Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అమ్మ పెట్టదు.. అడుక్కు తిన్నివ్వదు...' తెలుగు రాష్ట్రాల్లో ఈ సామెత చాలా పాపులర్. ఇప్పుడు బీజేపీ పరివారం మాటలు వింటుంటే ఇదే సామెత గుర్తుకొస్తున్నది. తాను చేయాల్సిన పని చేయకుండా... చేసే వాణ్ని చేయనివ్వకుండా... ముందుకు పోకుండా, వెనక్కు రాకుండా ప్రతీ దానికీ అడ్డుపుల్లలేయటమే ఆ పరివారానికి ఉన్న ఏకైక పని. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వడగండ్ల వానకు అనేక జిల్లాల్లో రైతన్న ఆగమాగమైపోయిండు. మామిడి, వరి, మొక్కజొన్న, మిరప తోటలతో పాటు టమాట తదితర కాయగూరల పంటలు సైతం నేల పాలయ్యాయి. దీంతో అన్నదాత దిక్కుతోచక విలవిల్లాడాడు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ స్పందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ జిల్లాల్లో పర్యటించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. అయితే ఇక్కడ కూడా కాషాయ దళం తన కుత్సితత్వాన్ని మరోసారి బయట పెట్టుకుంది. పరిహారం విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తూ రంధ్రాన్వేషణ మొదలెట్టింది.
ఇలా బొక్కలు వెతకటంలో సిద్ధహస్తుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు... 'ఎన్నికల ఏడాది కాబట్టే రైతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది.. కేంద్రానికి నివేదిక పంపకుండానే బద్నాం చేస్తున్నారు...' అంటూ ఆడిపోసుకున్నారు. ఇలా సుద్దపూసలు మాటలు మాట్లాడటం ద్వారా 'గురివింద తన నలుపెరుగదన్నట్టు...' ఆయన వ్యవహరించారు. వాస్తవానికి గత ఎనిమిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో రైతన్నలకు ఒరగబెట్టింది ఏమీ లేకపోగా దివాళాకోరు విధానాలతో వారిని నట్టేట ముంచింది. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే హామీనిచ్చి గద్దెనెక్కిన మోడీ... ఆచరణలో వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్‌కు కోతలు పెట్టి తన రైతు వ్యతిరేకతను బయటపెట్టుకున్నారు. 2023-24 వార్షిక బడ్జెట్లో రూ.1,15,531 కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నామంటూ ప్రకటించిన కేంద్రం... అందులో ఆ రంగానికి కేవలం రూ.71,378 కోట్లనే విదిల్చి మిగతా నిధులను ఇతర పథకాలకు కేటాయించటం అత్యంత దారుణం. మొత్తం బడ్జెట్లో ఆ రంగానికి కేవలం రూ.3.2శాతం నిధులనే కేటాయించి చేతులు దులుపుకోవటం ద్వారా మోడీ సర్కారు 'కార్పొరేట్ వ్యవసాయానికి' రూట్ క్లియర్ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తుల వల్ల ప్రతీ యేటా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతున్నప్పటికీ కేంద్ర బడ్జెట్లో అందుకోసం ఎలాంటి నిధులూ కేటాయించకపోవటం అత్యంత దారుణం. వరి, పత్తి, సోయా, పప్పులు, వేరుశనగ లాంటి పంటలు చీడపీడలతోపాటు విపత్తుల వల్ల తీవ్రంగా దెబ్బతిం టున్నాయి. ఫలితంగా వాటి దిగుబడులు ఏడాదికేడాది తగ్గిపోతున్నాయి. దీనిపై బీజేపీ సర్కారు కనీస సోయి లేకపోవటం శోచనీయం. ఇదే సమయంలో భారీ వర్షాలు, తుపాన్లు, వరదలు, కరువు కాటకాలు, ప్రకృతి విపత్తులకు సంబంధించిన నిధుల్లో అత్యధికం గుజరాత్‌కు తరలిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల గురించి కేంద్రం కనీసం పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదు. గతంలో కేరళలో వరదలు సంభవించినప్పుడు, తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తినప్పుడు ప్రధానికి ఈ రెండు రాష్ట్రాలపై కనీస దయకలగకపోవటమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల చిట్టా... బీజేపీ పాపాల పుట్ట ఇంతలా ఉంటే... ఇలాంటి వాస్తవాలన్నింటినీ పట్టించుకోని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారు అదే పనిగా పనిగట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై బట్ట కాల్చి మీదేయటం విజ్ఞత అనిపించుకోవటం లేదు. 'ముందు నీ ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాత.. పక్కోడి ఇంటి గురించి మాట్లాడితే బావుంటుంది...' అనే విషయాన్ని ఆయన గుర్తెరగాలి. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, బాధ్యతగల పార్లమెంటు సభ్యుడిగా ఆయన రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకోవటానికి, పంట నష్టపరిహారం, రుణమాఫీలు, ఇన్పుట్ సబ్సిడీలు, మద్దతు ధరలు ఇప్పించటానికి వీలుగా కేంద్రంపై పోరాడితేనే జనం హర్షిస్తారు. లేదంటే ఆయన మాటలకు ఎలాంటి విలువా ఉండబోదు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతులు, కౌలు రైతుల విషయం లో ఒక అంశాన్ని స్పష్టంగా గుర్తించాలి. 'వాస్తవ సాగుదారుడైన కౌలు రైతుకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి...' అంటూ వామపక్షాలు సూచించిన నేపథ్యంలో సీఎం సానుకూలంగా స్పందించటం హర్షణీయం. అయితే అక్కడితో ఆగకుండా దుక్కి దున్ని, పంట పండించే అసలు సిసలైన కౌలు రైతును అన్ని విధాలా ఆదుకోవాలి. వారికి రైతు బంధు, రైతు బీమాను అమలు చేయాలి. అప్పుడే బీజేపీకి మరింత ధీటైన సమాధానం ఇవ్వగలరు.