Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా చరిత్రలో అధ్యక్షులుగా పని చేసిన వారిలో అత్యంత హీన, చెత్త నేపధ్యం గలిగిన వాడిగా డోనాల్డ్ ట్రంప్ చరిత్రకెక్కాడు. ప్రస్తుతం శిక్షార్హమైన 34 అభియోగాలను న్యూయార్క్ కోర్టులో మోపారు. వాటిని రుజువు చేస్తే ట్రంప్‌కు 136 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. వాటిలో పన్నుల ఎగవేత, రికార్డుల తారుమారు మొదలు బూతుపురాణం, దాన్ని దాచేందుకు డబ్బు చెల్లింపు వరకు అనేక అంశాలున్నాయి. అనివార్యమైన స్థితిలో ఏప్రిల్ నాలుగవ తేదీన ట్రంప్ పోలీసులకు లొంగిపోయాడు. వెంటనే విడుదల కూడా చేశారు. తన మీద మోపిన ఆరోపణలన్నీ వాస్తవం కాదని అనేక మంది మాదిరే ట్రంప్ అంటున్నాడు. ఆగస్టు ఎనిమిదవ తేదీలోగా తాను నిరపరాధిని అని నిరూపించుకొనే అంశాలను కోర్టుకు సమర్పించాలి. డిసెంబరు నాలుగవ తేదీన కోర్టు ట్రంప్‌ను విచారిస్తుంది. ఈ పరిణామాలను చూస్తుంటే ఇదొక ప్రహసనంగా కూడా కనిపిస్తున్నది. విచారణ ముగిసేసరికి వచ్చిన వార్తల ప్రకారం మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం, ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వస్తాయి. కేసు ఉన్నప్పటికీ పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ట్రంప్ మీద మోపిన కేసులోని అంశాలకు శిక్షపడుతుందని చెప్పేవారితో పాటు రుజువు చేయటం అంత తేలిక కూడా కాదన్నవారూ ఉన్నారు.
కేసులు రుజువై శిక్ష పడుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఎక్కువ సార్లు పార్టీలు మారినవాడిగా, రెండు సార్లు అభిశంసనకు గురైన, తొలిసారిగా అరెస్టయిన పేరుమోసిన అధ్యక్షుడిగా చరిత్రకు ఎక్కాడు. ఇటీవలి కాలంలో పదవిలో ఉంటూ రెండవసారి ఎన్నికల్లో ఓడిన చరిత్రనూ స్వంతం చేసుకున్నాడు. మన దేశంలో అనైతికం అన్నది అమెరికాలో కాదు. డేటింగ్ పేరుతో కలసి కాపురం, పెళ్లికాకుండానే పిల్లల్ని కూడా కనవచ్చు, తరువాత నచ్చకపోతే మరొకరితో అదే సాగించవచ్చు. వివాహాలకూ పరిమితి లేదు.ఒకరితో ఉండేటప్పుడు నిజాయితీగా కట్టుబడి ఉన్నారా లేదా అన్నదే నీతికి కొలబద్దగా చూస్తారు. ట్రంప్ కంపులోకి వెళితే ఆరుపదుల వయసులో కూతురికంటే చిన్నదైన 27ఏండ్ల బూతు సినిమా అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె డబ్బు కోసం ఆ వివరాలన్నీ పత్రికలకు అమ్ముతానంటే అచ్చు కాకుండా లక్షలకొద్దీ డాలర్ల డబ్బు ఇచ్చి జాగ్రత్తపడ్డాడు. ఇలాంటి బాగోతాలు చాలా నడిపాడు. పన్నులు ఎగవేసిన బాగోతాలు ఎన్నో. నిజానికి ఇవన్నీ వ్యక్తిగతమైన బలహీనతలు, అరాచకానికి సంబంధించినవి. అమెరికా అధ్యక్షులుగా ఉన్నవారు ప్రపంచమానవాళి మీద జరిపిన దాడులు, లక్షలాది హత్యలు, దేశాలను నాశనం చేసినందుకు ఏ ఒక్కరి మీదా కేసులు లేవు. ఈ విషయంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లూ ఎవరూ ఎవరికంటే తీసిపోరు.
డోనాల్డ్ ట్రంప్ అక్రమాలు, అవినీతి, అనైతిక వ్యవహారాలు ఆకస్మికంగా ఇప్పటికిప్పుడు వెల్లడైనవి కాదు. ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్నవే. 'హౌడీ మోడీ' పేరుతో అమెరికాలోని హూస్టన్ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో డోనాల్డ్ ట్రంప్‌తో చెట్టపట్టాలు వేసుకొని కలియతిరిగిన నరేంద్రమోడీ అబ్‌కీబార్ ట్రంప్ సర్కార్ అని నినాదమిచ్చి ట్రంప్‌ను రెండోసారి ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. నీవు ఎలాంటి వాడివో చెప్పాలంటే నీ స్నేహితుడిని చూస్తే చాలన్నది ఒక సామెత. ఒక దేశ ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీ మరొక దేశాధినేతకు మద్దతుగా ప్రచారం చేయటం పరాయి దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే. డోనాల్డ్ ట్రంప్ బాగోతం నరేంద్రమోడీకి తెలీకుండానే అలా ప్రచారం చేసి ఉంటారా? అజిత్ దోవల్ వంటి జేమ్స్‌బాండ్, ఎందరో సలహాదారులు ఉండి కూడా ట్రంప్ గబ్బు చరిత్రను మోడీకి ఎందుకు చెప్పలేదు? చెప్పిన తరువాత కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి ట్రంప్‌కు మోడీ భజనచేశారా? మన ప్రధాని అంత అమాయకుడు అనుకుంటే పొరపాటు. ట్రంప్ పచ్చిమితవాది, అమెరికా ఎన్నికల్లో సంఫ్‌ు పరివార్ సంస్థలకు చెందిన వారు ట్రంప్‌కు ప్రధాన మద్దతుదారులు, మోడీ-ట్రంప్‌లు ఇద్దరూ మితవాద భావజాలాలకు చెందిన వారు కావటమే వారిని చెట్టపట్టాలు వేసుకుతిరిగేట్లు చేసింది.
చిత్రం ఏమిటంటే గత ఎన్నికల్లో పనిగట్టుకొని జనం ఇంటికి సాగనంపారు. ఇప్పుడు అరెస్టు అయిన ట్రంప్‌కు విడుదలైన 24గంటల్లోనే వచ్చే ఎన్నికల్లో గెలవాలంటూ 40లక్షల డాలర్ల మేర విరాళాలు అందించిన వార్తలు ఆశ్చర్యం కలిగించటం లేదు. ప్రపంచంలో దిగజారుతున్న అమెరికా ప్రతిష్టను నిలపాలంటే పచ్చిమితవాదులకు ప్రతినిధులైన ట్రంప్ వంటి రిపబ్లికన్లు కావాలని జనం కోరుకుంటున్నట్లు పార్లమెంటు ఎన్నికల్లో దిగువ సభలో ఆ పార్టీకి మెజారిటీ కట్టబెట్టటాన్ని బట్టి స్పష్టమైంది. అమెరికాకు అగ్రస్థానం అనే దురహంకారులదే సభలో పెత్తనం. ఆ దమ్ముతోనే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తిరిగి ట్రంప్ పోటీ చేస్తాడని, గెలుస్తాడని అనేక మంది నమ్ముతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం.