Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విభజన రాజకీయాలను తిరస్కరించకుంటే విద్వేషం పదే పదే దాడికి తెగబడుతూనే ఉంటుంది. చివరికది ప్రజల సామాజిక జీవితాన్నే విచ్ఛిన్నం చేస్తుంది. ఇలాంటి విఘాతాలకు కులోన్మాదం, మతోన్మాదం ప్రాంతీయోన్మాదం కూడా అలాంటి సాధనమే. వీటన్నిటికీ అబద్దమే పునాది. నిజం నిలకడమీద తెలుస్తుందన్న మాట నిజమేగానీ, ఆలోపు అబద్ధం సృష్టించే అనర్థం అంతా ఇంతా కాదు. కేవలం అపోహలకూ అంతఃకలహాలకే కాదు, ఒకోసారి అది క్రూరమైన హింసోన్మాదానికీ దారితీస్తుంది. ఈ విషయం విభజనవాదులకూ విద్వేషకారులకూ తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. అందువల్ల ఇప్పుడు తమిళనాడులో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ దేశమంతటా కలకలం రేపిన అసత్య వార్తలూ బూటకపు వీడియోలు యాధృచ్ఛికమని ఎంతమాత్రమూ అనుకోలేం. సామరస్యానికి చిచ్చుబెట్టి, శాంతికి ఉచ్చుబిగించే ఈ ''ఫేక్ న్యూస్'' ఎంత ప్రమాదకరమైనదో, వీటి వెనుక ఎలాంటి శక్తులుంటాయో అర్థం చేసుకోవడానికి ఈ తమిళనాడు ఉదంతం ఓ తాజా ఉదాహరణ.
ఈ ఉధంతంలో చెలరేగిన విద్వేషానికి రెండు వీడియోలు కారకాలు. ఇందులో మొదటిది రెండు గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న హింసాత్మకమైన ఘటనకు సంబంధించినది కాగా, రెండవది ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణకు సంబంధించినది. ఈ రెండూ బీహార్‌కు చెందిన వలస కార్మికులపై తమిళనాడులో జరుగుతున్న దాడులుగా ప్రచారంలో కొచ్చాయి. ఇంకేముంది... తక్షణమే వీటిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ... ''ఇది ఉత్తరాది కార్మికులపై ఊచకోత - దీనికి కారణం డీఎమ్‌కే హిందీ వ్యతిరేకత'' అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ట్వీట్ చేశారు. పనిలోపనిగా ఈ రెండు వీడియోలకు గతంలో తమిళనాడు మంత్రి ఒకరు హిందీ ఆధిపత్యాన్ని విమర్శించిన వీడియో ఒకటి జోడించారు. ఆ వెంటనే ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ పటేల్ ఉమ్రావ్ రంగంలోకి దిగారు. ఆయన ఈ రెండు వీడియోలకు, గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ ఫొటోను జతచేసారు. ''బీహారీలపై తమిళనాడులో ఊచకోత సాగుతున్నా, తేజస్వీ స్టాలిన్‌తో అంటకాగుతున్నాడు'' అని వ్యాఖ్యానించాడు. ఇది బీహారీలకే అవమానమని రెచ్చిపోయాడు. ఆపైన ఆ ఉన్మాదం దేశమంతా అంటుకుంది. సామాజిక మాధ్యమాల్లో అట్టుడికింది.
అయితే ఈ వివాదానికి కేంద్రమైన ఈ రెండు వీడియోలు పచ్చి అబద్దాలు కావడం విశేషం. మొదటిది వలస కార్మికులకు ఏ మాత్రం సంబంధంలేని రెండు ముఠాల ఘర్షణకు సంబంధించినది కాగా, రెండవది అసలు తమిళనాడుకే సంబంధంలేనిది. త్రిపురలో ఓ బిహారీవాలాకు ఓ జార్ఖండ్వాలకు జరిగిన వ్యక్తిగత తగాదాకు సంబంధించినది. ఇది వెంటనే అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వంతో పాటు, ఇలాంటి అసత్య వార్తలను ఛేదించే ''ఆల్ట్‌న్యూస్''కి చెందిన జుబైర్ వంటి నిజపరిశీలనా నిపుణులు సైతం తేల్చి చెప్పిన సత్యం. ఈ దాడుల పుకార్లతో పాటు, రైల్వే స్టేషన్లలో నిండిన బీహారీ కార్మికులను చూపుతూ... ''హింసకు భయపడి పారిపోతున్న వలస కార్మికులు'' అని ప్రచారం చేసిన వార్తలు కూడా పచ్చి అబద్దం. వారంతా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హౌలీ పండగ కోసం ఇండ్లకు వెళుతున్నారన్నది అసలు నిజం. కాగా, ఈ తప్పుడు కధనాలను దేశమంతా వ్యాప్తి చేసినవారంతా కాషాయ శ్రేణులూ, వారి హిందూత్వ నెట్‌వర్క్‌లో భాగస్వాములైన వారే కావడం గమనార్హం. తక్షణమే అప్రమత్తమై ఈ గుట్టు రట్టు చేసిన తమిళనాడు ప్రభుత్వానికీ, జుబైర్ వంటి ఫేక్‌న్యూస్ ఛేదకులకూ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. లేదంటే ఇది దేశంలో ఎంత విద్వేషాన్ని రగిలించేదో, ఎంత హింసకు పురికొల్పేదో..!
పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా తమిళనాడు అభివృద్ధిలో ఉత్తరాది వలసకార్మికుల పాత్ర కాదనలేనిది. అలా ఉత్తరాదికి చెందిన లక్షలాది కుటుంబాలు అక్కడ స్థిరపడిపోయాయి. దీనిని ఆసరాగా చేసుకుని, ఈ కలహాలు సృష్టించడం ద్వారా తమిళనాడులో పాగా వేయడం, ఎనిమిదేండ్ల తమ విధ్వంసక పాలనలో ఉత్తరాదిన బలహీనవమవుతున్న తమ పునాదిని సంఘటితం చేసుకోవడం ఈ విద్వేష వ్యూహాల లక్ష్యంగా కనిపిస్తున్నది. ఇది పసిగట్టిన స్టాలిన్ ''మా ఉత్పత్తిలో భాగస్వాములవుతున్న కార్మికులందరూ మావారే. వారి భద్రతకు మాది పూచీ'' అంటూ భరోసానివ్వడం స్వాగతించదగినది. కానీ కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు భాషల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య, రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించి, దేశాన్ని రెండు వ్యతిరేక శిబిరాలుగా విభజించే బీజేపీ కుట్రలనేమనాలి? అయినా భారత ప్రజలలో పరస్పర అనుమానాలు, ద్వేషాలు సృష్టించడం వీరికి కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే అదే వీరి విధానం. కొద్ది రోజుల క్రితం సాక్షాత్తూ కేంద్ర హౌంమంత్రి వర్యులే కర్నాటకలో మాట్లాడిన మాటలు మనం విన్నాం.. ''తమ పొరుగు రాష్ట్రామైన కేరళ పట్ల జాగ్రత్తగా ఉండాలం''టూ ఆయన కన్నడ ప్రజలల్లో అపోహలు రేకిత్తించడం గుర్తు తెచ్చుకుంటే ఈ కుతంత్రం ఎంత విస్తృతమైనదో మనకు మరింత బోధపడుతుంది.