Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రం లోని 33జిల్లాల్లో జిల్లా పరిషత్ పరిధిలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న తాత్కాలిక స్వీపర్లకు పదోన్న తులులేక కనీస వేతనచట్టం అమలు కాక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. కొందరు పదోన్నతి వస్తుందనే ఆశతో ఏళ్లుగా ఎదురు చూస్తూ మరణించగా మరి కొందరు జీవితపు చివరి దశకు చేరుకున్నారు. గత ఐదు దశాబ్దాలుగా వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వాలు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు.
దశాబ్దాలుగా వెట్టిచాకిరి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1970లో దాదాపుగా 1040 పి.టి.ఎఫ్ (పార్ట్ టైం ఫేర్రస్)లు తెలంగాణ ప్రాంతంలోని పదిజిల్లాల్లో నియమింప బడ్డారు. గత 50ఏండ్లుగా వెట్టిచాకిరీ చేస్తున్నారు. అన్ని విధులు నిర్వహిస్తున్న వీరికి నెలకు అందేది కేవలం రూ.7000 మాత్రమే. పని భారం ఎక్కువ వచ్చే జీతం మాత్రం తక్కువ. ఉదయం 7 గంటలకు పాఠశాలను శుభ్రం చేయడంతోపాటు తాగు నీరు పెట్టడం నుండి ప్రారంభమయ్యే వారి దినచర్య సాయంత్రం 5 గంటల వరకూ ఉంటుంది. బెల్ కొట్టడం, మొక్కల సంరక్షణ, మరుగుదొడ్లు మూత్రశాలలు కడగడం మొదలైన పనులు చేస్తూ ప్రతి నిమిషం ప్రధానోపాధ్యాయులకు అందుబాటులో ఉండాలి. కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పాఠశాల నివేదికలను కూడా వీరి ద్వారా మండల విద్యా వనరుల కేంద్రాలకు పంపిస్తారు. ఇలా రోజు మొత్తం చేసినవారికి రోజుకు రూ.233 సొమ్ము జీతం రూపంలో అందుతుంది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనికి వెళ్తే రోజుకు 200-250 సొమ్ము వస్తుంది. వారి కంటే దుర్భర పరిస్థితుల్లో వీరు జీవనం గడుపుతున్నారు. పదోన్నతి వస్తుందనో లేక జీతం పెరుగుతుందనో ఆశ చావక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
పదోన్నతి ఆశలు అంతలోనే ఆవిరి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012 జనవరి 4న పిటిఎఫ్లుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించి శాశ్వత ఉద్యోగలుగా నియమిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రాంతంలోని 10జిల్లాల్లో పనిచేస్తున్న దాదాపు 450మంది పిటిఎఫ్లకు సీనియార్టీ ప్రకారం అర్హులుగా గుర్తించినా పదోన్నతులు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితులు మారి శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తారని ఆశతో ఉన్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇంకోపక్క కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కనీస వేతనం కూడా పొందలేకపోతున్నారు. వచ్చే జీతం కూడా మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. కొంతమంది పదోన్నతి కోసం ఎదురు చూస్తూ మరణించగా మరికొందరు పదవి విరమణ వయసు దశకు చేరుకున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి వీరిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి.
- అంకం నరేష్
సెల్:6301650324