Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గత వారం తరువాయి)
ఆయన ఆ బ్యాగ్‌ని తెరిచి ఉండ లాగ మెలికలతో ముడుచుకు పోయిన కర్చీఫ్‌ని బ్యాగ్‌లో నించి, ఇస్త్రీ బట్టలన్నిటినీ తప్పించి బాగా లోపలి నించి బైటికి లాగారు.
దాన్ని చూసి నేను జడుసుకున్నా, మర్యాదగా 'అది వద్దండీ, బాగా మాసి నట్టుంది. దాన్ని వుతికితే గానీ (ఉడక బెడితే గానీ - అనాలి. నేనలా అనలేదు. అంత మర్యాద వచ్చింది దగ్గే రోగి మీద!) వాడ కూడదు. ఇవే వాడుకోండి. మీ రసలే దగ్గుతున్నారు. ఇటు వంటప్పుడు మీ రసలు ప్రయాణం ఎందుకు పెట్టుకున్నారు?' అన్నాను.
'నాకేం ఫర్వాలేదండీ. (చక్కగా దగ్గుతూ, తుమ్ముతూ ప్రయాణం చెయ్యగలను. మీ ముందు కూర్చుని కూడా దగ్గగలను. అంత సాహసం నాకు!) ఇవి తెల్లగా పువ్వుల్లా వున్నాయి. వీటిని వాడడం ఎందుకు?' అన్నారు. అవి మురికి వోడుతూ వుంటే, వాటిని చప్పున వాడేవారేమో! ఆ రెండూ నేనే తీసుకుని, నేల మీద బాగా రుద్ది, 'ఇప్పుడు తెల్లగా లేవుగా? వాడండి!' అని చెప్పాల్సింది. ఆయన తన మురికి కర్చీఫు తోనే తుడుచుకుంటూ నవ్వుతూ మాటల్లోకి దిగారు. (ఒక కధలో చేపలామె మల్లెల వాసన భరించ లేక, చేపల బుట్టనే పక్కన పెట్టుకుని గాఢంగా నిద్ర పోయినట్టు!)
ఆయన నేను రాసిన 'పేక మేడలు' దగ్గిర మొదలు పెట్టారు. ఆ నవల చదివాక పేకాటని రెండు వారాలు మానేసి, ఆ తర్వాత పేకని మళ్ళీ ముట్టు కున్నారట. ఆ నవల, అయన్ని రెండు వారాలైనా మార్చగలిగింది! ఆశ్చర్యం! తర్వాత 'బలి పీఠం' అంతే. మెడికల్ షాపులకు తిరిగే పని టైము వుండదు. ఇక పుస్తకాలు ముట్టడం లేదు. ఈయన మీద ఇప్పుడు ఇలా రాసినా, ఈయనకి తెలీదు, స్నేహితులు చెపితే తప్ప! ఈయన్ని చూస్తే, ఆ స్నేహితుల్ని చూడాలా? వాళ్ళు పుస్తకాలు ముట్టేవాళ్ళా?
ఆ దగ్గుల రోగికి వేడి టీ ఇస్తే కాస్త దగ్గు తగ్గింది. శుభ్రం లేని వారికి టీ ఇవ్వడం తప్పే మరి! ఆయన అడగలేదు. అడగకుండానే, అలా చేశాను. తప్పు కాదు మరి!
ఆయనతో అరగంట గడిచాక, సంతోషిస్తూ లేచి వెళ్ళిపోయారు. సంతోషాన్ని ఆయనా, విచారాన్ని నేనూ పంచుకున్నాం. నా పాఠకుణ్ణి అంత మురికిగా చూశాను.
ఆయన ఒడిలో పడి లేచిన తెల్ల రుమాళ్ళని మసిలే గీజర్ నీళ్ళతో జాడించడానికి, ఒక బకెట్లో పడేశాను. గాంధీకి ఇంటి కొచ్చాక నా కష్ట గాధ చెపితే, 'ఆ దగ్గుల రోగికి మనసారా ఇచ్చేసినా, మన రుమాళ్ళు మనకి దక్కాయి! పాపం, టీతో ఎలర్జీ టాబ్లెట్ మనం వాడేది ఇవ్వ వలిసింది' అన్నాడు.
అంత దగ్గుల మనిషికి నోటికి అడ్డం పెట్టుకోడానికి తన బ్యాగ్లోనించి రుమాలుని తీసుకోవాలనే ఆలోచనే రాలేదు! ప్రపంచానికి 'మార్క్సిజం' తెలిసి పోయింది గానీ, 'రుమాలిజం' ఇంకా తెలీలేదా? అని నా పెద్ద ప్రశ్న! ఆయన ఒంటి మీద బట్టలు కొత్త రకాలే, ఇస్త్రీవీ! కర్చీఫ్ మాత్రం మురికి ముద్ద! అవునూ, అస్సలు ఆయన అత్యవసరాల్లో కూడా వాడని రుమాలు, మురికి ముద్ద ఎలా అయిందబ్బా? - ఆ బ్యాగ్ లోపలే మట్టి గుట్ట ఏదైనా వుండి వుంటుందా? అదే జరిగి వుండాలి.
ఇదేమిటి నేను ఇంత పరాకుగా వున్నాను! అంత ముఖ్య విషయం గుర్తే లేదే! ఆయన మెడలో 'టై' వుంది! ఏవేవో గీతలతో, చారలతో, చుక్కలతో గుండ్రాలతో! నా దృష్టి అంతా, భయం అంతా ఆయన 'దగ్గు' మీద పడిపోయి, రుమాలు కోసం చూస్తూ, ఆయన మెడలో వేళ్ళాడుతోన్న దాని వేపు ఒక్క సారే చూసి ఆయన బ్యాగ్ కోసమే పిల్లాణ్ణి పిల్చి, బైటికి వెళ్ళి దాన్ని తీసుకు రమ్మని చెప్పి, ఆ కంగారు లోనే వున్నానా? అంతే నిజంగా లేకపోతే నెక్ టైల మీద నాకు అంత పరాకా!
'నెక్ టై'ల మీద నా కోపం గురించి ఇప్పుడు చెపుతాను. ఆయనతో ఆ టై గురించి ఒక్క మాట కూడా అనలేదు. 'అయ్యో! ఎందుకండీ ఇది? చేతిలో మంచి రుమాలు లేకుండా ఇదెందుకండీ?' అనలేదే - అని చాలా సిగ్గు పడ్డాను. కానీ, అలా అని వుంటే 'నా రుమాలు వుందిగా?' అనరా ఆయన?
'అది మురికిగా వుంది కదండీ?' అంటానా? అలా అంటే, ''ఇది మురికా? కాదండీ, ఈ బట్ట బ్లాక్ కలర్! అంతే' అంటారేమో! అప్పుడు నేనే మంటాను? మళ్ళీ 'అది మురికి' అంటే బాగుండదు. నాకూ మొహమాటాలు వొస్తున్నాయే! ఆ 'టై' గురించి ఎత్తక పోవడమే మంచిదైంది - అని, ఆ అర గంటలోనే ఆయన నవ్వు చూసి తెలుసు కున్నాను. కానీ, ఆ 'టై'?
నిజానికి, నాకు 'నెక్ టై'ల్ని చూస్తే, అవి ఎలా అనిపిస్తాయంటే, మెళ్ళల్లో 'పాములు' వేళ్ళాడు తున్నట్టుగా! శివుడి గారి బొమ్మల నించి నేర్చుకున్నారేమో ఈ స్టైలు!
'అవి పెట్టుకున్న వాళ్ళకి అలా అనిపించదు కదా? నీకు అలా అనిపిస్తే ఏమిటి?' అంటారు మా వాళ్ళు. ఏ మాట కా మాటే! వాళ్ళ మాటల్లో నిజం వుంది. నాకే అలా అనిపిస్తోంది మరి!
'నెక్ టై'ల సంస్కృతి ఇంగ్లీషు వాళ్ళ సంస్కృతే కావచ్చు. 'వాళ్ళవి చలి దేశాలు కదా?' అంటారు. హేవిటీ, చలి దేశంలో వాళ్ళు ఇళ్ళల్లో టైలు కట్టుకుని తిరుగుతారా? ఇంకా నయం. టై అనేది ఉద్యోగాల్లో గొప్పగా కనపడడానికి కాదూ?' అంటాను నేను. దీనికీ ఎవ్వరూ ఒప్పుకోరు!
వెనకటి కాలాల్లో చలి నించి వెచ్చగా మెడల చుట్టూ బట్టలు చుట్టుకుంటే, వాటిని మఫ్లర్లు అంటారని విన్నాను. అది చలి దేశాల్లో మరీ ఎక్కువగా వుంటుందేమోగా? ఆ బట్టలు అలా మెడల్లో వేళ్ళాడుతూ వేళ్ళాడుతూ, కాల క్రమంలో వెచ్చని కోట్లు పుట్టాయా? కోట్లలో అన్నీ 'చలి' కోట్లేనా? కొన్ని ఫార్మల్గా 'గొప్ప' కోసం షోకు కోట్లు కూడా వుండవూ? వాటిని ఇక్కడా చూస్తాం. ఇక్కడేం చలి? అయినా, ఇక్కడా కోట్లే! అదో గొప్ప!
ఆ చలి దేశాల్లో మెడల్లో చుట్టుకునే బట్టలే 'టై'లుగా మారాయా? - ఇటువంటిదేదో జరగక పోతే, సంస్కృతి ఎక్కడి నించి పుడుతుంది? మగ వాళ్ళకేనా చలి? ఆడ వాళ్ళకి వుండదా? పిల్లలకి వుండదా? వాళ్ళకీ టైలు వుంటాయా? మరిచాను, నా గురువులు మార్క్సూ, ఎంగెల్సులు ఇద్దరూ టైలు వేసుకున్న ఫొటోలే కనపడ్డాయి. వాళ్ళ ఆడవాళ్ళు, టైలు వేసుకున్న ఫొటో ఒక్కటీ చూడలేదు.
మా చిన్న తనంలో, ఒకటి బాగా గుర్తు. చలి కాలాల్లో, ఎండల్లో కూర్చున్నేంత పెద్ద వాకిళ్ళు మా ఇంట్లో లేవు. ఇరుకు వసారాల్లో ముడుచుకుని కూర్చుంటే, మా నాయనమ్మ, పిల్లల మెడలకు ముతక బట్టలు చుట్టి, 'మెళ్ళకు, అరి కంఠాలు కట్టుకోండి చలి రోజుల్లో' - అనేది. తను కూడా పైట చెంగంతా మెడకి చుట్టుకునేది. 'అరి కంఠాలు' అనే మాట ఆ రకంగా గుర్తు. గొంతు నొప్పో, దగ్గో వొస్తే, ఏదో మెడకు పూసి, దాన్ని 'అరి కంఠం' అనే వారే మా వూళ్ళో - అంది ఒకావిడ. పక్కింటావిడే. 'మీ వూరు వేరూ, మా వూరు వేరూ' అని నేను అంటే, 'అది నిజమే, నిజమే' అని, 'అరి కంఠం' వాళ్ళ వూళ్ళో మాటే - అని తేల్చారావిడ. మా ఊళ్ళో ఆ మాటకి అర్ధం వేరేగా వుంది మరి! ఒక్కో సారి మేమే అడిగే వాళ్ళం, 'నాయనమ్మా అరి కంఠం కట్టు' అని. ఆ 'కంఠం' మా వూరి కధేగా?
చలి దేశాల వాళ్ళకి ఒంటి మీద బండ బట్టలు మరీ అవసరమే కదా?
(తరువాయి వచ్చే సంచికలో)
- రంగనాయకమ్మ