Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుప్పెడు మంది వ్యక్తుల సొంత ప్రయోజనాల కోసం దేశ ప్రజలందరి జీవితాలను చిన్నా భిన్నం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం ఆవలంబిస్తున్నది. ఆధిపత్య వర్గాల వారి అధికార దాహానికి, అర్థబలం, అంగబలం సమకూర్చడం కోసం, అట్టడుగు వర్గాల వారిని ఆధునిక బానిసలుగా చేసే కుట్రలో భాగంగానే నేడు ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ జరుగుతున్నది. ఈ విధానాల వలన భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు, వాటి నియామక ప్రక్రియలో రిజర్వేషన్లూ వర్తించవు.. అట్టడుగు వర్గాల వారికి రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం వంటి హక్కులు ఏవీ అమలులో ఉండవు. తద్వారా అసమానతలు, అంతరాలు మరింత పెరుగుతాయి.
దేశ తొలి ప్రధానిగా నెహ్రూ పార్లమెంటులో మాట్లాడుతూ ''ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వ పరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య స్థాపనకు దోహదం చేస్తూ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ప్రగతిని సాధించడమే ఆర్థిక ప్రణాళికల ముఖ్య ఉద్దేశ్యం'' అని తెలిపారు. ఆ ఫలితంగానే 1960లో ప్రణాళికా సంఘం ఏర్పడింది. కానీ ఆరవ పంచవర్ష ప్రణాళిక నుండే ప్రభుత్వ రంగాల వాటా క్రమంగా తగ్గుతూ, ప్రయివేట్ రంగం వాటా పెరుగుతూ వచ్చింది. ఈ విధంగా స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో పాలకులు కొంత సామ్యవాద స్ఫూర్తితో సమాజంలోని అంతరాలు రూపుమాపడానికి కృషి చేసినట్టు, స్వయం సమృద్ధి, స్వావలంబన దిశగా ప్రయత్నాలు చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, పాలకులు ప్రభుత్వ రంగ వాటాను తగ్గిస్తూ, ప్రయివేటు పరం చేస్తూ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలం అయ్యారు. ఆ బాధ్యతల నుంచి తప్పించుకుంటూ ప్రభుత్వ మంత్రిత్వశాఖలో డిజిన్వెస్మెంట్ శాఖను సైతం ప్రవేశపెట్టారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోడీయే ప్రతి రంగాన్ని ప్రయివేటుపరం చేస్తాం, ప్రభుత్వాలు వ్యాపారం చేయవని ప్రకటించారు. ఆ దిశలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పెట్టుబడుల ఉపసంహరణ తప్పదని కరాఖండిగా ప్రకటిస్తూ, మొండిగా ప్రయివేటీకరణ విధానాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన కీలక పరిశ్రమల్లో ఒకటైన బొగ్గు గనులు బడా కార్పొరేట్ పెత్తందార్లకు అప్పగించడానికి రంగం సిద్ధమైంది. మొదటగా సింగరేణితో సహా 50 కోల్ ఇండియా బ్లాకులను భవిష్యత్ కాలంలో మరో 500 బ్లాకులను ప్రయివేటీకరించడం జరుగుతుందని, 100శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం ఇస్తున్నట్టు ప్రస్తుత పాలక ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రయివేటీకరించనున్న 50 బొగ్గు గనుల బ్లాకులను కొనుగోలు చేసిన వారికి, వాటి నిర్వహణకు ప్రభుత్వమే వెయ్యి కోట్ల రుణ సదుపాయం అందిస్తాననడం ఆశ్చర్యకరం. 1973 మేలో బొగ్గు గనుల జాతీయీకరణ ద్వారా కార్మికుల శ్రమకు తగ్గ వేతనాలు, రక్షణ, ఉద్యోగ భద్రత వంటి మౌలిక వసతులు, వెట్టి చాకిరి నుంచి విముక్తి లభించాయి. దీని వల్ల కోల్ ఇండియా 50 వేల కోట్లకు పైగా టర్నోవర్‌తో ప్రపంచంలోనే ఆరవ పెద్ద మైనింగ్ కంపెనీలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. వేల మందికి బతుకు భరోసాను కల్పిస్తూ కార్మికుల పాలిట కల్పతరువు అయిన బొగ్గు గనులను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడం కార్మికుల, సామాన్య ప్రజల హక్కులను హరించడమే అవుతుంది. ఇక రైల్వేల సంగతి చూస్తే ప్రపంచ స్థాయిలోనే ప్రఖ్యాతిగాంచి ప్రతి రోజూ మూడు కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చడంలో ఉపయోగపడుతున్నవి రైల్వేలు. రైల్వే వ్యవస్థ ప్రభుత్వ రంగ యాజమాన్యంలో, భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న అతి పెద్ద వ్యవస్థ. రైలు మార్గాల మొత్తం దూరం 1,14,500 కిలోమీటర్లతో 7500 స్టేషన్లు ఉన్నాయి. 2011 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వ్యాగన్లు, 69 వేల కోట్లు, 9000 ఇంజన్లు ఉన్నాయి. భారతీయ రైల్వే మొత్తం 8,702 ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నది. అత్యంత ఉపయోగకరమైన, అతి చౌకగా దూర ప్రాంతాలకు చేరవేసే ప్రజా రవాణా వ్యవస్థగా ప్రజల మన్ననలు పొందింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పుకొని బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి సిద్ధపడటం వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. 2016లో నియమించిన బివేర్ దేబ్రారు కమిటీ ప్రకారం సికింద్రాబాద్, ఢిల్లీ, బెంగుళూర్, చండీగడ్, జైపూర్, ముంబై, ప్రయగా రాజ్, హౌరా, చెన్నై లాంటి ప్రధాన స్టేషన్ల పరిధిలోని 12 క్లస్టర్లలో ప్రయివేట్ రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే లక్నో నుండి ఢిల్లీకి, ముంబై నుండి అహ్మదాబాద్‌కు తేజస్ ప్రయివేట్ రైలు నడుపుతున్నారు. ప్రభుత్వ సిగలు, ప్రభుత్వ డ్రైవర్, ప్రభుత్వ గార్డులతో కూడిన ప్రయివేట్ రైళ్లు 2023 ఏప్రిల్ నుండి పట్టాలపై పరుగులు తీయనున్నాయి. రైళ్లలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించి, 109 రూట్లలో 150 ప్రయివేట్ ప్యాసింజర్ రైళ్లకు అనుమతి ఇవ్వడాన్ని ప్రతిఘటించాలి. సామాన్యుడు ప్రయాణించే రైళ్లు విదేశీ సంస్థల పరం చేసి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేయడం దేశ వ్యతిరేక చర్య. బ్యాంకుల విషయానికొస్తే తాజా గణాంకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2019-20లో 1,74,336 కోట్ల నిర్వహణ లాభం వచ్చింది. 2010-11 నుండి 2019-20 వరకు 13 లక్షల 85 వేల కోట్ల నిర్వహణ లాభం వచ్చిందంటే అవి ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. విదేశాలకు పారిపోయిన విజరు మాల్యా, నీరవ్ మోడీ లాంటి మోసగాళ్లతో పాటు అనిల్ అంబానీ, సహారా తదితర బడా కార్పొరేట్ వర్గాలు ఎగ్గొట్టిన రుణాలే ఎక్కువగా ఉన్నాయి. మోడీ సర్కార్ వచ్చిన తర్వాత వీరి 7.98లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసి బ్యాంకుల్లోని ప్రజల ధనాన్ని వీళ్ళకే దోచి పెట్టారు. ఇక ఎల్ఐసీ ప్రయివేటీకరణ, ఎయిర్ పోర్టుల ప్రయివేటీకరణ, విద్య, వైద్యం సరళీకరణ పేరుతో ఆరోగ్య సేవల ప్రయివేటీకరణ, విద్యుత్ చట్టం పేరిట డిస్కంల ప్రయివేటీకరణ, ప్రభుత్వ రంగ టెలికాం పరిశ్రమ బిఎస్ఎన్ఎల్, రేవులు ఇలా అన్నింటిలో ప్రయివేటీకరణ విధానాలు శరవేగంగా అమలవుతున్నాయి. లాభాల బాటలో పయనిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని చిత్రిస్తూ వాటికి పరిష్కారం ప్రయివేట్ పరం చేయడమేనని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ వాటిని తమకు కావలసిన వారికి కట్టబెడుతున్నది. వాస్తవానికి 366 ప్రభుత్వ రంగ సంస్థల్లో 43 మాత్రమే నష్టాల్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 2014లో అంబానీ సంపద 5 వేల కోట్లు, అదే 2021లో 6లక్షల 3వేల కోట్లు. అదే విధంగా ఆదాని సంపద 2014లో కేవలం 14 వేల కోట్లు మాత్రమే, అది కాస్త 2021లో 3లక్షల 63 వేల కోట్లకు చేరిందంటే ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయో, ఎవరి సంక్షేమం కోసం పాటు పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి సంపదను కేంద్రీకృతం చేస్తూ పేద వారిని కడు పేద వారిగా మార్చి, ధనవంతులను అపర కుబేరులుగా అందలం ఎక్కించేందుకే మోడీ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల కొరకు ఆలోచించాల్సిన ప్రభుత్వాలు ప్రజలకే ద్రోహం చేయడం అత్యంత విషాదకరం.
- ఎన్. శ్రీనివాస్
సెల్: 9676407140