Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట వీరుల్ని కంటుంది. విప్లవాన్ని సృష్టిస్తుంది. ఆ విప్లవాల్లో ఒరిగిన వీరులను తనలోకి ఒంపుకుని స్మరిస్తూ జీవంపోసి బతికిస్తుంది. అలా ఇప్పుడు ఓ పాట ఒక విప్లవ వీరుని జీవనగీతం వినిపిస్తూ మన ముందుకొచ్చింది. కాకపోతే ఆ పాటను ఒక సినిమా మోసుకొచ్చింది.
''ఆర్ఆర్ఆర్'' సినిమాకోసం ఈ మధ్యనే రిలీజ్ అయిన ''కొమురం భీముడో కొమురం భీముడో'' అనే పాట నేడు తెలంగాణ ప్రజల్ని అలరిస్తోంది. దీనికి ఒక కారణం కొమురం భీంను స్మరించడం అయితే, తెలంగాణ భాష, యాసలతో సాహిత్యం ఉన్న జానపద బాణీ కావడం మరో కారణం. అడవిబిడ్డల గోండు రాజ్యం మీద నైజాం రాజ్యం, జమీందారుల ఆగడాలుండేవి. వాటిని ఎదుర్కోవడానికి గోండు జాతి కొమురం భీంను ఎలా తయారు చేసుకుందో, జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చి గెరిల్లా పోరాటం చేసేలా అక్కడున్న భౌతిక, జీవన్మరణ పరిస్థితులు ఎలా పురిగొల్పాయో ఈ పాట అర్ధం చేయిస్తుంది. ''కొమురం భీముడో కొమురం భీముడో/ కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో/ కొమురం భీముడో కొమురం భీముడో/ రగరగ సూర్యుడిలా రగలాలి కొడుకో'' అనే పల్లవిలో ఆ వీరున్ని కన్న ఆ నేల, అడవి తన కొడుకును ఎలా తిరుగుబాటుదారుడిగా తయారవ్వాలో కోరుతున్నట్టుంటుంది.
సుశిక్షితుడైన విముక్తి పోరాటయోధుడు, విప్లవవీరుడు కొమురం భీం సాహసాన్ని, నెత్తుటి త్యాగాన్ని కొనియాడుతూ పాట ముగుస్తుంది. ఇక్కడ కొమురం భీం పేరు వింటేనే రోమాలు లేచి నిలబడుతాయి. అలాంటిది ఒక బలమైన జానపద సాహిత్య మాండలికం గంభీరమైన గొంతుతో వెలువడ్డప్పుడు ఇక ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. త్యాగాలకు, త్యాగాల్ని స్మరించే పాటలకు తెలంగాణ ఎల్లప్పుడూ పబ్బతి పడుతూనే ఉంటది.
ఈ పాట కంటే ముందే కొమురం భీంను స్మరించుకునే ఆదివాసుల పాటలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా పాటను మాత్రం సుద్దాల అశోక్ తేజ రాశారు. ఆయన పాట వేలుపట్టుకుని నడిచినవాడు. పాట పుట్టుక, పరిణామం లోతుపాతులు తెలిసినవాడు. కనుక ఇంత ప్రభావశీలంగా రాశారు. దానికి తన ఉద్యమ వారసత్వం, విప్లవ పాటలు రాసిన నేపథ్యం, వేల పాటలు రాసిన అనుభవం ఉపయోగపడింది. కానీ ఆ యాస, మాండలికం ఉట్టిపడడానికి కారణం తను పుట్టిన స్థల, కాలాలతో పాటు గడిపిన పల్లె జీవితం కూడా తోడైందని చెప్పవచ్చు. అందువల్లనే ఆ పాట అంత పదునుదేరి ప్రతిభావంతంగ రూపుదిద్దుకుంది. ప్రభావశీలంగా ఆకట్టుకుని కొర్రాసు నెగడై మండుతుంది.
పల్లవి నుంచే తెలంగాణ మాండలికాన్ని వాడాడు. కొర్రాసు నెగడోలే (కొరకాసు అని కూడా అంటారు. ఇది భగ భగ మండే పొయ్యిలో షార్ప్ గ మారి మండుతున్న కట్టె) ఓలే అంటే వలే అని అర్థం. ఇక చరణంలో చూస్తే ''కాల్మొక్తా భాంచన్ అని వంగితె ఒగాల/ కారడవితల్లీకి పుట్టనట్టేరో/ జులుము గద్దెకు తలను వంచితె ఒగాల/ తుడుం తల్లీ పేగున పెరగనట్టేరో''.. ఒగాల అంటే ఒకవేళ అని అర్థం. అదే విధంగా గొండుజాతి వాయిద్యం తుడుంను ప్రతీకగా వాడుతూ ఆ ఇనుస్ట్రుమెంట్ను తల్లీలాగ మొక్కే సాంప్రదాయాన్ని చూపిస్తాడు. ''చర్మం ఒలిచే దెబ్బకు అబ్బంటే ఒగాల/ చిలికే రక్తం చూసి చెదిరితె ఒగాల/ గుబులేసి కన్నీరు ఒలికితె ఒగాల/ భూ తల్లీ చనుబాలు తాగనట్టేరో''.. భూ తల్లికి కూడా చనుబాలుంటాయని అందుకే ఇన్ని జీవజాతులకు, ఇన్ని కోట్ల మానవాళికి తనలో పురుడు పోస్తుందని చెప్పాడు. ఈ పాటలో అడివమ్మను, నేలమ్మను, తుడుం తల్లిని, కొమురం భీం తల్లిని ఇలా అందరి తల్లులను యాదిజేసుకుంటాడు.
''కాలువై పారే నీ గుండే నెత్తురు/ నేలమ్మ నుదుటి బొట్టైతుంది చూడు/ అమ్మా కాళ్ళ పారాణైతుంది చూడు/ తల్లీ పెదవుల నవ్వై మెరిసింది చూడు''.. ఇక్కడ నైజాం, భూస్వాముల సైన్యాలు కొమురం భీంను హతమార్చినా, చిందిన నెత్తురు నేల నుదుట తిలకం బొట్టుగా మారింది. ఆయన నేలకంతటికి పంచిన చైతన్యం జల్ జంగల్ జమీన్ నినాదం అయ్యి మెరిసింది. అనేక భూ పోరాటాలకు, విముక్తి ఉద్యమాలకు, గెరిల్లా యుద్ధాలకు మార్గదర్శకంగా నిలిచింది. అమ్మ కడుపుకోత వధా కాలేదని విజయాల నవ్వై మెరిసిందంటూ తల్లి పెదవుల నవ్వుని ప్రతీకగా చూపుతాడు. ''కొమురం భీముడో కొమురం భీముడో/ పుడమి తల్లికి జన్మ అర్ణం ఇస్తివిరో కొమురం భీముడో''.. అంటూ ఓ వైవిధ్య పద ప్రయోగంతో పాట ముగుస్తుంది. తెలంగాణలో తమ బిడ్డలకు పెళ్ళిచేసి ఎన్ని కట్నకానుకలిచ్చినా అత్తగారింటికి పంపించేటప్పుడు మాత్రం బర్రెనో, గొర్రెనో, మేకనో, ఆవునో ఇచ్చి పంపుతారు. దాన్నే 'అర్ణం' అంటారు. వాటినిచ్చినంత సుళువుగా ప్రజలకోసం తన జన్మనే అర్ణమిచ్చిన గొప్ప వీరుడు, గోండు జాతి పోరాటయోధుడు కొమురంభీం అని కొనియాడుతాడు అశోక్ తేజ.
అవునన్నా కాదన్నా ఇది సినిమా కోసం రాసిన పాట. అయినా సినిమా కోసం రాసినట్టు కాకుండా కొమురం భీం అమరత్వ స్మరణ కోసమే రాసినట్టు ఉంటుంది. రచనా సందర్భం సినిమాదైనా, రచయిత ప్రజా కుటుంబం నుంచి ఎదిగినవాడు. కాబట్టి ప్రజా దృక్పథం నుంచి పాట రాసిన అశోక్ తేజ ఎంతో అభినందనీయుడు.
- ఎం. విప్లవకుమార్
సెల్:9515225658