Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2021లో ఇండియాలో 100మంది అత్యంత కుబేరుల ఆస్తుల విలువ 57.3 ట్రిలియన్లకు చేరిందని, దేశ బిలియనీర్ల సంఖ్య గతేడాదితో పోల్చితే 102 నుంచి 142కు (దాదాపు 39శాతం) పెరిగిందని 'ఆక్స్‌ఫామ్ ఇండియా - ఇనీక్వాలిటీ కిల్స్' తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. మరో వైపు దేశంలోని 84శాతం కుటుంబాల్లో ఆదాయం తగ్గడం, జీవనోపాధి పడిపోవడం, ప్రాణాల్ని కోల్పోవడం లాంటి కారణాలతో ఆదాయం 2021లో బాగా పడిపోయిందనే వాస్తవాన్ని కూడా వెల్లడించింది. మార్చి 2020 నుంచి నవంబర్ 2021 మధ్య దేశంలోని బిలియనీర్ల సంపద 23.14 ట్రిలియన్ల నుంచి 53.16 ట్రిలియన్ల వరకు పెరగడం విశేషంగా విశ్లేషించబడింది. అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో ఇండియా 3వ స్థానంలో ఉండడం విశేషంగా గమనించాలి. 2020లో కరోనా కల్లోలంలో దేశంలోని 10శాతం సంపన్నులకు 1శాతం సర్‌చార్జ్ పన్ను విధించగా సమకూరే మొత్తంతో అసమానతలు తొలిగేలా పాఠశాల విద్య, సార్వత్రిక ఆరోగ్య భద్రత, సామాజిక భద్రత, ప్రసూతి సెలవులు, అర్హులకు పెన్షన్లు లాంటి సంక్షేమ పథకాలు తీసుకురావచ్చని నివేదిక వెల్లడించింది. దేశంలోని 98మంది బిలియనీర్లకు 4శాతం సంపద పన్ను విధిస్తే దేశవ్యాప్తంగా పాఠశాలల్లో 17ఏండ్ల పాటు మద్యాహ్న భోజనపథకం నిర్వహించ వచ్చని తెలిపారు.
గత ఏడాదిలో 46 మిలియన్ల పేద ప్రజలు కడు పేదరికంలోకి నెట్టబడ్డారని, ధనికులు అత్యంత ధనికులుగా మారారని స్పష్టం అవుతున్నది. దేశంలో 50శాతం అల్పాదాయ వర్గాల సంపద కేవలం 6శాతం మాత్రమే అనే ఆశ్చర్యకర విషయం బయట పడింది. అసమానతలు పెరగడంతో రోజుకు 21,000 మంది, నాలుగు సెకన్లకు ఒక్కరు మరణిస్తున్నారని తేలింది. కరోనా విపత్తు విజృంభణతో లింగ సమానత్వానికి 99ఏండ్లు పడుతుందని అంచనా వేయగా, నేడు 135ఏండ్లు పట్టవచ్చని వివరించారు. 2020లో మహిళా ఆదాయం 59 ట్రిలియన్లు తగ్గిందని, 13 మిలియన్ల మహిళలు పని కోల్పోయారని తెలిపింది. కరోనా మహమ్మారి చెలరేగడంతో విద్య, సామాజిక భద్రతారంగాల బడ్జెట్ తగ్గిందని తెలుస్తున్నది. పట్టణ నిరుద్యోగం 15శాతం పెరగడం, ప్రజారోగ్య వసతులు భారీగా పడిపోవడంతో సమాజంలో అస్థిరత నెలకొంది.
అదానీ సంపద 2020లో 8.9 బిలియన్ డాలర్లు ఉండగా, 2021లో 50.5 బిలియన్ డాలర్లకు పెరగడంతో ప్రపంచ కుబేరుల్లో 24వ ర్యాంకు, ఇండియాలో 2వ ర్యాంకు ఆక్రమించారు. ఫోర్బ్ వివరాల ప్రకారం నవంబర్ -2021లో అదానీ సంపద 82.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. రిలియన్స్ ముఖేష్ అంబాని సంపద 2020లో 36.8 బిలియన్ డాలర్ల నుంచి 2021లో 85.5 బిలియన్ డాలర్ల వరకు పెరగడం గమనించారు. 2016లో 'సూపర్ రిచ్' వర్గపు సంపదపన్నును తొలగించడం మనకు విధితమే. కరోనా మహమ్మారి కాలంలో పేదలు, మధ్యతరగతి వర్గాలే ఎక్కువ పన్నులు కట్టారని, ధనికుల ఆదాయం అనేక రెట్లు పెరిగినా పన్నులు అదే నిష్పత్తిలో పెరగలేదని వెల్లడి అవుతున్నది. దేశంలోని అట్టడుగు 552 మిలియన్ల మొత్తం సంపదకు 98మంది ధనవంతుల సంపద సమానంగా ఉండడంతో ఆర్థిక అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతున్నది. ప్రపంచవ్యాప్త జాబితాలో 10అగ్రదేశాల సంపద 57శాతం ఉండగా, జాబితా చివరన ఉన్న 50శాతం పేద దేశాల సంపద 13శాతమే అని తేలింది. ఈ అసమానతలు పెట్టుబడిదారీ వ్యవస్థ క్రూర స్వభావాన్నీ, సమస్తం వారికి దోచిపెట్టే ప్రభుత్వాల తీరుతెన్నులను బట్టబయలు చేస్తున్నాయి.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్:9949700037