Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ర్యాగింగ్ వికృతత్వం మరోమారు జడలు విప్పింది. ఉన్నత విద్యావ్యవస్థని చెదపురుగులా తొలుస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకొని పట్టణాల్లో చదువుకోసం పల్లెల నుంచి తరలివచ్చిన ఎందరో విద్యార్థులు ఆధునికత్వం ముసుగులో భయానక ర్యాగింగ్ భూతానికి బలవుతున్న పరిస్థితి హడలెత్తిస్తోంది. తాజాగా వరంగల్‌లో చోటు చేసుకున్న రెండు ఘటనలు మరువక ముందే, హైదరాబాద్‌లో బుధవారం కార్పొరేటు విద్యాసంస్థల ర్యాంకుల దాహానికి మరో విద్యార్థి బలయ్యాడు. ఈ ఉదంతాలు విద్యావ్యవస్థలో వేళ్ళూనుకొంటోన్న అనారోగ్యకర ఆటవిక చర్యలకు అద్దం పడుతున్నాయి. కొద్దిపాటి వినోదం కోసం ప్రారంభమై ఒక సాంప్రదాయంగా మారిన ర్యాగింగ్ వినోదపు హద్దుల్ని దాటి ప్రమాదకర స్థాయికి చేరడమే కాకుండా, అందులోకి కులం కూడా చొరబడి చాలా కాలమే అయ్యింది. తత్ ఫలితంగా అమ్మాయిలు కాలేజీ చదువులే విరమించుకుంటున్న సంఘటలు అనేకం..! ఇది ఆడపిల్లల ఆత్మాభిమానానికి, ఆత్మ విశ్వాసానికి సవాలుగా మారింది. ఈ అనాగరిక, కుసంస్కార, హింసాత్మక చర్యలను అరికట్టాల్సిన విద్యాలయాల పెద్దలు, ప్రభుత్వాలు బాధ్యత మరిచి చోద్యం చూస్తున్నప్పుడు విద్యార్థులేం చేయాలి?
జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు సాధించా లనుకున్న ఆ విద్యార్థుల కథలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. సీనియర్ల వేధింపులు భరించలేక తీవ్రంగా కలత చెందిన అనస్థీషియా వైద్యవిద్యార్థిని ప్రీతి హానికర ఇంజక్షన్ తీసుకుని అయిదురోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలింది. నర్సంపేటలో మరో బీటెక్ విద్యార్థిని ఈ భూతానికే బలైంది. ఏడిపించడం, వేధించడం, శారీరకంగా మానసికంగా హింసించి భయకంపితుల్ని చేయడమనే వికృత చేష్టలకు పర్యాయపదంగా ర్యాగింగ్ మారిపోయిందని సుప్రీంకోర్టు ఏనాడో ఛీత్కరించింది. నాకు చెప్పకుండా ప్రిన్సిపల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశావని హెచ్ఓడి! నాకు అసలు ఫిర్యాదే అందలేదని ప్రిన్సిపల్! ఎవరి దృష్టికి తీసుకెళ్లినా వేధింపులు ఆగలేదని బోరున విలపిస్తున్న ఆ తల్లిదండ్రులు.. వారి గుండె కోతకు బదులిచ్చేదెవరు!
తాను ప్రేమించిన యువతినే కోరుకున్నాడన్న కక్షతో స్నేహితుడినే గుండెను చీల్చి అత్యంత కిరాతకంగాహత్య చేసి సెల్ఫీలు దిగిన బీటెక్ విద్యార్థి ఉదంతం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున గగుర్పాటుకు గురిచేస్తోంది. కులం పేరుతో దూషిస్తూ, మార్కులు, ర్యాంకుల పేర ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటనలు సామాజిక జీవన చిత్రం ఎంతగా ఛిద్రమైపోయిందో చాటుతున్నాయి. ఇటువంటి ఘటనల్లో నిందితుల్ని అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తేనో, కళాశాల నుంచి సస్పెండ్ చేస్తేనో సమస్య పరిష్కారమై పోయినట్లు కాదు. ర్యాగింగుకు పాల్పడబోమంటూ విద్యార్థుల నుంచి తీసుకుంటున్న ప్రమాణ పత్రాలు, ర్యాగింగ్ నిరోధక కమిటీలు, నిఘా బృందాలు నిష్ప్రయోజకాలేనని ఆగకుండా సాగుతున్న ఈ ఉదంతాలు ఎలుగెత్తుతున్నాయి. గతంలో రాఘవన్ కమిటీ చెప్పినట్లు, పాఠశాల విద్య దశలో పిల్లలకు నైతిక విలువలు అలవరచకపోవడం వ్యవస్థ వైఫల్యంగా ర్యాగింగ్ సంస్కృతిని గుర్తించాలి. దాని మూలాలపై దృష్టిపెట్టి అన్ని అంచెల్లోనూ దిద్దుబాటు చర్యలు చేపట్టనంత వరకు, సమర్థ పరిష్కారమన్నది నేతి బీరలో నేతి చందమే!
ప్రపంచీకరణ నేపథ్యంలో కార్పొరేట్ విద్యావిధానం, పెరుగుతున్న విలాసాలు, సరదాలు, విద్యాసంస్థలు, యాజమాన్య నిర్లక్ష్యం, సినిమాలు, క్లబ్బు, పబ్బు సంస్కృతి వెరసి ఇవన్నీ ఎంతో విశాలంగా ఆలోచించాల్సిన యువతను చెడువైపునకు నెట్టేస్తున్నాయి. చదువులో పోటీ, ర్యాంకుల రేసులో వెనుకబడ్డ విద్యార్థులపై అధ్యాపకుల విపరీతమైన ఒత్తిడి కూడా కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలకు కారణమవుతుంది. ఫలితంగా విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురికావడం, ఇంకొంతమంది నిరాశా నిస్పృహ లకు లోనుకావడం జరుగుతోంది. అదే బలవన్మరణాలకు దారితీస్తోంది. ''చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు'' ప్రీతిని సైఫ్ వేధించినది నిజమేనని యాంటీ ర్యాగింగ్ కమిటీ తాజాగా నిర్ధారించింది. ఆపని ఫిర్యాదు అందినప్పుడే చేసి ఉంటే నేడు ప్రీతి బతికి ఉండేది కదా! ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు వేగంగా తగు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి.