Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తల్లి కడుపులో ఉన్న శిశువుకే రామాయణ, భగవద్గీతలను వినిపించాలి. తద్వారా సంస్కృతి, విలువలు గర్భస్ధ శిశువుకు నేర్పించాలి'' అని ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం సంవర్ధినీ వ్యాస్ పిలుపిచ్చింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు తీస్తున్న 21వ శతాబ్దంలో గర్భస్థ శిశువుకు పుక్కిట పురాణాలు బోధించి సంస్కారం నేర్పాలి అనుకోవడం అజ్ఞానం కాక మరేమిటి? ఇప్పటికే విద్యా, వైద్యం రంగాలలోకి ప్రవేశించి చేస్తున్న విధ్వంసకాండ అంతా ఇంతా కాదు. ప్రతిదానికీ మతం రంగు పులుముతున్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు తల్లి గర్భంలోకి కూడా ఈ అరాచక మూకలు చొరబడుతున్నాయి. ఇది అత్యంత దారుణమైన విషయం. మగశిశువు కడుపులో ఉన్నప్పుడు తల్లి ఆడపిల్ల గురించి ఆలోచించడమే హౌమో సెక్సువల్కు కారణం అని చెప్పేంతవరకు వీరి పైత్య ప్రమాణం సాగింది. దేశానికే తలమానికమైన జేఎన్యూ ఆర్ఎస్ఎస్ అశాస్త్రీయ పాఠాలకు వేదిక అయింది. ఎంతో మంది శాస్త్రవేత్తలను, విజ్ఞానవేత్తలను అందించిన విశ్వవిద్యాలయంలో ప్రపంచం ఉలిక్కి పడే 'తిరోగమన పాఠాలు' బోధిస్తోంది. అందుకు తల్లి కడుపులో ఉండగానే అభిమన్యుడు 'పద్మవ్యూహం' ఛేదించడం నేర్చుకున్నాడని, ప్రహ్లాదుడు 'నారాయణ మంత్రం' నేర్చుకున్నాడని, 'జిజియాబారు' శివాజీకి ఎన్నో విషయాలు తన గర్భవాసంలోనే నేర్పిందని పుక్కిట పురాణాలను ఉటంకిస్తున్నారు.'పుట్టేది ఆడపిల్ల అని ముందే తెలిస్తే, కడుపులోని ఆ పిండాన్ని అక్కడికక్కడే కరిగించేస్తున్నారు. ఇలా భ్రూణ హత్యలు ఆపకుండా గర్భస్థ శిశువులకు సంస్కారం ఇస్తామని చెప్పడం ఏ సంస్కారం? మాతా శిశు మరణాలు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి?' అని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో ప్రశ్నించింది. వాటికి సమాధానాలు ఆలోచించకుండా ఈ ఆలోచనలు చేయడం ఏం సంస్కారం? 'నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి!' అనే సైద్ధాంతిక ఒరవడిలో సాగే పాలనలో నేడు దేశం ఉన్నది. స్త్రీకి అడుగడుగుగా ఆంక్షలు విధించే పాలకుల పాలనలో పూజించడం మాట అటుంచి కనీస గౌరవానికి కూడా స్త్రీ నోచుకోవడం లేదు. ఇలాంటి వారు వారికి లేని సంస్కారాలను శిశువులకు ఎలా నేర్పిస్తారు? మతం ప్రతిపాదికన పాలించే ప్రభువుల ఎలుబడిలో రాతియుగమే నయమనిపించేలా ఉంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, చెత్తకుప్పలు, మురుగు కాల్వల్లో బయటపడుతున్న మృతపిండాలు గర్భవిచ్ఛిత్తి పర్యవసానాల్ని కండ్లకు కడుతూనే ఉన్నాయి. ఎన్నో ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న ఇలాంటి హత్యోదంతాలు మానవతనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రభుత్వాల పని వాటన్నింటినీ చేష్టలుడిగి చూస్తుండటమేనా అన్నది జవాబులేని ప్రశ్న. ఆఖరికి 'గర్భస్థ లింగ నిర్థారణ పరీక్షలకు సంబంధించిన ప్రకటనల నియంత్రణ'లోనూ ప్రభుత్వాలది ఘోర వైఫల్యమే. ప్రజలను చైతన్యం చేయాల్సిన పాలకులు ప్రజలను మూఢత్వంలోకి నెడుతున్నారు. దాని పర్యవసానమే నేటి ఈ పరిస్థితికి కారణం. నేడు ఢిల్లీ పీఠాధిపతుల పాలనలో నిత్యం పెరుగుతున్న ధరలు బతుకును భారం చేస్తుంటే ఒక్క స్త్రీలే కాదు... సమాజంలో ఎవరూ మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఆరోగ్యంగా బతికే పరిస్థితి లేదు. వైద్యం కూడా ఖరీదైన కాలంలో సామాన్యజనం ఆ ఒత్తిడి నుంచి ఎలా బయటపడగలరు? ఇన్ని సమస్యలు చుట్టుముట్టిన బతుకు బండి లాగటమే కష్టమైన సామాన్యులకు ''సమవర్థినీ న్యాస్'' పుక్కిట పురాణాలు ఉద్దీపన ఎలా కలిగిస్తాయి? ఈ సూక్తి ముక్తావళి వల్లిస్తూ... సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడంలో మాత్రం కృతకృత్యులవుతున్నారు. పురాణాల కాలంలోనే మనం ప్లాస్టిక్ సర్జరీలు చేశాం. రైట్ సోదరుల కంటే ముందే పుష్పక విమానాన్ని కనుగొన్నాం. ఆవు మూత్రమే సర్వరోగ నివారిణి. అప్పడాలు తిని కరోనాను హతమార్చవచ్చు అన్న మాటలతో మభ్యపెట్టినా మంత్రాలకు చింతకాయలు రాలవని అర్థం కాలేదా? ఆ ప్రయత్నాల ప్రహసనం గత ఎనిమిదిన్నర ఏండ్లుగా కొనసాగుతున్నది. మెజారిటీ మతస్తులను భావోద్వేగాలతో రెచ్చగొట్టి ఓట్ బ్యాంకును పెంచుకునే దానిలో 'గర్భసంస్కార్' అంతర్భాగమే!