Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తైవాన్ అంశంపై చైనాను రెచ్చగొట్టేందుకు మరోసారి అమెరికా పూనుకుంది. మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించేందుకు ముందుకు పోతున్నది. అమెరిన్ కాంగ్రెస్‌లో మెజారిటీగా ఉన్న రిపబ్లికన్లు దూకుడుగా ఉన్నారు. ఇప్పటికే గత ఐదు సంవత్సరాల్లో పది బిలియన్ డాలర్ల విలువగల ఆయుధాలు అందచేసిన అమెరికా తాజాగా మరో 62 కోట్ల డాలర్ల ఎఫ్16 యుద్ధ విమానాలు, సంబంధిత పరికరాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వాటిని అందచేస్తున్న రేతియాన్, లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీలపై చైనా నిషేధం విధించింది. దీని మీద అమెరికా-తైవాన్ ప్రాంత పాలకులను హెచ్చరిస్తూ గురువారంనాడు చైనా ఫైటర్ జెట్లు తైవాన్ ప్రాంతంలో విన్యాసాలు జరిపినట్లు వార్తలు. తాజాగా ఫైటర్ జెట్లను విక్రయించటాన్ని సమర్థించుకొనేందుకు అమెరికా ''ప్రచార దాడి'' ప్రారంభించింది. తైవాన్ను ఆక్రమించుకొనేందుకు 2027 నాటికి సిద్దంగా ఉండాలని షీ జింపింగ్ మిలిటరీని ఆదేశించినట్లు, ఉక్రెయిన్‌లో రష్యామిలిటరీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసిన తరువాత ఆక్రమించుకోగలమా లేదా అని సందేహాలు వెలిబుచ్చినట్లు, చివరికి సిద్ధంగా గావాలని నిర్ణయించినట్లు, అయితే ఆ మేరకు 2027లేదా మరొక సంవత్సరంలో గానీ ఆక్రమించుకుంటారని తాము కచ్చితంగా చెప్పటం లేదు గానీ ముప్పు పెరుగుతోందని సీఐఏ అధిపతి విలియం బర్గ్స్ సీబీఎస్ టీవీతో చెప్పాడు. తమ అంచనా ప్రకారం తైవాన్ దురాక్రమణను పూర్తి చేస్తామనే విశ్వాసం చైనా నేతలు, కమాండర్లకు లేదని కూడా అన్నాడు. ఇది చైనా మీద ఒత్తిడి తెచ్చే ఒక మైండ్ గేమ్, రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. అమెరికన్ల తీరుతెన్నులను, సన్నాయి నొక్కులను అర్థం చేసుకోలేనంత అమాయకంగా చైనా లేదు.
ఉక్రెయిన్ సమస్యకు, తైవాన్ అంశానికి ముడిపెట్టటం, తైవాన్ను దురాక్రమించుకొనేందుకు చైనా పూనుకున్నదని చెప్పటమే పెద్ద అబద్దం. తైవాన్ అసలు ఒక దేశం కాదు, అమెరికా కూడా దాన్ని గుర్తించటంలేదు. చైనాలో ఒక తిరుగుబాటు ప్రాంతంగా 1949 నుంచి ఉంటున్నది. ఒకే చైనా అన్న దాన్ని ఐరాస అంగీకరించిన తరువాత తైవాన్ దానిలో ఎప్పటికైనా విలీనం కావటం తప్ప మరొక అవకాశమే లేదు. కమ్యూనిస్టు విముక్తి గెరిల్లాల ధాటికి తట్టుకోలేని నాటి చైనా మిలిటరీ, ఆయుధాలను అమెరికా, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఒక పథకం ప్రకారం విడిగా ఉన్న తైవాన్ దీవికి తరలించారు. అప్పటి నుంచి దాన్ని మరింతగా ఆయుధాలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పాలనలో ఉన్న హాంకాంగ్, అదే విధంగా పోర్చుగీసు కౌలు ప్రాంతంగా ఉన్న మకావో దీవులను గడువు తీరిన తరువాత చైనాలో విలీనం చేసుకోవాల్సి ఉంది. హాంకాంగ్ అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వాణిజ్యకేంద్రంగానూ, మకావు ఒక పెద్ద జూద ప్రాంతంగా ఉంది. వాటిని ఒకే దేశం-రెండు వ్యవస్థలు అన్న విధానం కింద ప్రత్యేక పాలనా మండళ్లుగా ఉంచుతూ, జాతీయభద్రతా అధికారాన్ని మాత్రం చైనా ప్రభుత్వం దఖలు పరచుకుంది. ఒప్పందం ప్రకారం 50సంవత్సరాల తరువాతనే 2049 నాటికి వాటిని ప్రధాన భూభాగంలో విలీనం చేస్తారు. అదే విధానాన్ని తైవాన్ ప్రాంతానికి కూడా వర్తింపచేస్తామని చైనా చెప్పింది. అమెరికా దన్ను చూసుకొని అక్కడి వేర్పాటు వాదులు స్వాతంత్య్రం కావాలని కోరుతున్నారు. ఒకవైపు వారిని రెచ్చగొడుతూ మరోవైపు తగు సమయంలో శాంతియుత పద్ధతిలో విలీనం కావాలని అమెరికా ప్రపంచాన్ని నమ్మింపచూస్తున్నది.
తైవాన్ అంశంపై జపాన్, ఆస్ట్రేలియా ఇతర దేశాలతో కలసి దక్షిణ చైనా సముద్రంలో కుట్రలకు తెరతీసి చైనా మీద దాడికి దిగితే అమెరికా కూటమికి చావుదెబ్బ తప్పదు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వటం తప్ప అమెరికా లేదా ఇతర నాటో దేశాలు తమ మిలిటరీని పంపటంలేదు. అందువలన అమెరికా మిలిటరీ వస్తుందని, తమను ఆదుకుంటుందని తైవాన్ వేర్పాటు వాదులు భావిస్తే అది భ్రమ మాత్రమేనని ఉక్రెయిన్ను చూసి అర్థం చేసుకోవాలని తైవాన్ ప్రాంత పౌరులకు చైనా చెబుతున్నది. అమెరికాలోని ఒక సంస్థ చాలా పరిమిత సంఖ్యలో జరిపిన సర్వే ప్రకారం అవసరమైతే చైనా మీద మరిన్ని ఆంక్షలు పెట్టండి, వైమానిక, నౌకదాడులు జరపాలని మాత్రమే ఎక్కువ మంది చెప్పారు. వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లపై అమెరికా మిలిటరీ దాడుల్లో తిన్న ఎదురుదెబ్బల తరువాత తమ సైనికుల ప్రాణాలను ఇంకేమాత్రం ఫణంగా పెట్టకూడదనే వైఖరి అమెరికాలో పెరుగుతోంది. అందుకే తమ చేతికి మట్టి అంటకుండా ఇతర దేశాలను ప్రోత్సహించి వారికి తమ అస్త్ర శస్త్రాలను అమ్ముతున్నది. తైవాన్ విలీనం తప్పనిసరైతే అక్కడి ఆధునిక సెమికండక్టర్ పరిశ్రమలను మొత్తంగా ధ్వంసం చేయాలన్న దాని దుష్ట పథకం కూడా వెల్లడైంది.
ఉక్రెయిన్ పరిణామాలను చూసిన తరువాత చైనా లేదా మరొక దేశంగానీ పశ్చిమ దేశాల ఎత్తుగడలను ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయి. దానిలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. వియ త్నాం, ఇరాక్, ఉక్రెయిన్ దాడులలో అమెరికా తన ఆయుధాలను పరీక్షించుకుంటున్నది. తైవాన్ అంశంలో అవసరమైతే తమ బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుందని చైనా బహిరంగంగానే చెప్పింది. కనుక ఒకటికి రెండుసార్లు తన బలాన్ని, ఎత్తుగడలను సమీక్షించుకుంటుంది. అమెరికా, దాన్ని నమ్ముకుంటున్న దేశాలు గ్రహించాల్సిందేమంటే ఎన్ని ఆధునిక మారణాయుధాలను అమెరికా ప్రయోగించినా ఇంతవరకు ఎక్కడా అది గెలవలేదు. అలాంటిది చైనాను ఢకొని బయటపడుతుందంటే ఎవరు నమ్ముతారు.