Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వవేదికపై తెలుగుపాట తన విశ్వరూపాన్ని చూపింది. భారతీయులంతా గర్వపడేలా ఆస్కార్ అవార్డుకు ఎంపికయి ఆనందాలు నింపింది. భారీయెత్తున నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో చంద్రబోస్ కలం నుండి జాలువారిన తెలుగుపాట ''నాటు నాటు''కు హాలీవుడ్ అత్యున్నత ఆస్కార్ పురస్కారాన్ని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పొందటం. ఇక్కడి సృజనాత్మకతకు అందిన ప్రతిఫలంగానే భావించాలి. పాటకూ మనిషి జీవితానికి విడదీయలేని సంబంధముంది. పాట ఒక జీవన లయ. మానవ పనిలో అదొక ఆసరా. ఆలంబన. మనిషి మనసులోని భావోద్వేగాలనన్నీ పాట రూపంలోనే వ్యక్తమవుతాయి. పాటలో గొప్పశక్తి యిమిడి ఉంటుంది. ఎంతటి వారినైనా కదిలించే గుణం దాని సారం. అందుకే ప్రజా సమూహపు ఏ ఉద్యమానికైనా పాట ముందు పీఠిన కవాతు చేస్తుంది. అశేషజనావళిని ఉరకలెత్తిస్తుంది. పాటెప్పుడూ సమూహపు ప్రతిఫలనమే. అందుకే సినిమాలో ఒక దేశపు ప్రజలకు ప్రాతినిధ్యం వహించి చైతన్య పూరితమై నిలిచింది. ముఖ్యంగా తెలుగు, తెలంగాణ భాషా పద బంధాలకు, పల్లె పద నుడికారాలకు ప్రత్యేక భావార్థ ధ్వనులున్నాయి. శబ్దమాధుర్తమూ ఉంటుంది. సంగీతంలో కలిసిపోగలిగిన లయాన్విత భాష మనది. అందుకే తెలుగు పాట హాలీవుడ్ కళాకారుల నోట కదం తొక్కిగలిగింది.
సినిమా పరిశ్రమ అనేది వ్యాపార విషయ మైనప్పటికీ అవార్డులూ, పురస్కారాలు మొదలైన ఎంపికల ప్రక్రియల్లోనూ, ప్రకటనలలోనూ ఎన్ని మతలబులున్నప్పటికీ 'నాటు నాటు' పాట ఈ స్థాయికి రావటానికి సినిమాలోని సన్నివేశమూ, సందర్భమూ, పాటలో స్వతఃసిద్ధమయిన ధిక్కార స్వరం కారణంగా చెప్పుకోవచ్చు. కల్పనా భరితంగా ఉన్నప్పటికీ మన దేశంలోని ఇద్దరు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లకు ప్రతిబింబంగా ఉన్న రామ్, బీమ్ల హుషారైన నృత్యగీతం కావడం. రెండోది వలస పాలకులకు వ్యతిరేకంగా, వారి చులకతనానికి జవాబుగా గళమెత్తిన సందర్భమూ ఆ పాటకు మరింత క్రేజీని తీసుకుని వచ్చింది. ఒక ఆత్మగౌరవ పతాకమై నిలిచిన పాట కావటమూ ఓ కారణము. ఇక పోతే పాటలో పండిత, ఉన్నత వర్గాల భాష కాకుండా, గ్రామీణ ప్రజల భాషను ఉపయోగించడం, తెలుగు ప్రాంతాలలోని ఇరు రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం వహించడం ఈ పాటలోని ప్రత్యేకతలు. 'పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పు తీసుకుని కర్రసాము చేసినట్టు, మర్రిచెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు, ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు'' అన్న పాటలోని పదాలు గ్రామీణ సంస్కృతికి అద్దం పడతాయి. జనం నాల్కలపై కదలాడే పదాలను పాటగా అల్లడంలోనే రచయిత ప్రతిభ దాగి ఉన్నది. అందుకే ఇది నాటు పాటయింది. అయితే ఇంత కన్న గొప్ప సాహిత్యం సినిమా గీతాలలో లేదా అంటే, ఉంది. కానీ ఇదొక సందర్భం మాత్రమే. కొన్ని సందర్భాలలో మాత్రమే అన్ని కలసివచ్చే అవకాశాలుంటాయి. ఏదిఏమైనా మన పాటకు ఆ స్థానం లభించడం మనకందరికీ గర్వకారణమే. 'చీకటితో వెలుగు చెప్పిన ధైర్యవచనాన్ని, 'మౌనంగానే ఎదగమని మొక్క చెప్పిన' నీతిని, 'ఎవరేమీ అనుకున్నా నీవుండే రాజ్యాన రాజువు, బంటువూ' నీవేనన్న ఆత్మస్థర్యాన్నిచ్చే పాటలను అందించిన చంద్రబోస్ ఈ పాటనూ అందించినందుకు అభినందనలు.
ఇక సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి నిర్మాణదక్షత కూడా దేశం మొత్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రజల పక్షాన నిలబడి, ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ధిక్కార స్వరాల చరిత్రను సినిమాకు నేపథ్యంగా తీసుకోవటం వల్లనే ఇంతటి ప్రచారానికి, ఆదరణకూ పాత్రమైంది. పాటను పాడిన రాహుల్ సిప్లింగ్ మన హైదరాబాద్ మంగళ్‌హాట్, ధూల్‌పేట గల్లీ కుర్రాడు కావటం, విలక్షణ సంగీత కారుడు కీరవాణి బాణీలు తీర్చి పాటలో అద్భుతమైన వేగాన్ని, బీట్‌ను పొందుపర్చటం ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమాను నిర్మించిన నిర్మాత మాత్రం ఈ ఉత్సవాల్లో పాలుపంచుకోలేకపోవడంపై అనేక రకాల వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ఇక త్రిబుల్ ఆర్ సినిమాను ఆస్కార్ కోసం, మన దేశం తరపున అధికారిక ఎంట్రీ గా వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ మన ఘనత వహించిన సర్కారు మాత్రం ఇక్కడ కూడా తన వివక్షతను ప్రదర్శించి గుజరాత్ సినిమాను ప్రమోట్ చేసింది. దానివల్ల స్వతంత్రంగానే భుజాలపై వేసుకున్న జక్కన్న ఆ ప్రయత్నాలనన్నీ కొనసాగించి విజయం పొందారు. ఇకపోతే, భారతదేశానికి మరో ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ''ది ఎలి ఫెంట్ విష్పరర్స్'' దర్శకురాలు కార్తీకి గోన్సాల్వేస్, నిర్మాత గుణీల్ మాంగాకూ వీటిని అందుకున్నారు. ఆదివాసీలకు ప్రకృతికీ ఉన్న మానవీయ సంబంధాన్ని కళాత్మకంగా తీసిన షార్ట్‌ఫిల్మ్ ఇది. ఇందులో జంతురక్షకులైన బొమ్మన్, బెల్లీ అనే భార్యా భర్తల నిజ జీవిత పాత్రలే తెరపైకి ఎక్కాయి. దర్శక నిర్మాతలయిన ఇద్దరు మహిళల ప్రతిభ దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఏదేమయినా తెలుగు పాటకు ఆస్కార్ తెచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేసిన సృజన కారులకు జేజేలు.