Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపావళి పండుగ అంటే పిల్లలకి చాలా ఇష్టం. తమకు నచ్చిన టపాసులని కాల్చి వారు ఆనందిస్తారు. ఏ పండుగనైనా పర్యావరణహితంగా జరుప ుకుంటే మంచిది. అందుకు దీపావళి పండుగ కూడా మినహాయింపు కాదు. దీపావళి అంటే కాంతుల మయం. ఈ రోజున ప్రతి ఇల్లూ దీపాల కాంతులతో ప్రకాశిస్తుంది. అయితే ఈ టపాసుల వల్ల కలిగే వాయు, శబ్ద కాలుష్యాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ కొన్ని రకాల టపాసుల నుంచి వెలువడే పొగ, శబ్దాలు చాలా ప్రమాదకరం. ముఖ్యంగా పెద్ద శబ్దాలతో పేలే సీమ టపాకాయలు, లక్ష్మీ బాంబులు అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. కానీ వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విపరీతంగా పొగను వెదజిమ్మే టపాసులను కూడా వెలిగించకపోవడం మంచిది. ఈ రకమైన టపాసుల నుంచి వెలువడే పొగ పండగ తరవాత కూడా కొన్ని రోజుల పాటు మన పరిసర వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఇది చాలా మందిలో శ్వాస సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది. టపాసుల శబ్దం చిన్న పిల్లలకి, వృద్ధులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. కరోనా కూడా ఎక్కువగా ఊపిరి తిత్తులపైనే ప్రభావం చూపుతున్న నేపథ్యంలో దీపావళి పండుగని మరింత జాగ్రత్తగా జరుపుకోవాలి. ఇంట్లో ఎవరికైనా ఆస్త్మా, క్రోనిక్ ఆబ్స్ట్రక్టివ్ పుల్మనరీ డిసీజ్ వంటివి ఉంటే టపాసుల నుంచి వచ్చే పొగవల్ల అది మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. కొన్ని రకాల టపాసుల్లో రకరకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఉదాహరణకు కాపర్, కాడ్మియం మొదలైనవి. ఇవి గాలిలో దుమ్ము రూపంలో పేరుకుపోతాయి. ఈ దుమ్ము ఆస్త్మా ఉన్నవారికి ఎంతో ప్రమాదకారి. దీనివల్ల పైత్యం, తుమ్ములు, జలుబు, తలనొప్పి వంటి రుగ్మతలు కలుగుతాయి. ఈ పండుగ కూడా చలికాలంలో వస్తుంది కాబట్టి పొగ మంచు ఎక్కువగా ఉంటుంది. ఈ విషపూరితమైన రసాయనాలు ఈ పొగలో కలిసిపోయి మరింత ఇబ్బంది పెడతాయి. ఈ హానికరమైన పొగ వల్ల ఊపిరితిత్తులు కూడా విషపూరితమవుతాయి. అధిక శబ్దం, విపరీతమైన పొగ వెలువడే టపాసులు కాకుండా చిన్న చిన్న టపాసులను కాల్చాలి. టపాసులను ఆరుబయట మాత్రమే కాల్చాలి. వీటిని పేల్చేటప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు మూసేయాలి. ఎవరైతే ఆస్త్మా, దగ్గుతో బాధపడుతున్నారో వారు ఈ సమయంలో తప్పకుండా మందులు వేసుకోవాలి. శ్వాసకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్న వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వీరు టపాసులకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. టపాసులు కాల్చడం వల్ల వెలువడే రసాయనాల కారణంగా కళ్లు ఎర్రబడకుండా, కంటి నుంచి నీరు కారకుండా ఉండటానికి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ పెట్టుకుంటే మంచిది. పర్యావరణ పరిరక్షణ కోసం తక్కువ నష్టాన్ని కల్గించే గ్రీన్ టపాసులు కాల్చడం మంచిది. ఒక్క దీపావళి నాడే కాదు, వివిధ వేడుకల్లో కాల్చే బాణా సంచా పై కూడా ఆంక్షలు పెట్టాలి. ప్రభుత్వం వీటిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి.
- ఎం. రాం ప్రదీప్
సెల్:9492712836