Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఎప్పుడూ నా చుట్టూ ప్రమాదం బుసలు కొడుతూనే ఉంటుంది. అసలు నా జీవితం నేను జీవించిందెప్పుడు..?'' వర్తమానంలో భారతీయ స్త్రీ అంతరంగానికి నిలువుటద్దం ఈ కవితా వాక్కులు. సమాజ పరిణామక్రమంలో అత్యంత ఉన్నతదశగా చెప్పుకుంటున్న ఈ ఆధునిక కాలంలో కూడా మహిళ ఇంకా రెండవతరగతి పౌరురాలిగానే మనుగడ సాగిస్తోంది. అంటే ఈ సుదీర్ఘమైన పరిణామంలో ఆమె ఏ మార్పునూ సాధించలేదని కాదు. మానవహక్కులన్నీ పురుషులకే అన్న స్థితి నుంచి మహిళల హక్కులూ మానవహక్కులే అనే స్థితి దాకా ఈ దేశంలో మహిళలు అనేక పోరాటాలు చేశారు. ఆ క్రమంలో హక్కుల రక్షణకు కొన్ని చట్టాలనూ సాధించారు. కానీ ఈ బూర్జువా సమాజం నిర్మించే చట్టాలు ఆ హక్కులను రక్షించగలవా? పురుషుల ఆధీనంలో నడిచే వ్యవస్థలో అవి స్త్రీల సహజ హక్కులను కాపాడగలవా?
ప్రత్యేకించి మహిళలపై మానిసికంగా శారీరకంగా జరిగే అనేక అత్యాచారాలను ఆపడంలో ఈ చట్టాల వైఫల్యం నిత్యం రుజువవుతున్న సత్యం. మహిళలపై, బాలికలపై జరిగే లైంగిక దాడుల్లో, హత్యలలో మనదేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉండటం ఇందుకు నిదర్శనం. అయితే, ఇలాంటి సంఘటనలు ఇతర దేశాలలో జరగటం లేదా? మన దేశంలోనే జరుగుతున్నాయా? అనే ప్రశ్న తలెత్తవచ్చు. కొద్దో గొప్పో తేడాలు తప్ప ప్రపంచ వ్యాపితంగా ఏ దేశమూ ఇందుకు మినహాయింపు కాదు. గతంలో డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ప్రపంచ వ్యాపితంగా 35శాతం పైగా మహిళలు హింసకు గురవుతున్నారని ప్రకటించింది. యునైటెడ్ నేషన్స్ కూడా అనేక దేశాలలో మహిళలపై లైంగిక వివక్ష, అత్యాచారాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయనీ, వాటిని అరికట్టాలనీ పేర్కొంటున్నది. అయితే ఇందులో అన్నిదేశాలలోకెల్లా మన దేశమే అగ్రభాగాన ఉన్నదని అనేక సర్వేలు వెల్లడిస్తుండటం గమనార్హం. ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి భారతదేశంలో మహిళలకు రక్షణ లేదనిచెప్తున్న నేపథ్యంలో.. మన జాతీయ నేర పరిశోధనా రికార్డులు, నివేదికలన్నీ అందుకు నిదర్శనాలుగా నిలువడం శోచనీయం.
మహిళలపై జరిగే గృహ హింస సంబంధిత నేరాలూ, హత్యలూ, లైంగిక హింస దానికి పరాకాష్ట రూపమైన రేప్ కంటే పెద్ద నేరాలు కాదు. కానీ నిజానికి సమాజంలో అసంఖ్యాకమైన మహిళలు ఈ గృహహింసకే బలవుతున్నారు. నేటి ఆధునిక మహిళ అన్నిరంగాలలో పురుషునితో సమానంగా దూసుకుపోతున్నా వివక్ష మాత్రం తప్పటం లేదు. ఎన్ని ప్రతిభాపాటవాలున్నా ఆధునిక భావాలతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేవారికి ఆధిపత్య మనువాద భావజాలం ఇంకా ఆటంకంగానే ఉన్నది. ఏ విషయంలోనూ ఎదురించటం సాధ్యం కానప్పుడు మహిళల క్యారెక్టర్ మీద దాడి చేయటం ద్వారా మానసిక అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో కుటుంబాల్లో స్త్రీని అంతులేని హింసకు గురిచేస్తున్నాయి. మహిళ తనదైన సొంత వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం కూడా ఓ అపరాధంగా భావించే ''మగానుభావుల''కు దేశంలో కొదువ లేదు. ఎందుకంటే, మహిళకు పితృస్వామ్యం ఇచ్చే స్టేటస్ దృష్ట్యా, ఆమె వ్యక్తి స్వేచ్ఛను గుర్తిస్తూ, ఆమె సమాన హౌదాను గౌరవించండమనే సహజన్యాయం ఈ వ్యవస్థ డీఎన్ఏలో లేదు. కనుక చట్టాలెన్నున్నా ఈ పురుషాధిక్య సమాజంలో ఆ సహజ న్యాయ సూత్రాలకు అవకాశముండదు.
సహజ న్యాయ సూత్రాలంటే ఏమిటీ? అవి వ్యవస్థ ఆలోచనా విధానం నుంచి ఉధ్బవించేవి. దృక్ఫథం నుండి వచ్చేవి. మధ్య యుగాల్లో కంటికి కన్నూ పంటికి పన్ను అనేది సహజ న్యాయ సూత్రం. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనేది భూస్వామ్య సహజ న్యాయ సూత్రం. మన బూర్జువా సమాజానికి కూడా సహజ న్యాయ సూత్రాలుంటాయి. కాకపోతే అవి సహజ బూర్జువా న్యాయ సూత్రాలు..! ఇవి ఆర్థిక, సామాజిక హౌదాను బట్టి, రాజకీయ అవసరాలను బట్టి అమలవుతుంటాయి. వీటిలో ఉన్న లొసుగుల వల్ల సంపన్నులకు ఒకరకంగా, పేదలకు ఒకరకంగా న్యాయం జరుగుతుంది. ఇక ఇందులోనూ కుల మత భేషజాల గురించి చెప్పక్కర్లేదు.
ఆ మధ్య ప్రభుత్వం ఆదరాబాదరగా తెచ్చిన దిశచట్టం ఇంకా న్యాయ కోవిదులతో చర్చల్లో ఉండగానే బూర్జువా న్యాయ సూత్రాలకు భిన్నంగా అసహజ మధ్యయుగాల కంటికి కన్ను పంటికి పన్ను సూత్రాన్ని పోలీసులు అమలు పరిచారు. ఇవీ హత్యలే. ఇలాంటి హత్యలకు ఎన్కౌంటర్ అనేది ముద్దు పేరు. ఇలా తాము రాసుకున్న చట్టాలను తామే తుంగలో తొక్కడం ఈ వ్యవస్థకు సర్వ సాధారణం. దిశకు న్యాయం జరిగిపోయిందని సభ్యసమాజమూ పోలీసులను ఆకాశానికెత్తింది. కానీ అంతటితో అలాంటి అఘాయిత్యాలు ఆగిపోయాయా..? నిజానికి పోలీసులు తమ బాధ్యత నుంచి తప్పించుకోడానికీ, ప్రభుత్వాల రాజకీయ ప్రయోజనాలకూ ఇవి బాగా ఉపయోగపడతాయి తప్ప సమస్యకు పరిష్కారం చూపలేవు.
అలాంటి ఇంకో సంఘటన జరగకుండా చూసుకున్నప్పుడు మహిళకు న్యాయం జరిగనట్టవుతుంది కానీ నిందుతులని కాల్చిచంపడం ద్వారా కాదు అనే జ్ఞానం ఇక్కడ అవసరం. ఆ జ్ఞానాన్ని అందించే వివేకం, బాధ్యత రెండూ ఈ బూర్జువా వ్యవస్థకు లేవు. మన రాజ్యాంగం కూడా మత విశ్వాసాల ఆధారంగానే స్త్రీలకు పర్సనల్ లా లో హక్కులు కల్పించింది. పితృస్వామ్యం, మతం, ఆచార వ్యవహారాలు, సంస్కృతి రూపంలో మహిళల పట్ల అమలవుతున్న వివక్షను కాదని స్త్రీలకు సమానత్వ హక్కులను కల్పించలేక పోయింది. వీటన్నిటికీ లోబడే చట్టాల రూపకల్పన జరుగుతోంది. అందుకనే గృహహింస నుండి రక్షణ చట్టం వరకూ, నిర్భయ నుండి దిశచట్టం దాకా ఎన్ని చట్టాలు వచ్చినా వివక్షనూ, అణచివేతనూ, అత్యాచారాలనూ తొలగించలేకపోతున్నాయి. ఇక్కడ ఈ చట్టాలు మహిళలకు రక్షలు, దోషులకు శిక్షలు ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది అటుంచితే, అలాంటి సంఘటనల పునరావృతాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయి? అన్నది ప్రశ్న. ఒక అభివృద్ధి చెందిన సమాజం ఎప్పుడూ నేరాలు పునరావృతం కాకపోవడం మీదనే ధ్యాస పెట్టాలి. దానికి అవసరమైన సంస్థాగతమైన మార్పులకూ సంస్కరణలకూ కృషి చేయాలి. నేరం జరగడానకి కారణమైన భిన్న కోణాలను పరిశీలించి దానికి తగ్గ సామాజిక మార్పుకు పోరాడాలి. ఎందుకంటే ఈ నేరాలు ఎక్కడో కాదు, మన మధ్యనే, మన లాంటి మనుషులే చేస్తున్నారు. ఈ వ్యవస్థే ఈ మనుషులను ఎప్పుడో ఒకప్పుడు నేరస్తులుగా మారుస్తున్నది.
ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి. అప్పుడే మన దేశంలో ఏ కేసులను ఎలా డీల్ చేస్తున్నారు? ఏ చట్టం రూపం సారం ఏమిటి? చట్టాల్లో పొందుపరిచిన అంశాలు ఈ అత్యాచారాలను అడ్డుకోడానికీ పునరావృతం కాకపోవడానికీ, నేరస్తుడిని శిక్షించడానికీ ఉపయోగపడతాయా? దీని వల్ల అమాయకులేమన్న శిక్షకు గురయ్యే అవకాశం ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంది. అత్యాచారాలకు వ్యతిరేకంగా దేశంలో ఇప్పటికే నిర్భయ, దిశ లాంటి చాలా చట్టాలున్నాయి. రేపు ఇంకోచోట రేప్ జరిగినప్పుడు ఇంకో అమ్మాయి పేరు మీద ఇంకో చట్టం కూడా రావొచ్చు. కానీ, ఇలాంటి చట్టాలెన్నొచ్చినా వాటి అమలు మాత్రం ఈ బూర్జువా సమాజంలో ఓ ఎండమావేనన్న నిజాన్ని గుర్తించనంతకాలం అబద్దంలోనే బతకాల్సి ఉంటుంది. వ్యవస్థలోని లోపాలను వ్యక్తిమీద రుద్ది చేతులు దులుపుకుంటున్నంత కాలం అత్యాచారాలు తగ్గవు అని చెప్పడానికి పెరుగుతున్న ఘటనలే రుజువులు. మొన్న ఒక సాధారణ గిరిజన కుటుంబంలో చిన్నారి పసిమొగ్గ... ఆ ఘటన మరువకముందే నిన్న వరంగల్లో నలుగురు బాలికలపై అత్యాచారయత్నం. ఇంతలోనే మహారాష్ట్రలో మరో ఘోరమైన ఘటన. వీటన్నిటి నేపథ్యాలు, ప్రదేశాలు వేరు తప్ప ఆడపిల్లలపై అఘాయిత్యాలకు అవధులులేవని నిరూపిస్తున్నాయి. దేశంలో ప్రతి ఇరవై నిమిషాలకొక మహిళ లైంగిక దాడికి గురవుతోందంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలో మార్పు రానంతవరకూ సమాజంలో, కుటుంబంలో, పని ప్రదేశాలలో ఎక్కడైతేనేమి, ఎక్కడో ఒక చోట ఎదో ఒక రూపంలో ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి.
- హిమబిందు