Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు..?' యాంకర్ ప్రశ్న. 'నేను, అమ్మా, నాన్నా, ఇంకా మోడీజీ...' చిన్నారి సమాధనం.'ఔను మేలు చేసేవారు మన ఇంట్లోనే కాదు...గుండెల్లో ఉంటారు' అంటూ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం గుప్పిస్తున్న ఇలాంటి ప్రకటనలు ఎంతటి హాస్యాస్పదమో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌కు శనివారం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం తేటతెల్లం చేస్తోంది. పౌష్టికాహార లోపాలున్న పిల్లలు భారతదేశంలోనే అధికంగా ఉండటం దేనికి సంకేతం. దేశంలో ఆరేండ్లలోపు పిల్లలు 22కోట్ల మంది ఉన్నారు. రాబోయే కాలంలో వివిధ రంగాల్లో సేవలు అందించే ఈ తరం ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజ పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వేగంగా మారుతున్న ప్రపంచంలో... అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో పౌష్టికాహార లోపం ఈ తరాన్ని తీవ్రంగా వేదిస్తోంది.
మిషన్ పోషన్ కింద 'పోషన్ ట్రాకర్' ప్రకారం ఫిబ్రవరిలో 5.6కోట్ల మంది చిన్నారుల్లో 43లక్షల మంది (7.7శాతం మంది) పోషకాహార లోపాన్ని కలిగి ఉన్నట్టు గుర్తించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) సమాచారాన్ని కేంద్ర మంత్రి సభలో వెల్లడించారు. ఈ సమాచారం ప్రకారం... దేశంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో పెరుగుదల సమస్యలున్నాయి. 35.5శాతం పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేదు. ఎత్తుకు తగిన బరువులేని వారు 19.3శాతం ఉంటే, అయిదేండ్లలోపు పిల్లల్లో 44.3శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ సర్వే నిర్వహించింది స్వయనా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖే కావడం గమనార్హం.
దేశంలోని మూడేండ్లలోపు పిల్లల్లో 47శాతం తక్కువ బరువుతో ఉన్నారని యునిసెఫ్ అంచనా. ప్రపంచంలోని మొత్తం పౌష్టికాహార లోపాలతో ఉన్న పిల్లల్లో మూడోవంతు మనదేశంలోనే ఉన్నారని యూనిసెఫ్ స్పష్టం చేస్తోంది. మరోవైపు ఆహార సంక్షోభం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ఇప్పటికే తీవ్రంగా ఉన్న ఈ పౌష్టికాహార సమస్యను మరింత జటిలం చేశాయని నివేదికలు చెబుతున్నాయి. పిల్లల్లోనే కాదు, తల్లుల్లో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉందని వివిధ అధ్యయనాలు తెలుపుతున్నాయి. దేశంలోని పిల్లల్లో 80శాతం, మహిళల్లో 56శాతం రక్తహీనతతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఇతర అన్ని రంగాల్లో మాదిరిగానే పౌష్టికాహార లోపాల్లోనూ అణగారిన వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో వెనుకబడి ఉన్నారనేది వాస్తవం. వారిలోనే తక్కువ బరువున్న పిల్లలు 14 నుంచి 20శాతం అధికంగా ఉన్నారు. బాలికల్లో ఇంకాస్త ఎక్కువగా ఇది ఉంది. ఇది వారి పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది.
ఆహార ద్రవ్యోల్బణం కూడా పౌష్టికాహార లోపాలకు కారణమవుతోంది. దేశంలోని 30శాతం కుటుంబాలు పెరుగుతున్న ధరల వల్ల ఆహార వినిమయాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. భారత్‌లో 24శాతం పిల్లలు రోజంతా ఆహారం లేకుండా ఉంటున్నారని 'సేవ్ ది చిల్డ్రన్ ఇంటర్నేషనల్' అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. ప్రజల ఆహార భద్రతను రక్షించడంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కీలకం. పౌష్టికాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు. వ్యక్తి, కుటుంబం, సమాజంపై ఇది విస్తత దుష్ప్రభావాన్ని చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇది ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. పేదరికాన్ని పెంచుతుంది. శారీరక శ్రమ శక్తిని తగ్గిస్తుంది. ఫలితంగా ఉద్పాదకత తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) విశ్లేషించింది. రోగనిరోధక శక్తిని తగ్గించి, అంటురోగాల దుష్ప్రభావాన్ని తీవ్రతరం చేస్తుంది. విద్య, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆహార సబ్సిడీలు, ఆహార భద్రత కార్యక్రమాలపై విమర్శలు చేసేవారు దేశ పౌష్టికాహార స్థితిగతులపై వెల్లడవుతున్న ఈ గణాంకాలను చూసైనా అభివద్ధి పట్ల సరైన దృక్పథాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నేటీ పరిస్థితికి, దేశ పాలకులకు 'ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకీల మోత...' సామెత సరిగ్గా సరిపోతుంది. మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు పేదోడికి ఒక పూట తిండి కూడా పెట్టడం లేదు. వారు ప్రకటనలో చెప్పినట్టు మోడీనే ప్రతి ఇంట్లో ఉంటే ఇలా ఎందుకుండేది? దేశ సంపదను కేంద్రం కార్పొరేట్లకు ధార పోస్తున్నదనేది జగమెరిగిన సత్యం. అప్పుల భారం తీర్చుకోవడానికి ప్రభుత్వరంగ సంస్థలను తన మిత్రులకు అప్పనంగా కట్టబెడుతున్నది. అక్కడి నుంచి తెచ్చిన డబ్బులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఒక వైపు దేశ పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతున్నది. అయినా మేం గొప్పవాళ్లం, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు.