Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ సీనియర్ నాయకులు పవన్ ఖేరాను ఇండిగో విమానంలో నుంచి కిందకు దించేసి అస్సాం పోలీసులు అరెస్టు చేసిన తీరు అత్యంత ఆక్షేపణీయం. నిరంకుశత్వానికి ప్రతీక. ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి ఢిల్లీ నుంచి వెళ్తున్న ఆయనను విమానం ఎక్కీఎక్కగానే 'మీ లగేజీపై సందేహాలున్నాయి. పోలీసులు కూడా వచ్చారు' అంటూ ఇండిగో అధికారులు దింపేయడం, నిరసనగా ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు దిగి అక్కడే ఆందోళన చేయడం... ఏం జరుగుతోందో తెలియక ప్రయాణీకులు భయాందోళనకు గురి కావడం ఈ పరిణామాలన్నీ చూసినవారెవ్వరికైనా దేశంలో ఏమైనా అత్యయిక పరిస్థితి విధించారా? అన్న సందేహం కలగకమానదు. నిరంకుశ చర్యలు మోడీ సర్కార్‌కు కొత్తేమీ కాదు. అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించడమే పెద్ద నేరంగా భావించి ఎంతో మంది సామాజిక కార్యకర్తలను, మేధావు లను, రచయితలను, కళాకారులను వేధించడమే గాక... స్టాన్ స్వామి లాంటి కురువృద్ధ సంఘ సేవకులను పొట్టన పెట్టుకుంది. మరోవైపు వినియోగదారుల సేవకు కట్టుబడి ఉన్నామంటూ గొప్పలు చెప్పే ప్రయివేటు విమానయాన సంస్థలు ప్రభుత్వ, కార్పొరేట్ పెద్దల మెప్పు కోసం ఎంతకైనా తెగిస్తాయనేందుకు పవన్ ఖేరా దించివేత ఘటన ఒక ఉదాహరణ.
పవన్ ఖేరా చేసిన నేరం... దేశ ద్రోహ నేరమేమీ కాదు. పోనీ ఆయన లిక్కర్ డాన్ విజయమాల్యా, వజ్రాల అక్రమ వ్యాపారి నీరవ్ మోడీ తరహాలో ప్రభుత్వ విత్త సంస్థలకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు పరారవ్వడం లేదు. పవన్ ఖేరా చేసిన నేరమల్లా... బీజేపీ అండదండలతో ప్రపంచ కుబేరుడిగా అవతరిం చిన అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించడమే. భారత్‌లో ఖనిజ వనరులను, సౌర ఇంధన ప్రాజెక్టులను, నౌకాశ్రయాలను, విమా నాశ్రయాలను, ప్రభుత్వ ఆస్తులను అదానీకి కారు చౌకగా కట్టబెట్టడమే కాకుండా శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తన పలుకుబడిని ఉపయోగించి మోడీ సర్కార్ అదానీకి అనేక ప్రాజెక్టులు వచ్చేలా చేసిందన్న విమర్శలు కొట్టి పారేయలేనివి. డొల్ల కంపెనీలతో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడటం, కృత్రిమంగా షేర్ల విలువ పెంచేయడం సహా అనేకానేక అక్రమాలకు అదానీ పాల్పడ్డారంటూ హిండెన్ బర్గ్ నివేదిక బయటపెట్టింది. దిగ్భ్రాంతిగొలిపే అనేక విషయాలతోపాటు అదానీ-మోడీ బంధం ఎంత బలోపేతమైనదో మరోమారు ఈ నివేదిక బట్టబయలు చేసింది. దీంతో మోడీ సర్కార్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఇంత అన్యాయమా అని ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రశ్నిస్తే సమాధానం లేదు. పైగా సభా ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ 11మంది ప్రతిపక్ష ఎంపీలపై విచారణకు ఆదేశించి వేధింపులకు గురి చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడో మూలన రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరగడం లేదంటూ కనిపెట్టి సదరు రేషన్ డీలరుపై ఒంటికాలిపై లేచిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అదానీ అక్రమాల బాగోతం చాలా సాధారణమైన అంశంగా కనిపించింది. అదంతా మార్కెట్ నియంత్రణ సంస్థలు, విత్తసంస్థలు చూసుకుంటాయంటూ ఆమె దాటవేశారంటే అదానీ సేవలో ఈ ప్రభుత్వం ఎంతగా మునిగితేలుతున్నదో అర్థమవుతుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఘాటుగా విమర్శించారన్న ఆరోపణలకే కేసులు బనాయించేసి వేటాడివేటాడి విమానమెక్కుతున్న వ్యక్తిని కూడా దించేసి అరెస్టు చేస్తున్నారంటే అదానీ కోసం ఎంతకైనా తెగిస్తామనే సంకేతాన్ని మోడీ సర్కార్ పంపుతోందా అన్న సందేహం కలగకమానదు. ప్రభుత్వ విత్త సంస్థలను గుల్ల చేసి, ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా కాజేసిన వారు దేశభక్తులు! ఈ అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించేవారు దేశ ద్రోహులా?
వాస్తవానికి పవన్ ఖేరా కాంగ్రెస్‌లో దేశవ్యాప్తంగా పేరున్న నేత ఏమీ కాదు. ఆయనేమీ నిత్యం మోడీ సర్కార్‌పై పనిగట్టుకొని విమర్శలు గుప్పించే వ్యక్తీ కాదు. అయితే మోడీ సర్కార్‌కు, ఆయన నమ్మిన బంటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మకు కోపం తెప్పించిన అంశమల్లా అదానీ, మోడీ అనుబంధాన్ని ప్రశ్నించడమే. చిన్నప్పుడు ఛారు అమ్ముకున్న అనుభవంతో ప్రభుత్వ సంస్థలను అదానీ లాంటి క్రోనీ కేపిటలిస్టులకు అమ్మేసి దేశ ప్రయోజనాలను కాపాడుతున్న మోడీ సర్కార్‌ను ప్రశ్నిస్తే చూస్తూ ఊరుకుంటామా? అన్నట్టుంది హేమంత్ ప్రభుత్వ తీరు. ప్రజాస్వామ్యానికి పాతర వేసే ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. క్రోని కేపిటలిస్టులతో కలిసి పాలకులు సాగిస్తున్న నిరంకుశ దాడులను తిప్పికొట్టి, దేశ సంపదను పరిరక్షించాలంటే ప్రజా పోరాటాలే మార్గం.