Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ప్రశ్నించిన వారికి కోర్టు శిక్ష విధిస్తుందని గుజరాత్ హైకోర్టు తాజా తీర్పు తెలుపుతోంది..! ప్రధానమంత్రి మోడీ విద్యార్హత ఏమిటి? అని ప్రశ్నించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పాతికవేలు జరిమానా విధించింది. ప్రధాని విద్యార్హత గురించి ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని కూడా తేల్చేసింది. చదువుకోకపోవడమేమీ దోషమో, నేరమో కాదు. పైగా మన దేశంలో రాజకీయ నాయకులకు విద్యార్హత తప్పనిసరి కూడా కాదు! అలా అని ప్రధాని నిరక్షరాస్యుడని ఎవరూ అనడంలేదు. కానీ ఆయన ఎంఏ పూర్తి చేశారన్నది నిజమా, అబద్దమా..? అన్నదే ప్రశ్న. నిజానికి ఈ వివాదం ఇప్పుడే మొదలైంది కాదు. 2016లో అరుణ్ జైట్లీ, అమిత్ షాలు ఉమ్మడిగా విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రధాని డిగ్రీ పట్టా చూపించారు. అప్పుడే అనేక అనుమానాలను రేకెత్తించిన ఆ సర్టిఫికెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అందులో 'యూనివర్సిటీ'కి బదులు 'యూనిబర్సిటీ' అని ఉండటంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. అంతే కాదు ఆ సర్టిఫికెట్లో పేర్కొన్న తేది నాటికి కనిపెట్టని మైక్రోసాప్ట్ ఫాంట్లు, ఎంఏ ''ఎంటైర్ పొలిటికల్ సైన్స్'' అనే అర్థరహిత సబ్జెక్టులు కలిసి ఆ పట్టా విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి.
వాస్తవానికి ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ కక్షిదారు కాదు. ఆయన కేంద్ర సమాచార కమిషన్‌ను స.హ చట్టం ద్వారా ప్రధాని విద్యార్హతలు తెలియజేయమని దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు కేంద్ర సమాచార కమిషనర్‌గా ఉన్న మాడభూషి శ్రీధర్ ఈ వ్యవహారంలో వాస్తవాలు వెల్లడించాలని గుజరాత్, ఢిల్లీ విశ్వవిద్యాలయాలను ఆదేశించారు. వాటిని గుజరాత్ విశ్వవిద్యాలయం ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. తాజాగా గుజరాత్ హైకోర్టు సైతం తన తీర్పు ద్వారా ప్రధాని విద్యార్హతలపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయకపోగా వాటిని మరింత పెంచింది. తమ పూర్వ విద్యార్థి ఈ దేశాన్ని పాలిస్తున్నాడంటే అది ఆ విశ్వవిద్యాలయానికే గర్వ కారణం కదా! కానీ, ఆ యూనివర్సిటీ ఎందుకో స్పందించడంలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చదువుకున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన పేర ఒక పీఠమే ఉంది. అలాంటి పీఠమో, మరేదైనా మోడీ కూడా ఏర్పాటుచేసుకోవచ్చు కదా?
మోడీ డిగ్రీ ఏమైనా రహస్య పత్రమా? అందులో దేశ భద్రతకు సంబంధించిన అంశాలేమైనా ఉన్నాయా? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించడంపై గుజరాత్‌లోనే కేసు నమోదు కావడంలో ఉన్న మతలబు ఏంటి? ఎవరైనా ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు ఎన్నికల కమిషన్‌కు అందజేసే అఫిడవిట్లో తమ విద్యార్హతలను కూడా ప్రస్తావించడం తప్పనిసరి. అలా మోడీ సమర్పించిన అఫిడవిట్లో తను పేర్కొన్న విద్యార్హతలు వాస్తవమా? కాదా? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మోడీ డిగ్రీ సామాజిక మాధ్యమాలలో ఉంది అని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అంటున్నారు. మరి ఆ డిగ్రీని స.హ చట్టం కింద అడిగినవారికి ఇవ్వడాని అభ్యంతరమేమిటో మాత్రం చెప్పడం లేదు. పైగా గుజరాత్ హైకోర్టు ప్రధాని డిగ్రీ గురించి ఎవరూ ప్రశ్నించకూడదని ఆదేశించడం, కేజ్రీవాల్‌కు జరిమానా విధించడం మహా విడ్డూరం! మరో వైపు మోడీ బీఏ డిగ్రీ గురించిన వ్యవహారం ఇంకా ఢిల్లీ కోర్టులో విచారణలోనే ఉంది. ఎన్నికల కమిషన్ ఎదుట దాఖలుచేసే అఫిడవిట్లో ఇచ్చే సమాచారం తప్పయితే శిక్షకూడా పడొచ్చు. అందుకే గుజరాత్ హైకోర్టు ఈ అంశాన్ని లేవనెత్తడానికి వీలులేదని ఆంక్ష విధించిందా? సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం ప్రధానమంత్రి విద్యార్హతతో సంబంధం ఏమిటి? దీనివల్ల ప్రజాస్వామ్యానికి వచ్చిన ముప్పేమీ లేదనీ, ప్రజాహితానికి సంబంధించిన అంశం కాదనీ కొట్టిపారేస్తున్నారు. అందుకే నేటికి అవి అనుమానాలుగానే ఉన్నాయి.
ఈ వ్యవహరంపై తగ్గేదే లేదంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి. ''భారత దేశ ప్రధాని విద్యావంతుడు కావాల్సి ఉంది. ఇది 21వ శతాబ్దపు భారతదేశం. దేశ యువకులు శాస్త్ర, సాంకేతికతలను విశ్వసించేవారు. తమకు ఉద్యోగాలు, దేశానికి అభివృద్ధి కావాలని కోరుకునే వారు. విద్యావంతుడైన ప్రధాని నేతృత్వం వహించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. తక్కువ విద్య.. లేదంటే నిరక్షరాస్యుడైన ప్రధాని దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లలేరు'' అని నిన్నటికి నిన్న ఢిల్లీ బహిరంగ సభలోనే కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. నిజంగా చదవి ఉంటే ఎక్కడ చదివారో, ఏం చదివారో చెప్పడానికి ప్రధానికి సిగ్గెందుకని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సైతం ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యానికే మూలస్తంభం. జవాబుదారీతనం ఏలికల బాధ్యత. ఈ ప్రాథమిక సూత్రాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో బోధపడని విషయమేమీ కాదు.