Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారంతా పేద విద్యార్థులు, కానీ చదువులో ప్రతిభావంతులు. ఎంతో కష్టపడి ర్యాంకులు సాధించి గురుకులాల్లో సీటు సంపాదించారు. ఇంకొందరు నిరుపేద అభాగ్యులు, వారికి హాస్టలే అమ్మ ఒడి. హాస్టల్లో ఉంటేనే మూడు పూటలకు ముద్ద దొరుకుతుంది. కానీ హాస్టల్ మూతపడి సరిగ్గా 18 నెలల సమయం అవుతుంది. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై తోటి విద్యార్థులు పాఠశాలలకు పరుగులు తీస్తుంటే, మరోపక్క ప్రయివేటు పాఠశాలలు ప్రారంభమై సందడి చేస్తున్నాయి. అక్కడక్కడ ప్రయివేట్ విద్యా సంస్థల హాస్టళ్లు యధేచ్చగా నడుస్తున్నాయి. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు మాత్రం దిక్కుతోచని స్థితిలో గ్రామాల్లో ఒంటరిగా మిగిలిపోయారు. ప్రభుత్వం దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు వినమని చెపుతున్నా పెద్దగా స్పందన లేదు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు వారికి చదువు చెప్పలేరు.
నష్టపోతున్నది పేద విద్యార్థులే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి సుమారు 1000వరకూ గురుకులాల సంఖ్యను పెంచింది. అందులో సుమారు 4.5లక్షల వరకు విద్యార్థులు, 475 కెజిబివిలలో సుమారు 1.5లక్షల విద్యార్థులు, సుమారు 1150హాస్టల్లలో ఉంటూ కొన్ని వేలమంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారంతా పేద విద్యార్థులే. ఒక పక్క ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల చదువు, మరొక పక్క ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చదువు రైలు పట్టాలెక్కి పరుగు పరుగున సాగుతుంటే, గురుకుల, హాస్టల్ విద్యార్థుల చదువు అటకెక్కింది. అక్కడ నష్టపోతున్నదంత ప్రవేశ పరీక్షల ద్వారా గురుకులాలకు ఎంపికైన, హాస్టల్లో ఉంటూ చదువుకొంటున్న పేద విద్యార్థులే.
మనసుంటే మార్గం ఉంటుంది
ఏ సమస్యకైనా మనసుంటే మార్గం ఉంటుంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా వినాయక నిమజ్జనంపై స్పందించిన ప్రభుత్వం అదే సంకల్పంతో హైకోర్టును అభ్యర్థించి, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లయిన సరే గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ కళాశాలలు, హాస్టళ్లు పున:ప్రారంబానికి అనుమతి పొందాలి.
ప్రాధాన్యతా క్రమంలో తెరవవచ్చు
అన్ని తరగతులు ఒకేసారి కాకుండా ప్రాధాన్యత క్రమంలో ప్రారంభించవచ్చు. గురుకుల పాఠశాలలో తొమ్మిదవ, పదవ తరగతులను, ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం తరగతులను, డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలల్లో తృతీయ సంవత్సర తరగతులను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రారంభించవచ్చు. కోవిడ్ వ్యాప్తిని అంచనా వేస్తూ తరువాత మిగిలిన తరగతులను ప్రారంభించవచ్చు.
మౌలిక సౌకర్యాలకు పెద్దపీట వేయాలి
గురుకులాల్లో, రెసిడెన్షియల్ కళాశాలల్లో, హాస్టల్లలో యుద్ధప్రాతిపదికన మౌలిక సౌకర్యాలు పెంచాలి. కోవిడ్ నిబంధనల ప్రకారం విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా టాయిలెట్లు, స్నానపు గదులు, విశ్రాంతి గదులు, భోజనశాలలు, స్టడీ హల్స్, తరగతి గదులను పెంచాలి. ప్రతి హాస్టల్లో డాక్టర్ లేదా ఎ.ఎన్.ఎమ్ నిరంతర పర్యవేక్షణలో తరగతులు నడుపుతూ అవసరమైతే కోవిడ్ సామాగ్రి, టెస్ట్ కిట్స్, ఐసోలేషన్ సెంటర్లు సిద్ధం చేసుకోయాలి.
పేద విద్యార్థుల చదువు బాధ్యత ప్రభుత్వానిదే
పాఠశాలలకు దూరమవుతున్న పిల్లల్లో చాలా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో పాఠశాలలు తెరవాలని యునిసెఫ్ ఇండియా సూచించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరోమారు హైకోర్టును అభ్యర్తించి, లేదంటే సుప్రీంకోర్టుకైనా వెళ్లి అనుమతి తీసుకొని వెంటనే గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ కళాశాలలు, హాస్టళ్లు పున:ప్రారంభించాలి. విద్యార్థులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
జుర్రు నారాయణ
సెల్: 9494019270