Authorization
Mon Jan 19, 2015 06:51 pm
317 ప్రభుత్వ ఉత్తర్వు రద్దు వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న జైత్రం సార్ చనిపోయాడు. హుజూర్‌నగర్‌లో డ్యూటీలో జాయిన్ కావడానికి వెళ్ళిన నాగెళ్ళ మురళీధర్ గుండె ఆగిపోయింది. దూరభారంతో దుఃఖించి కృపయ్య, గోపి, సమ్మయ్య, శ్రీమతి, జయ, సరస్వతి, అశోక్‌కుమార్‌లతో పాటు ఓ ఉపాధ్యాయుడి భార్య కూడా మానసిక ఒత్తిడితో మరణించారు. వీరు చనిపోయారు అనడంకంటే మనం తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం చంపేసింది అని చెప్పడం మంచిది. సమ్మెకాలంలో అర్టీసీ ఉద్యోగుల పట్ల, రైతులూ, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం ఏ హంతక తలారి పాత్రనైతే పోషించిందో అదే పాత్రను ఉద్యోగ, ఉపాధ్యాయులపట్ల కూడా ప్రారంభించింది. మనోవేదనతో ఒత్తిడికిలోనై వేలమంది ఆసుపత్రుల్లో చేరారు. ఇప్పుడు 30శాతం ఉద్యోగ ఉపాధ్యాయులు సంతృప్తిగా ఉంటే 70శాతం మందికి నష్టం జరిగింది. వందకు వందశాతం అన్ని సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఈ జీఓ బలవంతంగా రుద్దబడి బలిపీఠంపై నిలబెట్టింది .
రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కోసం విడుదలైన 124 జీఓ లోని పేరా 4లో 1 నుండి 7 వరకు పేర్కొన్న అంశాలలో స్థానికత అంశం లేకపోవడమేకాక, కనీసం పేర్కొన్న అంశాలైన పాలన పరమైన అవసరాలు, వ్యక్తుల వయస్సు, సీనియారిటీ సమతుల్యత, ఆ లోకల్ ఏరియాలో చేసిన సర్వీస్, భాషపరమైన ప్రావీణ్యం, చట్టాలపై అవగాహన లాంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఒక్క సీనియారిటీ అంశం అది కూడా మొత్తం సర్వీస్ కాకుండా, కేవలం క్యాడర్ సర్వీస్‌ను మాత్రమే తీసుకొని గుడ్డెద్దు చేన్లో పడిన మాదిరిగా ప్రక్రియను మొత్తం కొనసాగించడం ప్రభుత్వ ఏకపక్ష విధానాలకు నిదర్శనం. దొంగరాత్రిలో సీనియారిటీ లిస్టులు తయారుచేసారు. అభ్యంతరాలను చెత్తబుట్టలో వేసారు. బాధితులు ఈ తప్పులను దృష్టికి తీసుకువెళ్ళినా సవరించడానికి ముందుకురాని దుర్మార్గానికి తెగబడడమేకాక, మా దగ్గర ఏమీలేదు, అంతా సి.ఎస్ చేతుల్లోనే ఉందని ఎక్కడి అధికారులక్కడ ఉపాధ్యాయుల చెవుల్లో పువ్వులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. జరిగిన అన్యాయాలను, అక్రమాలను సవరించమని రాసిన ఓ అమాత్యుడి లేఖను సైతం చెత్తబుట్టలో విసిరివేసినా... అటు సమస్యను పరిష్కారం చేయకుండా, ఇటు పదవికి రాజీనామా చేయకుండా మాజీ ఉద్యోగ సంఘనాయకుడైన ఆ మంత్రి ఇంకా పదవిలోనే కొనసాగుతున్నాడు. ఈ జీఓపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు ఎవ్వరూ మాట్లాడే సాహసం చేయలేని మూగజీవులయ్యారు. ఎవరకి చెప్పుకోవాలో, ఎక్కడ చెప్పుకోవాలో కూడా తెలియని అగమ్యగోచర స్థితి రాజ్యమేలుతోంది.
జీవితాలతో ముడిపడ్డ ఇంత పెద్ద సమస్యకు ఆప్షన్లకు మాత్రం ఒకే ఒక్క రోజు అవకాశం ఇచ్చారు. అమలు కోసం ప్రభుత్వ యంత్రాంగమంతటిని రాత్రింబవళ్ళు పరుగులు పెట్టించిన విధానం చూస్తే ఉపాధ్యాయుల, ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత కక్ష్య సాధింపు ధోరణిలో ఉందో అర్థమవుతున్నది. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ తీసుకుంటున్నారో ఆధ్యంతం గోప్యత అనడం కంటే త్రిల్లర్ సినిమాను తలపించింది అనడం మంచిది. బాధితుల ఏ ప్రశ్నకూ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. మాయల ఫక్కీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు అంతా ప్రగతిభవన్ నుండే రిమోట్ సెన్సింగ్. ఒక జిల్లాకు మరో జిల్లాకు, ఒక డిపార్ట్మెంట్కు మరో డిపార్ట్మెంట్కు అమలుపరిచే రూల్స్ మధ్యవ్యత్యాసం ఉన్నా అడిగిన నాధుడులేడు, అడిగినా పట్టించుకున్న అధికారి లేడు. దొంగరాత్రిలో ఆర్డర్లు వచ్చాయి. రిలీవింగ్ అవసరంలేదట! తుఫాన్ మరణాలను లెక్కించినట్టు గంట గంటకు జాయినింగ్లను లెక్కించి పైశాచిక ఆనందం పొందింది ప్రభుత్వం. 317 జీఓను విడుదల చేసిన 3 నెలల అనంతరం ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన తూ తూ మంత్రపు సమావేశంలో చెప్పిన ఏ ఒక్క డిమాండ్‌నూ పరిశీలించిన పాపాన పోలేదు.
అంగవైకల్యం 70శాతం ఉంటేనే అర్హులంటే మరి 40శాతం ఉన్నోళ్ళకు ప్రభుత్వం ఎందుకు నెల నెల అలవెన్స్ చెల్లిస్తున్నట్టు? దొంగ రోగాల సర్టిఫికెట్లు రాజ్యమేలి అసలైన రోగులకు అన్యాయం జరిగింది. వితంతువులలో కారుణ్యనియామకం పొందిన వారికి ఒక న్యాయం, వితంతువులైన ఉద్యోగినిలకు మరో న్యాయం. ఇలా రెండు రకాలుగా వితంతువులను సృష్టించిన మా దొడ్డ ప్రభుత్వం, అధికారులున్న రాష్ట్రం మనది. భార్యాభర్తలను ఒకే లోకల్క్యాడరైజేషన్ చేసే లక్ష్యానికి ఏ విధివిదానంలేదు! రోస్టర్ విధానం పాటించకుండానే రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు తూట్లు పొడిచారు. పాత ఉద్యోగులకు పాత విధానం, కొత్త ఉద్యోగులకు కొత్త విధానం అని రాష్ట్రపతి ఉత్వర్వుల సవరణ సమయంలో చెప్పిన దానికి భిన్నంగా 317 ద్వారా లోకల్ క్యాడరైజేషన్ చేస్తున్నారు. స్వయంగా పోరాడి సాధించుకున్న ప్రత్యక్ష కౌన్సిలింగ్ విధానం కండ్లముందే రద్దయిపోయినా ఏమీచేయలేని ధైన్యస్థితి సంఘ నాయకత్వా లది. మొత్తం ఖాళీలను చూపకుండా కేటాయించబడిన ఉద్యోగులకు సరి సమానంగా ఖాళీలను చూపి సీనియర్లను మోసం చేసారు. పాఠశాలలకు జనవరి 8 నుండి సెలవులను ప్రకటించి జనవరి 7 రోజున అందరు జాయిన్ కావాలని ఇచ్చిన ఆదేశాలు చూస్తే ప్రభుత్వ వ్యూహం ఎంత పకడ్భందీగా ఉందో అర్థమవుతున్నది.
33 జిల్లాల ఏర్పాటు వల్ల ఏ ప్రయోజనం జరిగిందో ఇప్పటికీ అర్థంకాని పరిస్థితి. ఒక్క కొత్త ఉద్యోగ సృష్టి జరుగకపోగా ఉన్న ఉద్యోగులను అడ్జెస్ట్ చేస్తూ జూనియర్లను అటవీ ప్రాంతాలకు పంపడం వల్ల అక్కడి నిరుద్యోగులకు తీరని ద్రోహమే జరిగింది. ఎన్నుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వంతపాడుతున్నారు. ఒక మాజీ ఎమ్మెల్సీ వాస్తవాన్ని వక్రీకరించి గ్రామాల్లో ఉపాధ్యాయులు పనిచేయనంటున్నారని ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు పనిచేస్తున్నది ఎక్కడో ఆయనకే తెలియాలి. ఏ ప్రయోజనాల్ని ఆశించి ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందో అర్థంచేసుకోలేనంత అమాయకత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారా? ''ఒకరిని ఎన్నిసార్లైనా మోసం చేయవచ్చు, అందరిని ఒక్కసారి మోసం చేయవచ్చు, కాని అందరిని అన్నిసార్లు మోసం చేయడం సాధ్యంకాదు.'' ఆర్టీసీ కార్మికుల చావులకు కారణమైన వారిని మనం క్షమించాం, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం ఎవ్వరో తెలిసినా వదిలివేసాం, రైతుల శవాలపై ఓట్లను ఏరుకుంటున్నా మనలను కాదు కదా అనుకున్నాం. ఇప్పుడు వనవంతు వచ్చింది. ఏ సమస్యకైనా పోరాటమే పరిష్కారమని మరువరాదు. నియంత నిజాం నుండి చంద్రబాబు దాక గుణపాఠం చెప్పిన చరిత్ర తెలంగాణ ప్రజలది. కాలానికి కళ్ళున్నాయి. తస్మాత్ జాగ్రత్త!
- ఎ. శ్రీదేవి