Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే గ్యాస్ సిలిండర్ ధరలను భారీ ఎత్తున పెంచి సామాన్యుడిని కేంద్ర ప్రభుత్వం బండ బాదుడు బాదింది. ఏరు దాటక ముందు ఓడ మల్లయ్య... దాటిన తరువాత బోడి మల్లయ్య... అనే ఈ తరహా విన్యాసాలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కొత్తేమి కాదు. ఎన్నికలకు ముందు పెట్రో ఉత్పత్తుల ధరలను స్థిరంగా ఉంచి, ఆ తరువాత భారీగా పెంచడం గతంలోనూ చూశాం. వరుసగా జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల పుణ్యమా కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారి పెంచేసింది. అదికూడా ఐదు, పది రూపాయలు కాదు. వంటగ్యాస్ సిలిండర్‌పై 50రూపాయల మోత మోగించింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్‌పై ఏకంగా రూ.350.50లు పెంచింది. ఫలితంగా రోడ్డు పక్కన విక్రయించే టీ నుండి అన్ని రకాల తినుబండారాల ధరలు పెరిగి సామాన్యులు సమిధలు కానున్నారు. పెరిగిన ధరల వివరాలు ప్రజలకు తెలిసే లోపే యుద్ధప్రాతిపాదికన వాటిని అమలులోకి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనం. సామాన్యుడిపై పెనుభారం మోపిన మోడీ సర్కారు అదే సమయంలో విమానాలకు వాడే ఇంధనం ధరలను గణనీయంగా తగ్గించింది. ఈ చర్యవల్ల ఎవరికి లాభమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో వంటగ్యాస్ ధర 414 రూపాయలే! ఇప్పుడు 1,125 రూపాయల నుండి 1,150 రూపాయల వరకు వివిధ ప్రాంతాల్లో చెల్లించాల్సిన పరిస్థితి. దేశీయ కరెన్సీ విలువను పరిగణలోకి తీసుకుంటే గ్యాస్ ధర మనదేశంలోనే అత్యధికం. గతంలో రాయితీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే ప్రజల నుండి వసూలు చేసేవారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం క్రమేణా ఈ పద్ధతిని మార్చివేసింది. రాయితీ మొత్తాన్ని వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెబుతూ సిలిండర్ మొత్తం ధరను వసూలు చేసే పద్ధతిని ప్రారంభించింది. క్రమేణా ఆ రాయితీ మొత్తాన్ని నామమాత్రానికి తగ్గించివేసింది. 2015లో సిలిండర్‌పై 168 రూపాయల రాయితీరాగా, 2018లో గరిష్టంగా 221 రూపాయిల రాయితీ ప్రజలకు లభించింది. ప్రస్తుతం 10 నుండి 16 రూపాయిల రాయితీ మాత్రమే వస్తుండగా, అది కూడా ఖాతాల్లో జమ కావడం లేదు. అంటే, ఒక పథకం ప్రకారం రాయితీకి కేంద్ర ప్రభుత్వం సున్నా చుట్టి, మొత్తం భారాన్ని ప్రజల మీద మోపింది. ఫలితంగా ఉజ్వల యోజన పథకం కింద సబ్సిడీ సిలిండర్లు తీసుకున్న వారు అనివార్యంగా గ్యాస్ వినియోగానికి దూరంగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గత ఏడాది కాలంలో 10శాతం మంది ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులు ఒక్క గ్యాస్ సిలిండర్‌ను కూడా తీసుకోలేదు. 56.5శాతం మంది నాలుగు, అంతకన్నా తక్కువ సిలిండర్లతో సర్దుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పేద ప్రజలు గ్యాస్‌కు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిన స్థితి ఏర్పడుతోంది. ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు, పర్యావరణానికి హానిగా మారుతోంది.
నిజానికి కొంత కాలంగా ప్రజల ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయి. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు తగ్గట్టుగా నిజవేతనాలు పెరగడం లేదు. మరోవైపు ఉన్న అరకొర ఉపాధి కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం నిరుద్యోగ రేటు గణనీయంగా పెరుగుతోంది. జనవరిలో 7.14శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఫిబ్రవరిలో 7.45శాతానికి చేరింది. పట్టణాలతో పాటు, గ్రామాల్లో కూడా పనులులేక ఈసురోమంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి రోజరోజుకి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ భారాలు మోపుతోంది. ఇప్పటికే ఉపాధి హామీ నిధుల్లో భారీగా కోత పెడుతున్నట్లు బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఆహార సబ్సిడీతో సహా వివిధ సంక్షేమ పథకాలకు నిధులను తగ్గించింది. పులిమీద పుట్రలా ఇప్పుడు గ్యాస్ ధర పెంపు! ఈ భారాన్ని మోసే స్థితిలో ప్రజలు ఎంత మాత్రం లేరు. పెంచిన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదు.