Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇల్లొదిలి... ఊరొదిలి... కష్ట నష్టాలకోర్చి... రాత్రనక పగలనక పుస్తకాలతో కుస్తీ పట్టిన వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు నడి సంద్రంలో మునిగిపోయింది. తమ పిల్లలకు సర్కారీ కొలువులొస్తాయని ఆశించిన తల్లిదండ్రుల ఆశలు 'లీకేజీ' అనే ఒక్క దెబ్బతో అడియాశలయ్యాయి. డబ్బు, వలపు కోసం తన 'ప్రావీణ్యాన్ని' అంతా రంగరించి టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాన్ని లీకు చేసిన ఓ దుర్మార్గుడు ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నాడు. కాషాయ పరివారపు కార్యకర్త ఒకడు ఈ తతంగాన్ని దగ్గరుండి నడిపించాడనే వార్తల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షను సైతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేయటమనేది ఆయా అభ్యర్థులకు తీరని వేదనను మిగిల్చింది.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షల నిర్వహణ ఎంత లోప భూయిష్టంగా ఉందనే విషయం విదితమవుతున్నది. ఇదే కాదు.. 2016లో ఎమ్సెట్ ప్రశ్నాపత్రం లీకేజీ, 2019లో ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు, ఫలితంగా 29మంది విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అయినా అలాంటి అనుభవాల నుంచి ఏలికలు గుణపాఠాలు నేర్వకపోవటం అత్యంత శోచనీయం. సరళీకృత ఆర్థిక విధానాల అమలు నేపథ్యంలో ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల లాభాపేక్ష వల్ల ఎల్కేజీ నుంచి ఇంటర్, బీటెక్, ఎమ్‌టెక్ దాకా మార్కులు, ర్యాంకులు, డబ్బుల చుట్టే విద్యా విధానం నడవటం ఈ దుస్థితికి ప్రధాన కారణం.
అయితే ఇప్పుడు కొనసాగిన లీకేజీ వ్యవహారం మాత్రం అందుకు భిన్నంగా, పూర్తిగా ప్రభుత్వం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యమే. ఈ తతంగంతో సంబంధమున్న ప్రవీణ్, రాజశేఖర్, గురుకుల టీచర్ రేణుక, ఆమె భర్త పక్కా ప్లాన్ ప్రకారమే పేపర్లను లీక్ చేసి అభ్యర్థులకు వాటిని అమ్ముకున్నారు. సంబంధిత వ్యవహారం గుట్టు రట్టయింది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమంటే... రద్దయిన ఏఈ పరీక్షా పత్రంతోపాటు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో మరో మూడు పేపర్లు ఉండటం. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంటు పోస్టులకు సంబంధించిన పేపర్లు సదరు పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించటంతో టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ తర్వాత ఈ తతంగంపై సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించటాన్నిబట్టి ఈ స్కామ్ తీవ్రత ఏ పాటిదో తెలుస్తున్నది.
ఈ క్రమంలో వరసగా, రోజుకోటిగా వెలుగు చూస్తున్న లీకేజీ లీలలతో ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగబోతున్నదనే ఆందోళన నిరుద్యోగ అభ్యర్థులను వెంటాడుతున్నది. ప్రధానంగా గ్రూప్ -1 పరీక్షపై టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనే ఉత్కంఠ నెలకొన్నది. పేపర్ లీకేజీ జరిగిన తీరుపైనా, ఇందులో టీఎస్పీఎస్సీ నిర్వాకంపైనా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగటంతో సర్కారు తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది. మరోవైపు టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మెన్‌తోపాటు అందులోని సభ్యులు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ అధికారిక వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ అంశంలో సర్కారు నిర్ణయం కోసం వేలాది మంది కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తున్నారు. ఏతావాతా తేలిందేమంటే ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి చేసిన తప్పునకు లక్షలాది మంది నిరుద్యోగులు బలయ్యారు. వారి జీవితాలు ఇప్పుడు అగమ్యగోచరంగా మారాయి. ఎవరో చేసిన తప్పునకు వారు శిక్షననుభవిస్తూ మౌనంగా, దీనంగా రోదిస్తున్నారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని ఊరికే వదలకూడదు. నిందితులను రిమాండ్‌కు పంపటంతో సరిపెట్టకుండా నియామకాల విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మెన్, కమిషన్, కార్యదర్శి, మొత్తం సభ్యుల పాత్రపైనా సమగ్ర విచారణ జరిపించాలి. తద్వారా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడగలుగుతాం. లేదంటే నాలుగు రోజుల తర్వాత మళ్లీ ప్రశ్నాపత్రం లీకేజీలు, ఆ తర్వాత కేసులు, అటు తర్వాత నిందితులు బయటికి రావటం షరా మామూలుగా జరిగిపోతాయి. అంతిమంగా నష్టపోయేది, బలయ్యేది పేద పిల్లలే.. ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే అభాగ్యులే.