Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక వ్యక్తి శారీరక ఆకృతి లేదా లక్షణాలను బట్టి అమానవీయ, అవమానకర, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని 'బాడీ షేమింగ్' అని అంటాం. ఇటీవలే భార్య అందంగా లేదని ఓ భర్త పెట్టిన వేధింపులతో అమాయక అబల ఆత్మహత్య చేసుకుంది. తన భార్య బాగా అందంగా ఉందని, వివాహేతర సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానంతో భార్యనే హత్య చేశాడో అనాగరిక మానవ మృగం. లావుగా ఉన్నోడిని 'బండోడని, దున్నపోతని, పందిలా ఉన్నావని', సన్నగా ఉన్నోడిని 'బక్కోడని, పుల్లారావ్' అని, కంటి రంగును బట్టి 'పిల్లి కండ్లోడ'ని, దేహకండరాల్ని బట్టి 'లావు తోడలు, బర్రె పిర్రలు ఉన్నాయని' తరుచుగా ఎగతాళి మాటల తూటాలు విసుతూనే ఉంటాయి. అమ్మాయి స్లిమ్‌గా ఉంటే 'కత్తి'లా ఉందని, చర్మం నలుపుగా ఉంటే 'కర్రోడ'ని, తెల్లగా ఉంటే 'ఎర్రోడని', దంత అమరికలో 'ఎత్తు పళ్లోడని', కురుచగా ఉన్నోళ్లను 'పొట్టోడని', ఆరడుగులోల్లను 'పొడుగోడని' అనేక రకాలుగా అవమానకరంగా దుర్భాషలను విసిరే ప్రబుద్ధులు మన మధ్యనే ఉన్నారు. ఆకారంపై వికార వ్యాఖ్యలు చేయడం అన్యాయం, అమానవీయం అని సమాజం గుర్తించాలి. సెలబ్రిటీల శరీర ఆకృతులపై అసహ్యకర కామెంట్స్ చేసే వ్యక్తుల మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండక పోవచ్చని తెలుస్తున్నది. లావెక్కడం, నల్లగా ఉండటం, బట్టతల ఉండడం, పొట్టరావడం, శరీరాకృతి సరిగ్గా లేకపోవడం, స్టైల్‌గా కనిపించడం, హేయిర్ స్టైల్, పొడుగ్గా ఉండడం, పొట్టిగా ఉండటం లాంటివి సహజంగా వచ్చిన శారీరక మార్పులు మాత్రమే. ప్రత్యేక వస్త్రధారణ, మేకప్ అతిగా, తక్కువగా ఉండటం లాంటి సందర్భాలను ఆసరాగా చేసుకొని పోకిరి సమాజం మాటల ముళ్లతో గుండెల్లో గునపాలుదించుతానే ఉంటుంది. శరీర ఆకారాన్ని బట్టి కూడా పుట్టుకతోనే నలుపు చర్మం రావడం, పొట్టిగా ఉండటం, అంగవైకల్యం, బట్టతల లాంటివి ఎవరు కోరుకునే అంశాలు కావని మనందరికి తెలుసు. మనుషుల శారీరక ఆకృతి పట్ల అసహ్యకరంగా 'ట్రోలింగ్' చేయడం అనే దురాచారం నేటి ఆధునిక సామాజిక మాద్యమాల్లో సర్వ సాధారణమైంది. ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు సదరు వ్యక్తుల మానసిక స్థితిపై దుష్ర్రభావాన్ని కలిగిస్తున్నాయి. నేడు జబర్ధస్తుగా అంద వికారమే ఆధారంగా నవ్వుల షోల ఎపిసోడ్లు మనకు తాత్కాలిక ఆనందాన్ని కలిగించి ఉండవచ్చు. బూతుకు, కామెడీకి వ్యత్యాసం చెరిగి పోవచ్చు. మన సమాజం సన్నగా, తెల్లగా, అందంగా ఉన్న వారినే ఆరాదిస్తున్నది. శారీరక కొలతలను సిక్స్ ప్యాక్, జీరో సైజ్లంటూ సమాజం ప్రమాణీకరించింది కూడా. శారీరక ఆకృతిలో తేడాలున్న వారిని 'అంద వికారులంటూ' ముద్ర వేస్తూ, నేటి సమాజంలో అమానవీయ, ఆక్షేపణీయ మాటల తూటాలు విసిరే దురాచారం వేగంగా విస్తరిస్తున్నట్లు కనబడుతున్నది.
బాడీ షేమింగ్ అనాచారానికి గురైన ఆయా వ్యక్తులు మానసికంగా గాయపడడం, కుంగి పోవడం, ఏకాగ్రత కోల్పోవడం, ఆందోళన చెందడం, నిరాశకు గురి కావడం, ఇబ్బంది పడటం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, తన మీద తనకు కోపం రావడం, పది మందిలో నిలువక ఒంటరిగా ఉండి పోవడం, బెదిరింపులను లోను కావడం, ఆవేశంగా ప్రవర్తించడం, ఈటింగ్ డిసార్డర్స్, సెల్ఫ్- ఇంజురీకి పాల్పడడం, వ్యక్తిత్వం తిరోగమన దిశలో మారడం, నిరుత్సాహపడడం, మానసిక రుగ్మతలకు లోనుకావడం, సమాజంలోకి, కాలేజీకి వెళ్లడానికి భయపడడం, భావోద్వేగ ఒత్తిడికి లోనుకావడం జరుగుతుంది. శరీర ఆకృతితో పాటు ధరించే దుస్తులను బట్టి కూడా నెగెటివ్ కామెంట్స్ వింటుంటాం. బాడీ షేమింగ్‌లో వ్యక్తిలోని శరీర అమరికను ఇతరులతో పోల్చి హేళన చేయడం, వ్యక్తి ముందే నెగెటివ్ కామెంట్స్ చేయడం, వ్యక్తి లేనపుడు అసహ్యకర వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఒకరి శారీరక అవలక్షణం మరొకరి సంతోషానికి కారణం కారాదు. ఇలాంటి శారీరక వికారం కలిగిన వారిని జోకర్లుగా చూపించడం నేటి సినిమాలు, టీవీ షోల్లో సాధారణం కావడం విచారకరం. శారీరక ఆకారం సరిగాలేని యువతులు, వాటిని వదలుకోవాడానికి పలు ఖరీదైన ప్రమాదకర కాస్మటిక్స్, బ్యూటీ పార్లర్లు, సర్జరీలు, చికిత్సలు చేయించుకోవడానికి కూడా వెనుకబడడం లేదు. అధిక బరువుతో లావుగా ఉన్న వారిలో బాడీ షేమింగ్‌కు భయపడి 65శాతం మంది బరువు తగ్గించుకోవడానికి ఖర్చులు చేస్తున్నారు. బాలికల్లో 33శాతం, బాలల్లో 25శాతం మంది బరువు ఆధార అవహేళనాలకు గురి అవుతున్నారు. లావుగా ఉన్న వారిని 84శాతం మంది సహవిద్యార్థులు హేళన చేయడం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల ప్రజలు బాడీ షేమింగ్ ఫలితంగా ఈటింగ్ డిసార్డర్ కలిగి ఉన్నారు.
శారీరక ఆకృతి మన చేతిలో లేదు. ఇది పుట్టుకతోనే వచ్చిందని తెలుసుకోవాలి. చర్మ రంగు, ఎత్తు, జట్టు, కళ్లు, లావు లాంటివి జన్మతహ సంక్రమించవచ్చు. సాధారణ జీవనశైలి కలిగిన వారు కూడా సహజంగా లావుగా కనిపిస్తారు. ఇలాంటి వ్యక్తులు బాడీ షేమింగ్‌ను తీవ్రంగా తీసుకోకుండా మానసికంగా ధృఢంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం పట్టించుకొని స్పందించి భయపడినంత కాలం పోకిరీలు హేళన చేస్తూనే ఉంటారు. మనం ప్రతిస్పందించని వేళ, ఎదురు తిరిగి చెప్పు చేత పట్టిన వేళ అల్లరి మూకలు తోకముడిచే అవకాశం ఉంటుంది. మానసిక సౌందర్యంతోనే శారీరక వికారాన్ని జయించాలి. నల్లగా, లావుగా, పొట్టిగా ఉన్న వారెందరో ప్రపంచ ఖ్యాతిని పొందడం మనం చూశాం. మన శరీరాన్ని మనమే ప్రేమించుకోవడం ప్రారంభించాలి. బాడీ షేమింగ్‌ను పట్టించుకోకుండా తమ తమ వృత్తుల పట్ల దృష్టి కేంద్రీకరించాలి. మన మనసును మన నియంత్రణలో ఉంచుకుంటూ, ఆశావహ జీవనశైలిని అలవర్చుకుంటూ, ఆనందంగా ఉండేందుకు కృషి చేయాలి. బాడీ షేమింగ్ అశ్లీల, అమానవీయ, అభ్యంతరకర దురాచారానికి దూరంగా సమాజం వికసించాలి. మనిషిని మనిషిగా చూడగలగాలి. శరీర ఆకృతిని బట్టి ఎగతాళి చేయడం, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని నేరంగా భావించాలి. స్పష్టమైన శిక్షలు ఉండేలా చట్టంలో మార్పులు తేవాలి. మనిషిలో మానవత్వపు పరిమళాలు గుబాళించాలి. ఇకనైనా అభ్యంతరకర వ్యాఖ్యలకు తిలోదకాలిచ్చి, మానవీయతను ప్రదర్శిద్దాం. మనుషులంతా ఒక్కటే అని నినదిద్దాం. బాహ్య సౌందర్యానికి బదులు అంతర్ సౌందర్యానికి పట్టం కడదాం.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037