Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అలలపై నిఘా, అలలు కనే కలలపై నిఘా, చిరుగాలి సితారా సంగీతంపై నిఘా, అలలపై కదిలే పడవలపై నిఘా, పడవల తెరచాపలపై నిఘా, తెరచాపల తెల్లదనంపై నిఘా' ప్రముఖ కవి శివసాగర్ అన్న వ్యాఖ్యలు మోడీ సర్కారుకు సరిగ్గా సరిపోతాయి.
సాంకేతిక పురోగతితో పారదర్శకత మెరుగుపడాలి. పౌరులు అభిప్రాయాల వ్యక్తీకరణకీ, భావాల కలబోతకీ గల అవకాశాల్ని విస్తృతం చేయాలి. కానీ, అందుకు విరుద్ధంగా మనుషుల కదలికలపై నిఘా పెంచడమంటే రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛని కాలరాయడమే. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే అసత్య సమాచారమేదీ ఆన్లైన్లో వ్యాప్తిచెందకుండా చూడటం కోసమంటూ... సవరించిన 2021 ఐటీ నిబంధనలను నాలుగు రోజుల క్రితం సర్కారు నోటిఫై చేసింది. ఆ ప్రకారం, సామాజిక మాధ్యమాలు, అంతర్జాల సేవలు అందించే సంస్థలు 'సురక్షితం'గా మనగలగాలంటే ఆ సర్కారీ విభాగం నకిలీ వార్తలుగా తేల్చిన వాటిని తక్షణమే తొలగించాల్సి ఉంటుంది. వార్తల తప్పొప్పులను నిర్ధారించే సర్వాధికారాలను ప్రభుత్వం తనకుతాను కట్టబెట్టుకోవడంపై 'ఎడిటర్స్ గిల్డ్' ఆందోళన వ్యక్తంచేసింది. అర్థవంతమైన సంప్రదింపులేవీ లేకుండా ఏకపక్షంగా నిబంధనల మార్చడమేమిటని ప్రశ్నించింది.
సామాజిక ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలకు కారణభూతమవుతున్న కల్పిత వార్తలను కట్టడి చేయడం, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కచ్చితంగా అవసరమే! కానీ, ఆ నెపంతో ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువైన భావస్వేచ్ఛను, మీడియాస్వేచ్ఛను హరించే మంత్రాంగంగా ఐటీ నిబంధనల సవరణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మన వ్యక్తిగత సమాచారాన్ని చాటుమాటుగా మార్కెట్శక్తులకు అమ్ముకుంటున్నారు. తాజాగా పర్సనల్ కంప్యూటర్ను కూడా ఎప్పుడంటే అప్పుడు తనిఖీ చేసే దుర్మార్గానికి పాలకులు తెరదీశారు. మనకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదని, అధికారంలో ఉన్నవారు చెప్పిందే వేదంగా నమ్మాలన్నది ఏలికల అభిప్రాయం. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు మార్కెట్శక్తులకీ, పాలకపార్టీలకి గులాంగిరీ చేస్తున్న నేపథ్యంలో ప్రజల మనోభావాల వ్యక్తీకరణకు వేదికైంది సోషల్మీడియా. జనం గోడును పట్టించుకోని ప్రధాన స్రవంతి మీడియాకి ప్రత్యామ్నాయంగా నిలిచింది. దీనిని కూడా నియంత్రించే మహా కుతంత్రానికి తెరదీశారు కమలనాధులు.
కంప్యూటర్ల వినియోగం, ఇంటర్నెట్ విస్తరణ వంటి అవకాశాలపై ఆంక్షలు విధించడమంటే ఎటూ మెసలకుండా చేయడమే. ఎవరు తుమ్మినా, దగ్గినా బెంబేలెత్తే అభద్రతాభావంలో పాలకులు ఉన్నారనడానికి ఇంతకంటే ఉదాహరణలింకేమి కావాలి? ఒక చిన్న మెసేజ్, ఈమెయిల్ కూడా తమ కంటబడకుండా వెళ్ళరాదనే ధూర్తత్వాన్ని పాలకులు ప్రదర్శిస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు వెల్లడించడం పత్రికలూ ప్రసారమాధ్యమాల విధి. మలయాళ వార్తా ఛానెల్ 'మీడియా వన్'పై కేంద్ర ప్రభుత్వ నిషేధాన్ని తొలగిస్తూ కొద్దిరోజుల క్రితం సర్వోన్నత న్యాయస్థానమే ఈ కీలకాంశాన్ని ఉద్ఘాటించింది. ప్రజాస్వామ్య మనుగడకు మీడియా స్వతంత్రత ముఖ్యమైనదని సుప్రీంకోర్టు చెప్పిన మాటలు అక్షరసత్యాలు. 'లైంగికదాడులపై మీడియా కథనాలే ప్రజల్లో చైతన్యానికి కారణమయ్యాయి... పత్రికలు ఎన్నో సామాజిక, రాజకీయ మార్పులకు ప్రేరణగా నిలిచాయి' అంటూ సిజెఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఇటీవల పత్రికాస్వేచ్ఛా పరిరక్షణకు పిలుపిచ్చారు.
ప్రభుత్వ విధానాలను ప్రజాప్రయోజనాల కోణంలో నిష్పాక్షికంగా విమర్శించే పత్రికలూ ప్రసారమాధ్యమాలపై కత్తిగట్టే ధోరణులు దేశీయంగా కొన్నేళ్లుగా విశృంఖలమ వుతున్నాయి. మీడియా సంస్థల పీకనులమడానికి రాజద్రోహం వంటి కఠిన శాసనాలను ప్రయోగించిన ఉదంతాలూ గతంలో వెలుగుచూశాయి. 'రైట్స్ అండ్ రిస్క్ అనాలసిస్ గ్రూప్' నివేదిక ప్రకారం ఒక్క 2021లోనే దేశవ్యాప్తంగా ఆరుగురు పాత్రికేయులు దారుణ హత్యలకు గురయ్యారు. వివిధ దాడుల్లో మరో వంద మందికి పైగా బాధితులయ్యారు. పదమూడు వార్తాపత్రికలు, మీడియా సంస్థలు వేధించబడ్డాయి. తమకు ఎదురే ఉండకూడదనే అప్రజాస్వామిక ఆలోచనను నెత్తినమోస్తున్న మోడీ సర్కార్, పత్రికలపై కూడా అదే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది. విమర్శనాత్మక పాత్రికేయంపై ప్రభుత్వ, ప్రభుత్వేతర పెత్తందారీ శక్తుల్లో పోనుపోను అసహనం పెచ్చరిల్లుతోంది. రాజ్యాంగ బద్ధమైన పత్రికాస్వేచ్ఛకు అది ప్రాణసంకటమవుతోంది. అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంలో ప్రజల భావస్వేచ్ఛకు ఇది గొడ్డలిపెట్టు. ఈ పాశవిక విధానాల్ని నిరసించడం, ప్రతిఘటించడం ఆలోచనాపరుల కర్తవ్యం.