Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ దేశంలో మేమే అత్యంత దేశ భక్తులమని, ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలని, మిగితా మతాల వాళ్ళు దేశం వదలి వెళ్లి పోవాలని అనుకునే వాళ్ళు, తమ గొప్పనైన దేశభక్తితో కొన్ని ప్రశ్నలకు సమాదానాలు చెప్పాలి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ డాట్ కామ్‌ను పరిశీలించినప్పుడు భారత జనాభాలో ఏ ఏ మతాల శాతమెంతో ఈ పట్టికను చూసి తెలుసుకోవచ్చు.
హిందువులు 80%
ముస్లీములు 13%
క్రైస్తవులు 2.3%
సిక్కులు 1.9%
బౌద్ధులు 0.8%
జైనులు 0.4%
ఏ మతానికి చెందని వారు 0.9%
పై పట్టికను పరిశీలించినప్పుడు భారత జనాభాలో ఎనబై శాతం హిందువులే. మరి భారత ప్రజల చెమట చుక్కలతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తే ఎనబై శాతంగా ఉన్న హిందువులకు అది నష్టదాయకం కాదా! అత్యంత ''దేశభక్తి'' పాలకులను మనం కనీసం ప్రశ్నించడం లేదు ఎందుకు? ప్రయివేటీకరించబడ్డ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్స్ వుండయంటే ఉండవని పార్లమెంటులోనే సాక్షాత్తు ఎంపి కార్తీక్ చిదంబరం వేసిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగత్ కిషన్‌రావు కరడ్ చాలా స్పష్టంగా వ్రాతపూర్వకంగా తెలిపారు. ఈ ''దేశభక్త'' పాలకులు అన్ని రకాల రిజర్వేషన్స్ ఎత్తివేయడం సరియినదేనని మనం భావిస్తున్నామా..? మరి ఎందుకు ప్రశ్నించడం లేదు? ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్ర వర్ణాలకు కూడా వేతన స్కేళ్లు గాని, ఉద్యోగ భద్రత గాని ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థలు, చివరకు రోడ్డులు కూడా ప్రయివేట్ కు అమ్మడం నిజంగా దేశభక్తేనా? చివరకు రక్షణ రోదసీ రంగాలు కూడా ప్రయివేట్ పరం చేయడం సబబా! దేశ భక్తి పాలకుల హౌల్ సేల్ అమ్మకాన్ని అడ్డుకోకపోతే మెజారిటీగా ఉన్న హిందూ ప్రజలకు కూడా మిగిలేది చిప్పేనని గుర్తించలేకపోతున్నాం.
ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ప్రజల సంపద. ఈ సంపదను ప్రయివేటుకిచ్చినా, లీజుకిచ్చినా దేశ సంక్షేమానికి మంచి సంకేతం కాదన్న మాటలు ఏ కమ్యూనిస్టులూ, ఏ వామపక్షవాదులే కాదు, సాక్షాత్తు తమిళ నాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కూడా అంటున్నారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, షిప్పింగ్, విమానాశ్రయాలు, రైల్వేలు, బొగ్గు గనులు, రక్షణ, రోదసీ రంగాలను అమ్ముతున్న క్రమంలోనే కేరళలోని ఉత్తర కాసరగోడ్ జిల్లాలో భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్-ఎలక్ట్రికల్ మెషిన్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్, ఈఎంఎల్)ను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటుకు అమ్మడానికి సిద్దపడింది. కేరళ ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్లప్పుడూ ప్రజలకు మేలు చేస్తాయని, తను కొనుగోలు చేసి స్వాధీనం చేసుకుంది. దీనిని ఎంతమందిమి హర్షించగలుగుతున్నాం..!
జీఎస్టీ ప్రజల రక్తంతో సహా మూలగను కూడా పీల్చి పిప్పి చేస్తున్నది. అనేక దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు మనకంటే చాలా తక్కువాగానే ఉన్నాయి. గ్లోబల్ పెట్రోల్ ప్రయిసెస్ డాట్ కామ్‌లో పెట్రోల్ రేట్లను ఒక్కసారి పరిశీలిస్తే అనేక దేశాల్లో చివరకు శ్రీలంకలో కూడా భారత దేశం కంటే చాలా తక్కువగా ఉంది. విద్యా రంగంలో ప్రగతిని సాధించిన దేశాలే జీవన ప్రమాణాల్లో గాని, ఆర్థిక అభివద్ధిరేటులో గాని ముందున్నాయనేది చారిత్రిక సత్యం. మొత్తం విద్యారంగాన్ని తెగనమ్ముతుంటే ఎలా చూస్తూ ఊరుకో గలుగుతున్నాం. బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిలన్నీ ప్రైవటోళ్ళవే. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఎగ్గొట్టిన దాఖలాలు లేవు. ప్రయివేట్ రంగంలో పాలనా విధానాలు చాలా బాగుంటే తీసుకున్న అప్పులన్నీ అవి ఎందుకు ఎగవేస్తున్నాయి? అవి ఎందుకు దివాళా తీస్తున్నాయి? ఈ మాటలు కూడా కమ్యూనిస్టులు అన్న మాటలు మాత్రమే కావు. సాక్షాత్తు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ఇది ఎందుకు మన చెవికెక్కడం లేదు.
నిత్యావసర ధరలు నింగిని అంటుకుంటూ ఉంటే దిన దినం హిందువులు కూడా అష్ట కష్టాలతో దోపిడీకి గురి అవుతుంటే ఈ ''దేశభక్త'' పాలకుల మనసుకు బాధ అనిపించడం లేదా? మాతో పాటు మీరు కూడా ప్రభుత్వరంగాన్ని అమ్మండి అని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన కేంద్ర దేశభక్తి పాలకుల సూచనతో మనం ఏకీభవిద్దామా?
సంపూర్ణంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేట్ పరమైతే జ్ఞానం, సంపద, భూమి, పెట్టుబడి, ఆరోగ్యం పెట్టుబడీదార్ల పరమయి జన జీవనం పరాధీనమై బానిసత్వంలోకి నెట్టివేయ బడుతుంది. ఈ ప్రమాదకరమైన మార్పును అంగీకరిద్దామా?
చివరగా ఏ రాజకీయాలు దేశాన్ని అమ్మే దిశలో నడిపిస్తున్నాయి? ఏ విధమైన రాజకీయాలు భారత దేశ భవిష్యత్తుకు అత్యంత అవసరం? ఒక పౌరుడిగా తెలుసుకోవాలి. మాకెందుకులే రాజకీయ ముచ్చట్లు అనుకుంటే దేశాన్ని అమ్మే వాళ్ళకి పరోక్షంగా మద్దతు ఇచ్చిన వాళ్ళమే అవుతాం. అన్యాయమని ఖండించే ధైర్యం లేకున్నా, నీ చుట్టూ ఉన్న మిత్రులద్వారా చర్చిస్తూ తమ నిరసన గళాన్ని విప్పినా చాలు. మనం నిజంగా దేశభక్తులమైతే రైతు చట్టాలను రద్దుచేయాలని విద్యుత్ బిల్లును ఉపసంహరించు కోవాలని, ప్రభుత్వ రంగ ఆస్తుల రక్షణకై సెప్టెంబర్ 27న భారత్ బంద్ ను పాటించమని రైతులిచ్చిన పిలుపును విజయవంతం చేయాలి.
- డాక్టర్ మార్క శంకర్‌నారాయణ
సెల్:9908416664