Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్రాన్ని వ్యాపారంగా మలచుకున్న నిర్మాతలు లేదా దర్శకులు, తమ చిత్రం వల్ల సమాజానికి ఏదైనా మంచి జరగకపోయినా, కనీసం కీడు మాత్రం జరగకూడదని భావించాలి. కానీ ఈ చిత్రం రెండవ భాగం మొత్తం ఒక చేతితో వందల మందిని చంపుకుంటూ పోతూ, నెత్తుటి ఏరులు పారించిన కథానాయకుడు అభిమానుల నీరాజనాలు అందుకోవచ్చునేమో కానీ, ఆ చిత్రీకరణ ప్రభావం యువత పైన ఎలా ఉంటుదనే స్పృహ దర్శకునికి లేదా నిర్మాతకు లేకపోయినప్పటికీ, శాసన సభ్యుడైన (కథానాయకుడు) ఆ నటుడైనా గ్రహించవలసి ఉంది.
ఏమిటి ఈ నీరాజనం? ఎందుకు ఈ నీరాజనం? ఏం సాధించారని... మన ప్రేక్షకులకు, మన ప్రజలకు ఏం మంచి జరిగిందని ఈ నీరాజనం?
సమాజ హితం కోరుతూ తీసిన అలనాటి ''పండంటి కాపురం'', ''ఉమ్మడి కుటుంబం'', ''సుఖదు:ఖాలు'', నేటి తరం ''ఆకలి రాజ్యం'', ''భూమి కోసం'' లాంటి చిత్రాలు సమాజానికి సందేశం ఇచ్చాయి. యువతకు సమాజం పట్ల, కుటుంబ అనుబంధాల పట్ల అవగాహన కల్పించాయి. నాలుగు దశాబ్దాల క్రితమే విఠలాచార్య తీసిన చిత్రాలలో విహంగయానాల చిత్రీకరణ, వాటంతటవే తెరుచుకునే గవాటాలు, రాజ్యాధిపతుల కార్యదక్షత, వారి ప్రజా రక్షణ బాధ్యత ఎలా ఉండేది అనే విషయాలుండేవి. ''నలుపు తెలుపు''లో చిత్రీకరించినప్పటికీ, ప్రేక్షకుల ఆదరణ పొందటమే కాక, సందేశాత్మకంగా ఉండేవి. సత్యజిత్ రే, మృణాల్ సేన్, శ్యామ్ బెనగల్ లాంటి దర్శకుల 'పథేర్ పాంచాలి, అంకుర్, మంథన్, నిశాంత్, భూమిక, కలకత్తా 1971 (కరువు పైన), భువన్ శోమ్, అపరాజిత', వేజెళ్ళ సత్యనారాయణ ''ఈ చరిత్ర ఏ సిరాతో'', ''రోజులు మారాలి'', ''ఈ చదువులు మాకొద్దు'' లాంటి చిత్రాలు సందేశాత్మకంగా ఉండటమే కాక, అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకున్నాయి. ఆ తరువాత కాలంలో ''అడవి రాముడు'' లాంటి చిత్రాలు అడవుల సంరక్షణ, అడవి జంతువుల పరిరక్షణ ఆవశ్యకతను తెలిపేవి. సమాజం పట్ల దర్శకనిర్మాతలకు ఉన్న బాధ్యతను తెలియజేసేవి.
ఆ తరువాత కాలంలో ''దాసరి నారాయణరావు, ఆర్. నారాయణ మూర్తి'' లాంటి వారు కర్షక, కార్మికుల సమస్యలను ఇతివృత్తాలుగా చూపుతూ తీసిన చిత్రాలను కూడా చూశాం. ''భారతీయుడు, ఖైదీ నెం.150, ఠాగూర్-స్టాలిన్, శివాజీ, రుద్రవీణ'' లాంటి చిత్రాలను అవినీతిని నిర్మూలించాలని, కుల వివక్షను పారదోలాలని, మద్యపానం నిషేధించాలని, నీటి కాలుష్యం వలన రైతులు ఏ రకంగా నష్టపోతారనే విషయాలను తెలియజేస్తూ సందేశాత్మకంగా చిత్రీకరించారు. ఇలాంటి చిత్రాలలో కూడా కథానాయకుడు ప్రతినాయకుడి మీద, వారి వందిమాగధుల మీద ముష్టి యుద్ధాలు లేదా ఆయుధాలతో పోరాటం చేసినప్పటికీ... ఆశయ సాధనలో చట్టానికి లోబడి ఉండేవాడు. లేదా చివరలో చట్టానికి లోబడి న్యాయస్థానం ద్వారా విడుదల కావడమో కొంతకాలం శిక్షింపబడటమో చూసాం. ఈ మధ్య కాలంలో వచ్చిన ''అయోగ్య'' చిత్రంలో మహిళపై అత్యాచార నిందితులను శిక్షించడానికి సరిపడే సాక్ష్యాలు లేనప్పుడు, ఆ నేరస్తులకు శిక్ష పడాలనే సంకల్పంతో ఉన్న కథానాయకుడు తాను కూడా ఆ నేరస్తులతో పాల్గొన్నానని, కోర్టులో నేరాన్ని ఒప్పుకుంటున్నానని చెప్పి అసలు నేరస్తులతో పాటు శిక్షకు గురి అవుతాడు. ''రాఖీ'' చిత్రంలో కూడా మహిళలపై అత్యాచారాలను ప్రతిఘటించడమే కాక, కథానాయకుడు చట్టాన్ని గౌరవించేలా చిత్రీకరించారు. మహిళలకు రక్షణ ఆ విధంగా ఉండాలనే సందేశం చూపించారు. ఇలాంటి చిత్రాలన్నింటిలో హింసను ఎక్కువగానే చూపిస్తుంటారు. న్యాయ వ్యవస్థ పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని, ఆయా వ్యవస్థల క్రియాశీలతను, రాజ్యాంగ నిర్మిత రక్షణ వ్యవస్థల ప్రాధాన్యతను కూడా చూపించారు. నాటక రంగం, చిత్ర పరిశ్రమ, కవిత్వం, కావ్యం... లాంటి వాటి ద్వారా ప్రజలలోకి వచ్చే విషయాలు సమాజంపై తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులది ప్రధాన భూమిక. వారు రచించిన పాటలు, గేయాలు, కళారూపాలు తెలంగాణ సమాజంపై చెరగని ముద్ర వేశాయి. అలా మన కళలు, కళా రంగాలు సందేశాత్మకంగా, గుణాత్మకంగా ఉంటే సమాజానికి మేలు చేసేవిగా ఉంటాయి.
ఇక నిన్న మొన్నటి నీరాజనానికి కారణం వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. దిన పత్రికలు, టీవీ ఛానళ్ళు, వాట్సప్, యూట్యూబ్ ఏది చూసినా సరే. ''అఖండ'' చిత్రం గురించి, కథానాయకుడు ''బాలయ్య బాబు'' గురించి తెలిపే విషయాలు చూస్తే... మనకు సామాజిక స్పృహ కల్పించడానికి ఈ విషయాలు, చిత్రీకరణ పనికొస్తుందా లేదా? అని ఎవ్వరినీ ఆలోచించనివ్వడం లేదనిపిస్తుంది. నిస్సందేహంగా ఒక విషయాన్ని అంగీకరించాలి-అదేమంటే ప్రకృతిని పరిరక్షించాలి అనే నేపథ్యం. అదే నేపథ్యంతో గతంలోనూ చాలా చిత్రాలు వచ్చాయి కానీ, ఇంత హింసాత్మకంగా చిత్రీకరించలేదు. ''అఖండ'' చిత్రంలోని కథానాయకుడు పోషించిన రెండు పాత్రలు విభిన్నమైనవి. మురళీకష్ణ పాత్ర చాలా వరకు ప్రజల మనస్సుకు హత్తుకునేలా చిత్రీకరించారు. ప్రకృతి పట్ల అతని నిబద్ధత, ఆ ప్రకృతిని రక్షించకపోతే భావితరాలకు నష్టం అనే విషయాలు నిస్సందేహంగా ఆమోదించేవి. కానీ రెండవ పాత్రను ప్రారంభం నుండి చివరి వరకు సమాజానికి ఏ మాత్రం ఉపయోగపడని విధంగా చిత్రీకరించారు. చిత్రాన్ని వ్యాపారంగా మలచుకున్న నిర్మాతలు లేదా దర్శకులు, తమ చిత్రం వల్ల సమాజానికి ఏదైనా మంచి జరగకపోయినా, కనీసం కీడు మాత్రం జరగకూడదని భావించాలి. ఈ చిత్రం రెండవ భాగం మొత్తం ఒక చేతితో వందల మందిని చంపుకుంటూ పోతూ, నెత్తుటి ఏరులు పారించిన కథానాయకుడు అభిమానుల నీరాజనాలు అందుకోవచ్చునేమో కానీ, ఆ చిత్రీకరణ ప్రభావం యువత పైన ఎలా ఉంటుందనే స్పృహ దర్శకనిర్మాతలకు ఉండాలి. ఒకవేళ వారికి లేకపోయినప్పటికీ, శాసనసభ్యుడైన (కథా నాయకుడు) ఆ నటుడైనా గ్రహించవలసి ఉంది. తాను ఏ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి శాసనసభ్యుని బాధ్యతలు తీసుకున్నాడో, ఆ ప్రమాణంలో భాగమైన న్యాయ, శాసన వ్యవస్థల ప్రతి రూపాలైన ఇన్వెస్టిగేట్ ఏజెన్సీలను నిస్సహాయులుగా, నిష్క్రియా వాదులుగానూ చిత్రీకరించడమే కాక, తాను న్యాయానికి, చట్టానికి అతీతుణ్ణని ప్రకటించుకోవడం, ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని గ్రహించకపోవడం బాధాకరం. రాజ్యాంగ విలువలను కాపాడవలసిన శాసనసభ్యుడిగా ఈ పాత్రను బాలయ్యబాబు అంగీకరించకుండా ఉండవలసింది. కనీసం చిత్రం చివరిలోనైనా న్యాయ వ్యవస్థకు, చట్టాలకు తాను బద్ధుడననేలా చిత్రించి ఉంటే బాగుండేది. అలాగే ఈ చిత్రంలోని రెండవ భాగం ఆసాంతం హైందవ ధర్మ ప్రచారం కోసం మాత్రమే తీసినట్లుగాను, శాస్త్రసాంకేతికతను అపహాస్యం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లుగాను ఉంది. ఇదివరకు ''టైం మెషిన్'' ద్వారా గతంలోకి తీసుకెళ్లిన, భవిష్యత్తును దర్శింప చేసిన చిత్రాలు చూశాం. చంద్రునిపై కాలు పెట్టే శాస్త్ర, సాంకేతికతను పొంది... అంతరిక్షం లోకి రాకెట్లను పంపి ప్రజలకు ఉపయోగపడే ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తలను అవమానపరిచేలా ఈ చిత్రం ఉన్నది. ''అఘోరా'' పాత్ర ద్వారా మళ్లీ సనాతన ధర్మాలను, ఆచారాలను ప్రజలకు విపులీకరిస్తున్నట్లు చూపినప్పటికీ, నేటి ఆధునిక సమాజాన్ని కొన్ని శతాబ్దాల వెనక్కు తీసుకెళ్లే ఒక ప్రయత్నంగా ఉంది. సినిమా అనేది వినోదం కోసం కాబట్టి ఇటువంటివి పట్టించుకోకూడదని కొందరు అభిమానులు అనవచ్చు. నేడు జరుగుతున్న నేరాలను చూస్తే సినిమా లేదా టీవీ సీరియళ్ల ప్రభావం ఎంతగా పెరుగుతుందో గ్రహించవచ్చు. సామాజిక, ఆర్థిక అసమానతలను, అణగారిన ప్రజల ఇబ్బందులను తెలియజేసిన ''ఎర్ర మల్లెలు'', ''ఒసేరు రాములమ్మ'' చిత్రాల నిర్మాతలు ఆర్థికంగా చితికిపోయారు. కానీ వారి చిత్రాలు సమాజానికి సందేశాన్నిచ్చాయి. ఈమధ్య కాలంలో వచ్చిన ''వకీల్ సాబ్'' చిత్రంలో న్యాయవాది పాత్ర ద్వారా మహిళలపై అత్యాచారాలను ఎదుర్కోవడానికి, వారికి అండగా ఉంటూ, న్యాయస్థానాల క్రియాశీలతను మంచి కోణంలో చూపించారు. ఆ తరువాత వచ్చిన ''జై భీమ్'' చిత్రం మరింత ముందుకు వెళ్లి అణగారిన వర్గాల వారిపై పెత్తందారులు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో, అక్రమ కేసులలో కొందరు పోలీసులు అటువంటి పెత్తందార్లకు ఎలా బాసటగా ఉంటారో చూపారు. దీంతో పాటు, అలాంటి సందర్భాలలో న్యాయవాదుల బాధ్యత ఏమిటో తెలియజేశారు. అంతేకాకుండా, న్యాయస్థానాలకు సహకరించి కేసులు విచారించడంలోనూ కొంతమంది నిబద్ధత కలిగిన పోలీసులు ఉన్నట్లుగా చూపించారు. అదేవిధంగా న్యాయమూర్తుల సమయస్ఫూర్తి, సందర్భానుసారం తీసుకునే నిర్ణయాలు, బాధితులకు ఇచ్చే రక్షణ, చేసే సహాయం... భిక్ష కాదని, అది వారి హక్కని తెలియజేశారు. ఇలాంటి చిత్రాలు నిజంగా సమాజానికి అవసరం. రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పెంచుతాయి. ఇకపైనైనా నిర్మాతలు, దర్శకులు ఇటువంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించి యువతకు నూతన సమాజాన్ని నిర్మించవచ్చు అనే ఉత్తేజాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను.
- కొల్లి సత్యనారాయణ