Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్య యుగాల్లో ఉన్న బానిసత్వం నేడు లేకపోయినా శ్రమ దోపిడీ ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంది. భారత దేశంలో అంటరానితనం, కుల వివక్ష వల్ల నిమ్న వర్గాల వారు తరతరాలుగా తమ హక్కులని కోల్పోయినట్లే, అంతర్జాతీయ సమాజంలో వర్ణ వివక్షత కారణంగా నల్ల జాతీయులు చాలా కాలం వరకు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడ్డారు. అబ్రహామ్ లింకన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి నాయకుల కృషి ఫలితంగా ఆఫ్రికా, అమెరికా వంటి దేశాలలో బానిసత్వం కనుమరుగు అయింది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టుబడిదారీ దేశాలు పెరిగాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో భారీ పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. వీటిలో పనిచేయడానికి పెద్ద ఎత్తున మానవ వనరులు ఆయా దేశాలకు అవసరం అయ్యాయి. పెట్టుబడి దేశాలు పది గంటలు కార్మికుల చేత పనిచేయించుకుని, ఎనిమిది గంటల కాలానికే వారికి డబ్భులు ఇచ్చేవారు. వివిధ దేశాల్లో కమ్యూనిస్టులు చేసిన పోరాటాల వల్ల కార్మిక చట్టాలు ఏర్పడ్డాయి. కార్మికులు తమ హక్కుల సాధన కోసం సంఘాలని ఏర్పాటు చేసుకున్నారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా ప్రకారం ఏటా 40మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా శ్రమదోపిడీకి గురౌతున్నట్లు తెలిపింది. పెద్దలతో పోల్చుకుంటే పిల్లల్లో రోజురోజుకు బాలకార్మికుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 150 మిలియన్ల మంది పిల్లలు చదువులకు దూరమై శ్రమ దోపిడీకి గురవుతున్నట్లు ఐఎల్ఓ తెలిపింది. పేదరికం, నిరక్షరాస్యత తదితర కారణాల వల్ల రోజురోజుకు బాల కార్మికుల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు కరోనా మహమ్మారి కూడా దోహదం చేస్తున్నది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రెండు ఏళ్ల నుంచి పిల్లలు చదువులకు దూరంగా ఉన్నారు.పేద విద్యార్థులకు అటు ప్రత్యక్షంగాగానీ, ఇటు పరోక్షంగా గానీ విద్య అందుబాటులో లేకుండా పోయింది. ఫలితంగా వారు పనులబాట పట్టారు. సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండటం వల్ల పేదరికం రోజురోజుకూ పెరుగుతున్నది. బానిసత్వం శ్రమ దోపిడీ రూపంలోకి మారింది. శ్రమ దోపిడీ వల్ల పేద వారి హక్కులు కాలరాయబడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు విపరీతంగా శ్రమదోపిడీకి గురౌతున్నట్లు ఐఎల్ఓ తెలిపింది. ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ప్రోత్సాహకాలని అందిస్తున్నాయి. వారి సౌకర్యం కోసం చట్టాలని ఏకపక్షంగా సవరిస్తున్నాయి. ఇటువంటి చర్యల వల్ల అణగారిన వర్గాల వారి భవిష్యత్ అగమ్యగోచరం అవుతున్నది.
దేశంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్యమాల నేపథ్యంలో కేంద్రం తన వైఖరిని మార్చుకుని చట్టాలని రద్దు చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు, హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం అని మరోసారి రుజువయ్యింది. శ్రమ దోపిడీ నిర్మూలించబడాలంటే పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. కార్మికుల వైఫల్యం వల్లే ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు పాలౌతాయన్నాయని, నష్టాలను పూరించడానికి ప్రయివేటీకరణ ఒక్కటే మార్గమని పాలక వర్గాలు చెబుతుంటాయి. ఈ క్రమంలో వివిధ సంస్థలు ప్రయివేటు పరమయిపోవడంతో కార్మికులలో కొందరు తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతారు. మరి కొందరు వెట్టి చాకిరి చేయవలసి వస్తుంది. శ్రమ దోపిడీ నిర్మూలన కోసం ఐక్య రాజ్య సమితి ప్రతి ఏటా డిసెంబర్ 2న అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం జరుపుతోంది.
19వ శతాబ్దంలో యూరోప్ దేశాలు అనుసరించిన వలస వాదం వల్ల అనేక ఆఫ్రికా, ఆసియా దేశాలు స్వాతంత్రం కోల్పోయాయి. స్వాతంత్రం పొందటం కోసం ఆయా దేశాలు బలమైన పోరాటాలు చేశాయి. ఈ ప్రయత్నంలో చాలా దేశాలు విజయం సాధించాయి. ఇటువంటి ఉద్యమ స్పూర్తితో వివిధ ప్రజా సంఘాలు బలమైన ఉద్యమాలు నిర్మించాలి. ఇందుకు లౌకిక,సామ్యవాద, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులు ఉమ్మడిగా కషి చేయాలి.
- ఎం. రాం ప్రదీప్
సెల్, 9492712836