Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ రంగంలోనైనా నైతిక విలువలు అవసరం. నైతిక సూత్రాల ఆధారంగా మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు అంటారు గౌతమ బుద్ధుడు.ఆధునిక కాలంలో ఈ నైతికత అనేది అన్ని రంగాల్లో తగ్గుతుంది. అందుకు శాస్త్ర సాంకేతిక రంగం కూడా మినహాయింపేమి కాదు. విజ్ఞానం నిరంతరం వికసిస్తూ మానవాళి ఎదుర్కొనే అనేక సమస్యలని పరిష్కరిస్తుంది. పర్యావరణ కాలుష్య ఫలితంగా మనం అనేక కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం కరోనా వైరస్ తెచ్చిన ముప్పు ఇటువంటిదే. మనం పెంచుకున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మొత్తాన్ని ఆయుధాలు, యుద్ద రాకెట్స్ తయారీకి ఉపయోగిస్తే సామాన్యుడు ఎదుర్కొనే సమస్యలకి సైన్సు పరిష్కారం చూపించలేదు. మధ్య యుగాల్లో మత గురువులు రాజులని తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లుగా, ఆధునిక కాలంలో సైన్స్ పరిశోధనలని కార్పొరేట్ వర్గాలు తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు.
ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు కరోనా నియంత్రణకి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవాలి. కోవిడ్ టీకాలపై మేధో సంపత్తి హక్కులని తాత్కాలికంగా ప్రపంచ దేశాలు రద్దు చేసుకోవాలి.అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలలో టీకా తయారీకి అవసరమైన ముడి పదార్థాలు లభిస్తాయి. వివిధ దేశాధినేతలు చర్చల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి.
టీకాలపై పేటెంట్ హక్కులని రద్దు చేసుకుంటే సులభంగా టీకాకి చెందిన పరిజ్ఞానాన్ని వివిధ దేశాల మార్చుకోవచ్చు. తద్వారా టీకాల ధరలు తగ్గుతాయి. పేద దేశాల ప్రజలకి త్వరగా టీకాలు అందుతాయి. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ల వల్ల వివిధ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం వేగవంతంగా మార్చుకోవాలి. ప్రతి ఆవిష్కరణలో మానవుని సమిష్టి కృషి ఉంటుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడి దేశాలు తమ గుత్తాధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండవు. ఫలితంగా పేద దేశాలు దోపిడీకి గురౌతాయి.
ప్రపంచానికి ఆణుబాంబులు, మారణ ఆయుధాలు కాదు కావాల్సింది. మహమ్మారులని ఎదుర్కొనే సామర్ధ్యం కావాలి. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఇలా అంటారు.. ''సైన్స్‌ని మానవ వికాసానికి ఉపయోగించాలే తప్ప, మానవ వినాశనానికి కాదు''. ఆల్ఫ్రెడ్ నోబెల్ కూడా తన ఆస్తిని మానవ ప్రగతికి దోహదపడే పరిశోధనలు చేసే వారికి పురస్కారాలని ఇచ్చేందుకు వీలుగా వీలునామా రాశారు. సైన్స్ వాదులు ముందు ఇప్పుడు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ప్రజలలో శాస్త్రీయ ఆలోచనలు పెంచడం. ఇందుకు పెద్ద ఎత్తున సైన్సు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. రెండు సైన్స్ పరిశోధన ఫలాలు సామాన్యులకు అందేటట్లు చూడాలి. అందుకు బలమైన సైన్స్ ఉద్యమాలు అవసరం అవుతాయి. అయితే సైన్స్ ఉద్యమాలు విజయవంతం అవ్వాలంటే మానవ వనరులు పుష్కలంగా లభించాలి. మనదేశంలో నూటికి 95శాతం మంది సైన్స్ చదువుతున్నారు. చాలా ప్రయివేటు కళాశాలల్లో ఆర్ట్స్ కోర్సులు కూడా లేవు. మరెందుకు మూఢ నమ్మకాలు పెరుగుతున్నాయి?
నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకి సత్వర పరిష్కారం లభించడం లేదు. విద్య, వైద్యం ప్రజలకు పెనుభారంగా మారాయి. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే సకాలంలో ఎవరిని సంప్రదించాలనే విషయం ఇప్పటికీ పేదవారికి కొరుకుడు పడని విషయమే. దానికి వారు తమకు తోచిన మార్గం ఎంచుకుంటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే వారు మూఢ నమ్మకాలని ఆశ్రయిస్తున్నారు. ఇదొక సామాజిక సమస్య. ఇటువంటి వారిని అవహేళన చేయడం ద్వారా వారి సమస్యలని పరిష్కరించలేం. వారి పట్ల సానుభూతిని ప్రదర్శించాలి. ఇందుకుగాను విభిన్న ఆలోచనలున్న వ్యక్తులతో సైన్సు వాదులు పనిచేయాలి. సైన్సు పరిశోధనల్లో విలువలు అవసరం.సైన్స్ సాధనాలని కూడా వ్యాపార ధోరణిలో కాకుండా, సమస్యలని పరిష్కరించడానికి వినియోగించాలి. సామ్రాజ్య వాదాన్ని నమ్ముకొని బయోవార్స్కి తలుపులు తెరిచి ఉంచకూడదు. మతం మనుషుల సమస్యలు తీర్చదని సైన్స్ వాదులు ప్రచారం చేస్తుంటారు. సైన్స్ పరిశోధనలు కూడా సామాన్యులకు ఉపయోగపడకపోతే, మధ్య యుగాల్లో మతం సృష్టించిన విధ్వంసాన్ని, ఆధునిక కాలంలో మనం అభివృద్ధి చేసుకున్న సాంకేతిక పరిజ్ఞానం ఆ పనిని పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకున్న ఆలోచనలతో ఈ ప్రపంచాన్ని రక్షించలేం. గెలిలియో, బ్రూనో, జెన్నర్ వంటి శాస్త్ర వేత్తలు ఎంతో త్యాగం చేసి ప్రపంచాన్ని ముందుకు నడిపించారు. వారిని నేటి పాలకులు స్పూర్తిగా తీసుకోవాలి.
- ఎం. రాంప్రదీప్
సెల్: 9492712836