Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ దేశ ప్రగతినైనా ప్రభావితం చేసే అంశాల్లో మానవ వనరులే కీలకమైన పాత్ర పోషిస్తాయి. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో నైపుణ్యాలు కలిగిన యువతకు మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తున్న వైనం మనందరికీ తెలిసిందే. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, యువత తమంతట తామే ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా అవసరమయ్యే వ్యూహాత్మక నైపుణ్యాల ప్రాధాన్యతను తెలియజెప్పేందుకు ఐక్యరాజ్యసమితి సాధారణ సభ జూలై 15రోజును ''ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం''గా పాటించాలని 2014 సంవత్సరంలో ప్రకటించింది. ప్రతి యేటా జూలై 15 రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. వివిధ సంస్థలు, కార్మిక సంఘాలు, ఉద్యోగుల సంఘాలు, విధాన నిర్ణేతలు, యువత అభ్యున్నతిని కాంక్షించే పలువురు శ్రేయోభిలాషులు పరస్పరం చర్చించుకునే విధంగా ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం 15-24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వ్యక్తులను యువతగా పరిగణిస్తారు. ప్రపంచంలో వీరి సంఖ్య దాదాపుగా 1.2 బిలియన్లు లేదా 120 కోట్లు (ప్రపంచ జనాభాలో 16 శాతానికి సమానంగా) ఉన్నదని, 2018 సంవత్సరానికి సంబంధించిన 'వరల్డ్ యూత్ రిపోర్ట్' ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మన భారతదేశ జనాభా 139 కోట్లు ఉంటే అందులో 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సులో నున్న యువత దాదాపు 25 కోట్లు ఉన్నట్లు సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గత యేడాదిన్నర కాలంగా అధిక శాతం విద్యార్థులే అయిన యువత చదువు లేదా వివిధ వృత్తి పరమైన శిక్షణకు దూరమై, ఘోరమైన దుస్థితిలోనున్నారు. సాంకేతిక, వృత్తి పరమైన విద్య, శిక్షణా సంస్థలపై ఇటీవలే జరిపిన ఒక సర్వే ద్వారా యునెస్కో, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ బ్యాంకులు సంయుక్తంగా సేకరించిన సమాచారంలో తేలిందేమిటంటే పాఠ్యప్రణాళిక రూపు రేఖలు మారిపోవడం, విద్యార్థి - గురువుల మధ్య బంధం కృత్రిమంగా మారడం, నెట్ వర్క్ సమస్యలు మొదలైన ఒడిదొడుకులెన్నో ఎదురైనా కూడా ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో దూర విద్యా పద్ధతిలోనే చదువు లేదా శిక్షణ కొనసాగించడం అనివార్యమైందని. కరోనా సంక్షోభం కారణంగా 2020 సంవత్సరంలో యువత ఉపాధి అవకాశాలు 8.7శాతం తగ్గిపోయినట్టుగా అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాలు తెలుపుతున్నాయి. దేశంలో నైపుణ్యాల అభివృద్ధికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల సమన్వయం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల డిమాండ్ - సప్లయిల మధ్య అంతరాన్ని నిర్మూలించడం, సాంకేతిక, వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, కొత్త నైపుణ్యాలను ప్రవేశపెట్టడం, వినూత్నమైన ఆలోచనా ధోరణిని ప్రోత్సహించడం లాంటి విధులను వర్తమానానికే గాక భవిష్యత్తులో కూడా పనికొచ్చే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి.
2021 సంవత్సరానికి ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని 'మహమ్మారి అదృశ్యానంతరం యువత నైపుణ్యాలను తిరిగి ఊహించడం' (రీ ఇమాజినింగ్ యూత్ స్కిల్స్ పోస్ట్ పాండెమిక్) అనే ఇతివృత్తం ఆధారంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితికి సంబంధించి పోర్చుగల్, శ్రీలంక దేశాల శాశ్వత మిషన్లు యునెస్కో, అంతర్జాతీయ కార్మిక సంస్థ, యువతకు సంబంధించి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ రాయబార కార్యాలయాల సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తాయి. కోవిడ్ విజృంభణ ఇంకనూ కొనసాగుతున్న ప్రస్తుత విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని, తగిన సర్దుబాటు చర్యలతో సజనాత్మకను ప్రదర్శిస్తున్న యువతను ప్రశంసించే విధంగా ఈ సంవత్సరం ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం. కరోనా మూడో వేవ్ రూపంలో పొంచి ఉన్న ప్రమాదం తదితర కారణాల వల్ల అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడి సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం అవాంఛనీయం. కనుక ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే కార్యక్రమాలన్నీ అంతర్జాల మాధ్యమంలోనే నిర్వహిస్తున్నారు.
అపారమైన మానవ వనరులు కలిగిన దేశంగా గుర్తింపు పొందిన మన దేశంలో ఇప్పటికే దాదాపు 25 కోట్ల సంఖ్యలో యువత తమ భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా సంక్షోభం యువత భవిష్యత్తుపై ఒకింత నిరాశ, నిస్పృహలను వెదజల్లిందనేదొక చేదు నిజం. 'ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం' అని బోధించిన వివేకానందుడి మాటల్లోని పరమార్ధాన్ని గ్రహించి ప్రభుత్వమూ పౌర సమాజమూ కృషి చేయాలి.
- ఎల్. మోహన్
సెల్: 9398522294