయిన జానపదుల పదాలలో రాగమై ధ్వనిస్తోంది. బీహార్‌కు చెందిన భోజ్‌పురి జానపద గాయని నేహాసింగ్ రాథోడ్ పాడిన ఒక వీడియో ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఆ పాటలో జానపదుల శైలిని అనుకరిస్తూ ఉన్న ''యూపీ మే కాబా?'' అనే పల్లవితో ఉత్తరప్రదేశ్‌లో ప్రజల బాధలను, రాజకీయుల దుర్మార్గాలను, సామాజిక పరిస్థితులను వ్యంగ్యంగా గానం చేసింది. ఇటీవల కాన్పూర్ అక్రమ ఇళ్లను కూల్చేసే సందర్భంగా తల్లీ కూతుళ్లు మరణించిన విషయంపై నేహా ఈ పాట పాడారు. ఇది వైరల్ అయింది. దీంతో ఎక్కడలేని భయాందోళనలకు గురయిన యూపీ ప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసింది. అయినా 'నా పాటను ఆపేదే లేదు, పాడుతూనే ఉంటాను' అని నేహా తన ఉద్దేశాన్ని ధైర్యంగా ప్రకటించింది.
పాటకంత బలముంటది. పాట, ఆనంద పరవశంలో ఓలలాడడానికే కాదు, సంతోషాల్లో సంబరాల్లో గంతులేస్తూ గొంతులెత్తే పద గుంభనమే కాదు, కపట రాజకీయుల కుటిల నీతిని వెలికితీసి, వాస్తవిక సామాజిక చిత్రాన్ని గుండెలపై ధ్వనింపజేసే కళా ఢంకాధ్వానం పాట. పాట ప్రజా కళారూపం. అందుకే ఏ ప్రజా ఉద్యమానికైనా ఖడ్గధారియై కవాతు చేస్తుంది. ఎక్కుపెట్టిన తుపాకిలా శత్రువును భయకంపితుణ్ణి చేస్తుంది. ఎందుకంటే అది సత్యాన్ని సమర్థవంతంగా జనంలోకి తీసుకు వెళ్లగలుగుతుంది గనుక. ఆనాడు భారతదేశాన్ని చెరపట్టిన బ్రిటిష్వాడూ పాటంటే భయపడ్డాడు. 'వందేమాతరం' అనే పల్లవికే వణికిపోయి తుపాకులు పేల్చాడు. తెలంగాణలో నిజాము, జమిందారు, భూస్వాముల గుండెల్లో బల్లెమైదిగింది పాట. ప్రజల్ని చైతన్య పరిచే గొప్ప సాధనం పాట. పాట నెత్తుకున్న గొంతుపై ఆధిపత్య కత్తులు వేలాడుతూనే ఉంటాయి. నిర్బంధాలు, అడ్డగింతలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. అయినా పాట సాహసి. జరుగుతున్న అన్యాయాలను, దుర్మార్గాలను చూస్తూ ఉండలేదు. మీడియా గొంతువిప్పకపోవచ్చు, ఛానళ్లు మూగపోవచ్చు, ప్రతిపక్షం ప్రతిధ్వనించకపోవచ్చు... కానీ పాట తనను తాను చంపుకోదు. తన ఉనికి గొంత్తెత్తడమే. అవును, ఎక్కడి నుండో ఒకపాట మనల్ని మేల్కొల్పుతూనే ఉంటుంది. ఆ పాట ఇప్పుడు నేహాసింగ్ గొంతులోంచి దూసుకువచ్చింది.
'యూపీ మే కాబా?' ఆ రాష్ట్రంలో ఏముంది? ఏముందో, ఏం జరుగుతోందో ఆ పాటలో నేహా కళ్లకు కట్టారు. కరోనా కాలంలో జనులు ఎంత ఇబ్బందులు పడ్డారో, గంగలో ఎన్ని శవాలు తేలాయో, మంత్రి కొడుకు రైతుల ఛాతీమీది నుండి కార్లెలా దూకించాడో, లైంగిక దాడులు చేసిన వాళ్లు ఎలా బలదూర్ తిరుగుతున్నారో, దళితుల జీవితం ఎంత దుర్భరంగా ఉందో తెలిపే పాట అది. అందుకే ప్రభుత్వానికి ఆగ్రహమొస్తోంది. అన్నింటికన్నా మన మందరం నేహా సింగ్‌లోని ధైర్యాన్ని, నిజాయితీని చూసి స్ఫూర్తి పొందాల్సి ఉంది. 'నేను ఏమీ ప్రతిపక్షం కాదు, మంత్రిని కాదు, మంత్రి కుమార్తెనూ కాదు, నేనొక సామాన్య కళాకారిణిని, నేను మతం గురించి మాట్లాడలేదు. రాజకీయాలూ పాడలేదు. కేవలం ప్రజల భావాన్ని పాటగా పాడాను. ఎందుకంటే నేను 'లోక్ గాయక్ హూ' (ప్రజా గాయనిని) అని ప్రకటించింది. అంతే కాదు, ''వాళ్లు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు. కేవలం నోటీసులు ఇస్తారు. నేను అధికారం మీదనే పాడతాను. ఎందుకంటే, వాళ్లు మా ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చారు. వాళ్లు మాకు చేస్తానన్నవి చేయటం లేదు. ప్రశ్నలు పాడుతూనే'' ఉంటాను అని చెప్పిన తీరు నిజంగా అభినందనీయమైనది. ఒక ప్రజాగాయని ఎలా ఉండాలో ఉదాహరణగా నిలిచింది నేహా. డబ్బులు తీసుకుని నేను పాడనని, జనంవైపే ఎప్పటికీ నిలబడతానని, పాటను ఆపే ప్రసక్తే లేదని తెలిపిన ఆ కళాకారిణి మనందరికీ ఆదర్శప్రాయం. నాకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే వాళ్లూ పాటలు రాయాలి, పాడాలి అని అన్న ఆమె సవాలును స్వీకరించక తప్పని ప్రభుత్వం వారు 'యూపీ మే సబ్ బా' అంటూ ఇక్కడ మందిరమున్నది, రాముడున్నాడు, మహానాయకుడు ఉన్నాడూ అని నేహా వీడియోకు ప్రతిగా పాటను రిలీజ్ చేసారు. కానీ ప్రజా పాటకు వచ్చిన ఆదరణ దానికెందుకుంటుంది?
రేపు 'కాబా!' అని ప్రశ్నించి గళమెత్తిన నేహాసింగ్‌ను అక్రమంగా నిర్బంధించవచ్చు. వాస్తవాలను వెలికి తీసిన, తీస్తున్న జర్నలిస్టులపై, రచయితలపై, మీడియాపై దాడి చేయడం, వారి భావ ప్రకటనా స్వేచ్ఛను నొక్కేయడమే రామరాజ్యమని చెప్పుకునే పాలకుల కాలంలో ఆమెకు నోటీసులివ్వడం ఆశ్చర్యపర్చదు. కళాకారులు, రచయితలు, మేధావులు గొంతెత్తాల్సిన అవసరాన్ని 'కాబా' గీతం ఎరుకపరుస్తున్నది. పశువుల కన్నా హీనంగా చూడబడుతున్న సామాన్యుల జీవిత చిత్రాలను, కష్టాలను ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఈ పాట మనకు బోధిస్తున్నది. ప్రజా పాట నెత్తుకున్న నేహాసింగ్ రాథోర్‌కు జేజేలు పలుకుతూనే నీతో మా గొంతునూ కలుపుతామని వాగ్దానం చేద్దాం!