Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్చి 2020 నుంచి కరోనా కమ్మిన కారు చీకట్లను తప్పించుకోవడానికి లాక్డౌన్లు, కర్ఫ్యూలు, భౌతికదూరాలు, మాస్కుల ధారణలు, సానిటైజర్ల వాడకాలు, స్వచ్ఛంధ గృహ నిర్బంధాలు లాంటి జీవనశైలిలో మార్పులు అనతికాలంలోనే అలవాటు అయ్యాయి. పాఠశాలలు, కళాశాలల తలుపులు మూసివేయడంతో ఆన్లైన్ తరగతుల స్మార్ట్ తెరలు తెరుచుకున్నాయి. 2020లో భారత దేశంలోని 1.5 మిలియన్ పాఠశాలలు, 320 మిలియన్ల బాలలు బడికి దూరంగా ఉంటూ వర్చువల్ క్లాస్‌లకు హాజరు కావడం లేదా చదువులకు దూరంగా ఉండడమవుతున్నది. బడుల మూసివేత కారణంగా ప్రభుత్వాలు, తల్లితండ్రులు, ఉపాద్యాయులు, సాధారణ ప్రజలు పిల్లల భవిష్యత్తుపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్ చదువుల లోపాలు : విద్యాలయాలు తెరవకపోవడంతో విద్యార్థినీ విద్యార్థుల చదువుల్లో మాత్రమే కాకుండా వారి శారీరక మానసిక ఆరోగ్యాల్లో కూడా దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. అన్ని ఆర్థికవర్గాల ప్రజలకు స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేకపోవడమే కాకుండా ఇంటర్నెట్ సౌకర్యాలు లోపించడంతో ఆన్లైన్ తరగతులు పేదవర్గాలకు దూరం అయ్యాయి. బాలకార్మికులు, బాల్యవివాహాల సంఖ్య పెరిగి పోయింది. ఉపాధ్యాయులతో ప్రత్యక్ష సంబంధం తెగడంతో క్రమశిక్షణ లోపించింది. ఇంట్లో ఉండాలనే నియమంతో శారీరక వ్యాయామం, క్రీడలకు దూరం అయ్యారు. పేద పిల్లలు మద్యాహ్న భోజన వసతికి దూరం కావడంతో పోషకాహార లోపంతో శారీరక పెరుగుదల మందగించింది. ఆన్లైన్ తరగతులకు హాజరు తప్పనిసరి కానందున తరగతులకు విద్యార్థులు గైర్హాజరు పెరిగింది. దినచర్య అస్తవ్యస్తం అయ్యింది. నేడు 10వ తరగతి పాసైన విద్యార్థులు అవసర నైపుణ్యాల్లో రెండేండ్లు వెనుకబడ్డారు. దీర్ఘకాలం పాఠశాలలు తెరవనందున విద్యా ప్రమాణాలు పడిపోయాయి. నవంబర్ 2020 సర్వే వివరాల ప్రకారం 66శాతం పేద పిల్లలు డ్రాపవుట్ కావచ్చనే భయంకర వాస్తవం బయట పడింది. ప్రయివేట్ పాఠశాలల్లో 42శాతం అడ్మిషన్లు తగ్గాయి. చదువుల కన్న ప్రాణాలు ప్రధానమైనవే అయినప్పటికి ఆన్లైన్ తరగతులతో అన్ని తరగతుల పిల్లల విద్యా ప్రమాణాలు పాతాళానికి జారడం, వ్యక్తిత్వ వికాసం తిరోగమన దిశకు చేరడం జరుగుతుందని గమనించాలి. పరీక్షల నిర్వహణ, హౌమ్ వర్క్ పరిశీలన, విద్యార్థి పాఠ్యాంశాల అవగాహనను తెలుసు కోవడం, క్రీడలు ఆడించడం, పలు రకాలైన పోటీల నిర్వహణ లాంటివి వీలు కావడం లేదు.
పిల్లలపై కరోనా ప్రభావం : పిల్లలు పుస్తకాల సంచి భుజాన వేసుకొని పాఠశాల దారి పట్టడానికి సంబంధించిన పలు అంశాలను శాస్త్రీయ కోణంలో విశ్లేషించే ప్రయత్నాలు చేస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి సోకడానికి కారణమైన 'ఏయస్ఈ2 రిసెప్టైర్లు' పిల్లల శ్వాసకోశంలో తక్కువగా ఉండడంతో కరోనా సంక్రమించే అవకాశం తగ్గుతున్నది. కరోనా రెండవ వేవ్‌తో పిల్లల క్షేమం, ఆరోగ్య భద్రత పట్ల సమాజం తపన పడుతున్నది. పెద్దలతో పోల్చితే పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి అధికంగా ఉండడంతో కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. పిల్లలకు కరోనా సోకినప్పటికీ దాదాపు 90శాతం కోవిడ్-19 లక్షణాలు కనబడకుండా 'ఎసిమ్టమాటిక్ లేదా మైల్డ్'గా ఉంటాయి. కరోనా సోకిన పిల్లల్లో 1-2శాతం మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునేంత తీవ్రతతో కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తాయి. ముంబారులో చేసిన సర్వేలో 19-ఏండ్ల లోపు పిల్లల్లో కరోనా 0.003 శాతం మాత్రమే ప్రాణాంతకం కావచ్చని తేలింది. కోవిడ్-19కు పూర్వం పిల్లల మరణాల రేటు 3శాతం ఉండగా, కరోనా కాలంలో 0.18శాతం మాత్రమే నమోదు అయ్యింది. ఇతర అనారోగ్యాలతో బాధపడే పిల్లల్లో కోవిడ్-19 చికిత్స మరింత కష్టం అవుతున్నది. ఈ పరిశీలనలను బట్టి పాఠశాల విద్యార్థుల్లో కోవిడ్-19 ప్రభావం చాలా తక్కువని తలుస్తున్నది. 3వ వేవ్ విజృంభిస్తే కొత్త వేరియంట్లతో పిల్లలకు కూడా ప్రమాదకారిగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. తగు వైద్య జాగ్రత్తలు తీసుకున్నపుడు పిల్లలకు ప్రాణాపాయం తగ్గుతుందని తేలింది. విదేశీ పాఠశాలల్లో జరిపిన సర్వే వివరాల ప్రకారం 0.5 - 1.7శాతం పిల్లలకు మాత్రమే కరోనా సోకవచ్చని తెలిసింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు దూరంగా ఉంటూ, ఓపెన్ గ్రౌండ్స్‌లో తరగతులు నిర్వహించాలని సూచిస్తు న్నారు. సమాజంలో పెద్దల నుంచి పిల్లలకు కరోనా సోకిన సందర్భాలు ఉన్నప్పటికీ, పిల్లల నుంచి పిల్లలకు వ్యాపించే అవకాశాలు తక్కువగా ఉండడంతో పాఠశాలలు తెరవడమే ఉత్తమమని వాదించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో దినసరి కరోనా కేసుల సంఖ్య, పాజిటివ్ రేటు అనే వివరాలను బట్టి పాఠశాలలు తెరవవచ్చు. పాఠశాలలు తెరవడానికి ముందు మాస్కులు, భౌతిక దూరాలు, సానిటైజర్లు, నాన్-ఏసి తరగతి గదుల్లో సరైన వెంటిలేషన్ ఉంచుకోవడం లాంటి అంశాలను ఉపాధ్యాయులతో పాటు పిల్లలకు తప్పనిసరి చేయాలి. విద్యార్థుల మధ్య భౌతిక దూరాలు ఉండేలా చూసుకోవడం, తక్కువ క్లాసులు నిర్వహించడం, తక్కువ సమయంతో పీరియడ్ తీసుకోవడం, తరుచుగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడం, కోవిడ్-19 సోకిన ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులకు వైద్య అందించడం, క్వారంటైన్, ఐసొలేషన్, శరీర ఉష్ణోగ్రత పరీక్షించడం లాంటివి చేయాలి. యువతకన్నా పిల్లలకు కరోనా సోకడం తక్కువని తెలుస్తున్నది. ఉన్నత పాఠశాలల కన్నా ముందు ప్రాథమిక పాఠశాలలు తెరవడం శ్రేయస్కరమని గమినించాలి. పిల్లల మానసిక, మేధో అభివృద్ధి సుసాధ్యం కావడానికి పాఠశాలలు తెరవడమే ఉత్తమమని అంటున్నారు. తిరిగి ప్రత్యక్ష తరగతులు నిర్వహించే సవాళ్లను సమర్థవంతంగా ఎదురించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను పిల్లలకు వివరిస్తూ మరోసారి 'మన గురువులు' గురుతర భాద్యతలను తిరిగి తీసుకోవలసి ఉంది. ఆఫ్‌లైన్ తరగతులు త్వరలోనే ప్రారంభమై, విద్యార్థులు తమ సాధారణ భౌతిక తరగతులకు హాజరవుతూ, కరోనాతో కోల్పోయిన మానసిక శారీరక భావోద్వేగ వికాసాలను తిరిగి పొందాలని కోరుకుందాం.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్ 9949700037