Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకు తోటి మనుషుల మీద రెండు సందేహాలుండి, అవి నన్ను వదిలెయ్య లేనంతగా పీడిస్తూ వుంటే, ఈ పీడన లెన్నాళ్ళని ఇలా రాసేస్తున్నాను.
రుమాళ్ళంటే చేతి రుమాళ్ళే, జేబు రుమాళ్ళే. రుమాళ్ళు వాడడం ఎప్పుడూ ఎంతో పరిశుభ్రమైన సంస్కృతి! 'రుమాలు' అనే మాట పారసీ భాషా పదం, ఉర్దూ ద్వారా తెలుగులోకి వచ్చిందని కొందరు అంటారు. అయినప్పటికీ, ఈ 'చేతి రుమాలు' (హాండ్ కర్చిఫ్) సంస్కృతి' మాత్రం ఇంగ్లీషు వాళ్ళది కావచ్చు. ఇది, శుభ్రమైన, చక్కని ఆలోచనే, చేసుకుంటే చక్కని అలవాటే. మన వాళ్ళ అలవాటైతే, మొగ వాళ్ళకి భుజాల మీద పైపంచెలూ, ఆడ వాళ్ళకి కోకలూ!
రుమాళ్ళ వాడకం ఇప్పుడు టీవీ ఛానళ్ళలో బొత్తిగా కనపడదేం? టీవీల్లోనే కాదు, రుమాళ్ళు బైటా కనపడడం లేదు. అయినా, మొదట టీవీ ఛానళ్ళలో అశుభ్రం సంగతే! ఆ తర్వాత, బైటి వాళ్ళ సంగతి.
టీవీ ఛానళ్ళలో మసిలే వారికీ, అక్కడికి వచ్చి పోయే వారికీ రుమాళ్ళతో అవసరాలే వుండవు - అంటారా? అలా అనుకుంటే, అక్కడ ప్రతి వారికీ ఆ అవసరాలు వుండడం కనపడుతూనే వుంటుంది. ఆ అవసరా లేమిటంటే, మొహాల మీదా, ముక్కుల మీదా అనేక చోట్ల వేళ్ళతో తడుముతారు, గీకుతారు, తుడుస్తారు, సవరిస్తారు. కొంచెం మీసాల వారైతే, ఇక చూడక్కర లేదు. వేళ్ళతో, గోళ్ళతో, తుడుపుళ్ళూ, సవరింపులూ చక చకా జరిగి పోయి ఆ వేళ్ళని కిందకి దింపేస్తారు. ఆ వేళ్ళని కింద బట్టలకి తుడిచేస్తారేమో! ఇవి కనపడవు. కొన్ని సార్లు కూర్చున్న కుర్చీలనే ప్రియంగా పట్టుకుంటారు. ఆ వేళ్ళ తడిని కుర్చీలకి ప్రియంగా అంటించడానికేనేమో! కొన్ని సార్లు వేళ్ళు హఠాత్తుగా ఎగిరి ముక్కుల్ని తాకి కిందకి పరిగెత్తడం అత్యంత బహిరంగంగానే జరిగిపోతూ వుంటుంది! రుమాలు తోనే ముక్కుని తాకితే, దోషమా?
నేను టీవీ ఛానల్స్‌లో డిబేట్లు తప్ప, అవి అయినా అప్పుడప్పుడూ తప్ప, ఇతర ప్రోగ్రాము లేవీ దాదాపు చూడను. అంటే నేను చూడని సందర్భాల్లో మాత్రమే రుమాళ్ళు వుంటా యంటారా? ఏమో మరి అలాగే వుంటున్న దేమో!
ఛానల్స్‌ని తరుచుగా చూసే వారిలో ఇద్దరు ముగ్గుర్ని అడిగితే ఇద్దరైతే 'అక్కడ రుమాళ్ళెందుకూ?' అన్నారు. 'అవసరాలు వస్తే వేళ్ళతో తుడుచుకుంటున్నారు కదా?' అంటే, 'అబ్బే అదేం కాదు' అన్నారు. మూడో ఆవిడైతే ఈవిడికి 90 ఏళ్ళు దాటిన వయసు. ఈవిడైతే 'ఛీ! నాకు చేతి గుడ్డ అన్నా, టీచరమ్మ లాగ గొడుగేసుకుని నడవడం అన్నా మా చెడ్డ చికాకు' అన్నారు. 'మరి ఎప్పుడన్నా ముక్కు తుడుచుకోవాలంటే మీరు రుమాలు లేకుండా ఏం చేస్తారు?' అంటే 'ఏం? మన కోకలు వుండవూ? పైటి చెంగుతో తుడుచుకుంటే కాదూ?' అన్నారు.
'మొగాళ్ళకి కోకలు వుండవు కదండీ?' అంటే 'వాళ్ళ కసలు ముక్కులూ, మూతులూ తుడుచుకునే కర్మేంటి? వాళ్ళసలు వాకిళ్ళలో అన్నా తిరుగుతారా? వాళ్ళకి చేతులన్నా తడుస్తాయా?' అని మొగాళ్ళ మీద విమర్శలు చాలా చేశారు. 'ఛీ! రుమాలెందుకు?' అనేశారు. 'రుమాళ్ళు ఎవరు వాడతారు? ఎప్పుడో రొంప లొస్తే తప్ప? అప్పుడైనా ఒక గుడ్డ ముక్క పక్కన పెట్టుకునే వాళ్ళం. ఆఁ ఇంకోటి శ్రావణ మాసం పేరంటాలకి పోతే, శనగల వాయినాలు మోసుకెళ్ళడానికి ఆ పలకల రుమాళ్ళు పట్టికెళ్ళే వారు. నేను నా చెంగు తోనే తెచ్చుకునే దాన్ని. అదే కాదు పున్యస్త్రీ ఆడాళ్ళు కొత్త చీరలు కట్టుకున్నప్పుడు, మామూలుగా ఆ చేతి గుడ్డలు పెట్టెల్లో నించి తీసి నడుంలో దోపుకునే వారు, కొత్త చీర కొంగు పాడవుతుందని. ఆ గుర్తొచ్చింది మా మనవడొకడు మెడ చెమట చొక్కా కాలరంటారే దానికి అంటరాదని, వాటి మధ్య ఆ రుమాల్లాంటిది ఇమ్మని పేచీ పెట్టి, తీసుకుని అక్కడ పెట్టుకుంటే మేమందరమూ 'సినిమాల్లో రౌడీల్లాగా అదేమిటిరా' అని తిట్టేవాళ్ళం! చొక్కా పాడవుతుందంటాడు. తెల్లటి రుమాలు బట్టని పాడు చేస్తాడు. చొక్కాని ఎలాగూ విప్పేస్తాడు కదా? ఇక ఆ బట్టని ఉతికే పని ఎందుకూ? - చెప్తే వినడే!'' ఎన్ని మాటలో ఆగకుండా ఇంత చెప్పారు ఆవిడ.
దానికి నేను సంతోషించాను. 'ఏమండీ, మీరన్నది నిజమే గానీ, అది కాదండీ అవన్నీ సరే, మాట్లాడుతూ వుంటేనే పెదాల్ని ఎప్పుడో అప్పుడు తుడుచు కోవలిసి వస్తుంది. బైట మాట్లాడే వాళ్ళనైతే ఎవరు చూస్తారు గానీ, టీవీల్లో వారి పరిస్థితి అలా కాదు కదా?' అంటే, ఆవిడ నా మాటల్లో ఏ మాట తోటీ ఏకీభవించ లేదు.
ఎప్పుడూ రుమాళ్ళు అలవాటు అయి వుండవు. అన్ని తుడుపుళ్ళూ కోకల తోటే - అని ఆవిడే చెప్పేశారు. ఇక వూరు కున్నాను.
'టీవీలో రుమాళ్ళు ఎందుకు వాడరు?' అనే సందేహానికి నాకు జవాబు దొరక లేదు. బట్టల షాపుల్లో రుమాళ్ళు అమ్ముతారంటే, వాటిని అనేక మంది కొంటారనే కదా? కొనే వాళ్ళు లేకపోతే, వాటిని అసలు తయారు చేస్తారా ఈ వ్యాపారాల ప్రపంచంలో? రుమాళ్ళు కూడా కొంటారు గానీ వాటిని వాడరా? ఇంగ్లీషు చానళ్ళు చూసేవాళ్ళు చెప్పినదేమిటంటే కోట్లు వేసుకుని ఇంటర్వ్యూలు ఇచ్చే కొందరు పెట్టుబడిదారులు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ, కోటు జేబులోనించే త్రికోణంలో బైటికి కనిపించేలా రంగుల జేబు రుమాలు వుంచుకుంటారట. కానీ దానిని వాడకుండా చేతినే ఉపయోగిస్తారట!
తెలుగు ఛానళ్ళలో ఒక్క దానిలో నేను చూసిన అతి తక్కువ సందర్భాల్లో ఒక్కాయనే రుమాలుతో మొహం తుడుచుకుంటూ కన పడ్డారు. ఉండవల్లి - అని ఇంటి పేరు లాగ గుర్తు. కిషోరో, కుమారో ఏదో వుంది పేరు. ఇది కూడా ఒకే ఒక్క సారి! అదే బాగుంది, టీవీలో ఒక్కరైనా రుమాలుతో తుడుచుకోవడం చూస్తే!
టీవీ ఛానల్స్‌ని చూసేటప్పుడు వాటి లోనే అనేక మంది కనపడతారు గానీ, బైట వాళ్ళని ఎలా చూస్తాను? నేనెప్పుడూ ఏ వుద్యోగం లోనూ లేను. ఇరుగు పొరుగిళ్ళకి అయినా తిరగను. వాళ్ళూ రారు. ఏ యాడాదికో గానీ. ఫోన్లు పుట్టి మనుషుల్ని దూరం చేశాయో, కదలకుండానే దగ్గిర చేశాయో తెలీడం లేదు. నా పని నన్ను ఇల్లు కదల కుండా చేస్తూ వుంటుంది.
ఒక సంఘటన! ఇప్పుడు కాదు. నాలుగేళ్ళ కిందట. కొంచెం మధ్య వయసు పాఠకుడు. 'దూరం నించి వచ్చాను' అన్నారు. బెంగుళూరో, కాకినాడో! 'రండి' అని ఒప్పుకున్నాను. ఆయన దగ్గుతూ, తుమ్ముతూ చేతులు అడ్డం పెట్టుకుంటూ వచ్చి కూర్చున్నారు. దగ్గుతూనే మాటలు! చేతుల్ని ఒంటి మీద బట్టలకి అంటిస్తున్నారు! కరోనా వ్యాప్తి ఎందుకో ఇప్పుడు అనిపిస్తోంది.
నేను వెంటనే లేచి అలమారు లోనించి ఉతికి, మడతలు పెట్టి వుంచిన తెల్లటి రుమాళ్ళ లోనించి రెండు తీసి, ఆయన ఒడిలో పెట్టి 'ఇవి వాడండి! మీకు రెండు వుండాలి' అన్నాను.
ఆయన తెల్లబోతూ 'ఎందుకూ? ఇవెందు కండీ? నా కర్చీఫ్నా దగ్గిరే వుంది' అన్నారు.
అప్పుడు నేను తెల్లబోయి 'ఉందా? మీరు వాడడం లేదండీ' అంటే, 'అబ్బే వుంది. నా బ్యాగ్‌ని బైట వరండాలో పెట్టేశాను. అందులోనే వుంటుంది ఎప్పుడూ. దాంతో నాకేం అవసరం వుండదు' అంటోంటే ఇంట్లోంచి మా మనవడు 'స్పార్టకస్' వెళ్ళి ఆ బ్యాగ్‌ని మోసు కొచ్చాడు.
(మిగతా తరువాయి సంచికలో)
రంగనాయకమ్మ