Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవస్థల స్వతంత్రతకు సంకెళ్లు వేసి, డెమోక్రసీని నమోక్రసీగా మార్చజూస్తున్న కుతంత్రాల కాలమిది. ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఎలక్షన్ కమిషన్ కూడా ఇందుకు మినహాయింపు కాదన్నది కొత్త ముచ్చటేం కాదు. అధికారంలో ఉన్నవారి విధేయులే ఎన్నికల సంఘానికి అధినేతలుగా ఎంపికవుతుంటే అది కేవలం ఓ జేబు సంస్థగా మారిపోవడం మొదలై చాలాకాలమే అయింది. ఎక్కాల్సిన పీఠాల కోసం, ఎగరాల్సిన (ఎ)జెండాల కోసం పాలకపక్షాలు పన్నే పన్నాగాలకే తప్ప, ప్రజాభిప్రాయానికి తావేలేని ఓ తంతుగా నేడు ఎన్నికల ప్రక్రియ సాగిపోతున్నది. ఫలితంగా స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నిక ఈ దేశానికి దశాబ్దాల ఆకాంక్షగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘంలో ఏకపక్ష నియామకాలకు అడ్డుకట్ట వేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు నిచ్చింది. కేంద్రం జోక్యాన్ని కత్తిరించింది. ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్షనేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీ సిఫారసుల ద్వారానే ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరగాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు ఓ మార్పుకు దారిచూపగలదన్న ఆశాభావం కలిగించడం ఇప్పటికో శుభపరిణామం.
ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రభుత్వాల ఏకపక్ష వైఖరిని సవాలు చేస్తూ, ఈ ఎంపికలో కొలీజియం తరహ విధానాన్ని కోరుతూ పలు ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం గత నవంబర్ 24న రిజర్వులో ఉంచిన తీర్పును గురువారంనాడు ఏకాభిప్రాయంతో వెల్లడించింది. ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన పలు వ్యాఖ్యలు ఆలోచించదగినవి. ''ఎన్నికల నిర్వహణ అనేది ప్రజాస్వామ్యంలో అతి పవిత్రమైన కర్తవ్యం. అత్యంత నిజాయితీగా, నిబద్ధతతో నిర్వర్తించాల్సిన ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తే ఆ పర్యవసానాలు విధ్వంసకరంగా ఉంటాయి. తుదకు ప్రజాస్వామ్యానికే సమాధి కడతాయి'' అన్న వ్యాఖ్య ఈ దేశానికి ఓ హెచ్చరిక. ''ఇటీవల కొంత కాలంగా ఎన్నికల ప్రక్రియ నిరంతరంగా దుర్వినియోగమవుతోంది. రాజకీయాల్లో ధన, కండ బలం భారీగా పెరిగిపోయింది. రాజకీయాలు నేరపూరితమై, పార్టీలకు అధికారమే అంతిమ లక్ష్యంగా మారిపోయింది.'' అన్న విమర్శ వర్తమానానికి నిలువు టద్దం. ఈ పరిస్థితుల్లో మీడియాలో సైతం ఓ మెజారిటీ భాగం తన పాత్రను విస్మరించడమే గాక, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని చెప్పడమూ సత్యదూరం కాదు.
ఈసీ స్వతంత్రతపై కూడా ధర్మాసనం కొన్ని విలువైన అభిప్రాయాలను వ్యక్తీకరించింది. అధికారపక్షం ఒత్తిళ్ళకు లొంగిపోయేవారు స్వతంత్ర సంస్థల నియామకాలకు తగరనీ, అధికారంలో ఉన్నవారికి బానిసలుగా వ్యవహరించే వారు స్వతంత్ర సంస్థలకు నేతృత్వం వహించలేరనీ కుండబద్దలు కొట్టింది. ఇవి భావికి సూచికలే కాదు, గతానికీ ప్రతీకలు. ఇప్పటి వరకూ నియమితులైన వారిలో అనేకుల నిర్వాకాలకు నిదర్శనాలు. ఇవి ఇక ముందు పునరావృతం కావడానికి వనరుల లేమి ఓ కారణం కాకూడదని కోర్టు పేర్కొంది. ''ఆర్థిక వనరులకు కోతపెట్టడం కూడా ఎన్నికల కమిషన్ను లొంగదీసుకొనేందుకు ఓ మార్గం. దానివల్ల ఎన్నికల సంఘం దుర్బలంగా మారిపోవచ్చు'' అని చెపుతూ... ఎన్నికల సంఘానికి శాశ్వత సచివాలయంతోపాటు, భారత సంఘటిత నిధి నుండి నేరుగా ఆర్థిక వనరులు సమకూరేలా నిబంధనల్లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. లొంగదీసుకోవడానికి ఏలికలు ఏ రూపంలో ప్రయత్నించినా తట్టుకోగలిగిన స్వతంత్ర శక్తిగా ఎన్నికల సంఘం ఉండాలన్న ప్రజల ఆకాంక్షను ఇది ప్రతిబింబిస్తోంది. తీర్పుతో పాటు ధర్మాసనం చేసిన ఈ వ్యక్తీకరణలు ఎన్నికల సంఘం స్వతంత్రను కాపాడు కోవడంలో ఒక ముందడుగు. అదే సమయంలో ఈ దేశ ప్రజాస్వామిక విలువలను బలహీన పరచాలనుకునే శక్తులకు చెంపపెట్టు.
అందుకే దేశంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన, పారదర్శకమైన ఎన్నికలకు ఈ తీర్పు మార్గం సుగమం చేయడంలో ఓ మైలురాయి వంటిదని ప్రజాస్వామ్యవాదు లందరూ హర్షిస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ స్వాగతిస్తుండగా, పాలకపక్షం నుండి ఏ స్పందనా లేకపోవడం గమనార్హం. కాకపోతే కొందరు ఇది శాసన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడమేనని అక్కడక్కడా వినిపించీ వినిపించనట్టుగా గొణుగుతున్నారు. ఇలాంటి ఆరోపణలకు సైతం పరోక్షంగానే అయినా ధర్మాసనం ముందస్తుగా గట్టి సమాధానమే ఇచ్చింది. కోర్టులు ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నించకూడదన్న విషయం తమకు తెలుసునని, నియంతృత్వ పరిస్థితులు ఏర్పడకుండా నిరోధించడానికే మా ప్రయత్నమని తేల్చి చెప్పింది. ఏది ఏమైనా, ఎన్నికల నిర్వాహణ అనే బృహత్తర బాధ్యత కలిగిన ఎన్నికల సంఘం చేతుల్లోనే ప్రజాస్వామ్యం భవిష్యత్ ఉందనేది ఎంత నిజమో... ఆ భవిష్యత్తుకు కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి ప్రమాదం పొంచి ఉందనేది కూడా అంతే నిజం. ఈ నేపథ్యంలో ఈ తీర్పు నిరంతరం దాడికి గురవుతున్న భారత ప్రజాస్వామ్యానికి ఓ ఉపశమనం.