Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమకు అనుకూలమైన తీర్పులిచ్చే న్యాయమూర్తులకు మాత్రం రాజ్యసభ సభ్యత్వం, గవర్నరు పదవి ఇచ్చి మోడీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది.ఈ సంప్రదాయం వీరి హయాంలోనే వచ్చింది కాకపోవచ్చు కానీ, నేడు మునుపెన్నడూ లేనంతగా పెచ్చరిల్లిపోయింది. అక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే హెచ్చరించే స్థాయికి మోడీ సర్కారు చేరుకుంది. ఈ విమర్శల్లో ఆంతర్యం న్యాయవ్యవస్థను లొంగదీసుకోవడమే. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే సహించబోమని చెప్పడమే.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా... వారంత దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు. ప్రస్తుతం బీజేపీ పాలనలో ఇదొక అప్రకటిత శాసనంగా మారిపోయింది. పలువురు రాజకీయ నాయకులు, హక్కుల, సామాజిక కార్యకర్తలు తదితరులపై దేశద్రోహులు అంటూ ముద్ర వేస్తున్న కమలనాథులు, ఆఖరుకు న్యాయమూర్తులను కూడా వదలడం లేదు. వారు కూడా దేశ వ్యతిరేకులేనంటూ, 'యాంటి ఇండియా గ్యాంగ్' అంటూ సాక్షాత్తు కేంద్ర న్యాయశాఖ మంత్రి, బీజేపీ నేత కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. శనివారం ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మంత్రి 'సామాజిక కార్యకర్తలుగా చెప్పుకొనే యాంటి ఇండియా గ్యాంగ్‌లో భాగమైన కొంతమంది జడ్జీలు న్యాయవ్యవస్థను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్ర పోషించేలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు' అంటూ తీవ్రవ్యాఖ్యలే చేశారు. అంతే కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడాన్ని కూడా తప్పుపట్టారు.
మొదట సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని దారి మళ్లించిందన్నారు. ఆ తరవాత న్యాయమూర్తులు ఎన్నికలలో గెలవాల్సిన అవసరం లేదు కదా! అన్నారు. ఇప్పుడు పదవీ విరమణ చేసిన తర్వాత న్యాయమూర్తులు క్రియాశీల సామాజిక కార్యకర్తలుగా వ్యవహరిస్తే వారి విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది అంటూ బెరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే ప్రతిపక్ష నాయకుల మీద ప్రయోగించినట్టే సీబీఐ, ఈడీలను మాజీ న్యాయమూర్తులపై కూడా ప్రయోగించక తప్పదని చెప్పకనే చెపుతున్నారు. ఇది ప్రస్తుతం బాధ్యతలలో ఉన్న న్యాయమూర్తులకు కూడా ఓ హెచ్చరికలాంటిదే. ఈ హెచ్చరిక జారీ చేసింది న్యాయవ్యవస్థతో నిరంతరం జగడం పెట్టుకుంటున్న కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజునే కావడం గమనార్హం.
ఇప్పటికే స్వతంత్ర వ్యవస్థలన్నింటినీ కబళించిన మోడీ సర్కార్, న్యాయవ్యవస్థను కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకనే న్యాయవ్యవస్థ మీద పదే పదే కిరణ్ రిజిజు ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. కొలీజియం వ్యవస్థను తప్పుపట్టిన ఆయన న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థలో ఏలిన వారి అనుయాయులు న్యాయమూర్తులయ్యే అవకాశం లేకపోవడం ప్రభుత్వాన్ని కలవర పరుస్తోంది. అధికారపార్టీ తమకు అనుకూలమైన న్యాయమూర్తులను నియమించడం అంటే న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని, నిష్పాక్షికతను దెబ్బ తీయడమే.
ప్రభుత్వం మీద విమర్శను మోడీ పై విమర్శగా, మోడీ మీద విమర్శను దేశం మీద విమర్శగా పరిగణిస్తున్నతీరు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. భారత న్యాయవ్యవస్థ హైజాక్‌కు గురవుతున్నదని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని రాహుల్ గాంధీ లేదా ఏ ఇతరులు చెప్పినా.. అది దేశ న్యాయవ్యవస్థను అణచివేసే ప్రయత్నంలో భాగమేనని రిజిజు వెల్లడించారు. అయితే, కొలీజియం, న్యాయవ్యవస్థ, జడ్జిలపై రిజిజు చేసిన వ్యాఖ్యలను ఏవిధంగా చూడాలి?
తమకు అనుకూలమైన తీర్పులిచ్చే న్యాయమూర్తులకు మాత్రం రాజ్యసభ సభ్యత్వం, గవర్నరు పదవి ఇచ్చి మోడీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది. ఈ సంప్రదాయం వీరి హయాంలోనే వచ్చింది కాకపోవచ్చు కానీ, నేడు మునుపెన్నడూ లేనంతగా పెచ్చరిల్లిపోయింది. అక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే హెచ్చరించే స్థాయికి మోడీ సర్కారు చేరుకుంది. ఈ విమర్శల్లో ఆంతర్యం న్యాయవ్యవస్థను లొంగదీసు కోవడమే. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే సహించబోమని చెప్పడమే. అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ న్యాయశాఖమంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఇంత బాహాటంగా దాడి జరగలేదు. ప్రభుత్వాధినేత దన్ను, ప్రోద్బలం లేకుండా కిరణ్ రిజిజు ఇలాంటి సాహసం చేయగలరా? కాస్త ఎక్కువకాలం ప్రధాన న్యాయమూర్తులుగా ఉండే అవకాశం వచ్చినవారు ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తడం లేదు. ఇది ప్రభుత్వానికి సంకటంగా మారుతోంది. సకల రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసంచేస్తున్న మోడీ సర్కారుకు సుప్రీంకోర్టు రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించడం మింగుడు పడటం లేదు. ఆ అసహనమే ఇలాంటి వ్యాఖ్యలకు కారణం.