Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా దేశంలో ప్రవేశించటానికి ముందే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతున్న మాట వాస్తవం. దీనికి ప్రధాన కారణం జీఎస్టీ అమలు, పెద్దనోట్లు రద్దు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు సామాన్య మధ్య తరగతి ప్రజలు, చిన్న చిన్న పరిశ్రమలపై తీవ్రమైన ప్రభావం చూపి, చాలామంది జీవితాలను, ఆర్థిక మూలాలను అస్థిర పరిచింది. పర్యవసానంగా దేశ అభివృద్ధి, జీడీపీ పతన మార్గాన పయనించే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో గత నాలుగు దశాబ్దాలుగా చవిచూడని నిరుద్యోగం పడగెత్తి విన్యాసాలు చేస్తూ నేటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కార్పొరేట్లకు మాత్రమే మేలు చేకూర్చుతూ వారి అభివృద్ధే దేశాభివృద్ధి అనే స్థాయికి తీసుకుని వెళ్ళాయి. ధరలు మునెన్నడూ ఎరుగని రీతిన పెరగడం వలన సామాన్య ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారి ప్రభుత్వాలకు పెనుసవాలుగా నిలిచిన తరుణంలో... మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు 2020 ప్రారంభంలో మనదేశంలో తొలి దశగా ఆరంభమైన ''కోవిడ్'' మహమ్మారి దేశ భవిష్యత్తును నిస్సత్తువగా చేసి, లాక్డౌన్, కర్ఫ్యూల రూపంలో దేశంలో ఉన్న ఉత్పత్తి, ఉపాధి రంగాలను అధోగతి పాలు చేసింది. ''వలస కార్మికుల'' జీవితాలను దుర్భరం చేసింది. ఆ ప్రభావం నేటికీ వెంటాడుతూనే ఉన్నది.
అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఉత్పత్తి రంగం పడకేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూకటివేళ్లతో పెకలించింది. నేటికీ కోవిడ్ పూర్వపు పరిస్థితి నెలకొనలేదు. ముఖ్యంగా 84శాతం కుటుంబాల తలసరి ఆదాయాలు క్షీణించి, మూడు పూటలా తిండిలేని పరిస్థితిలోకి అనేక కోట్ల మంది నెట్టవేయబడ్డారు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలులేక ఖాళీగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. మరికొందరు మద్యం, మత్తులకు చిత్తు అవుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా తయారైనారు. ఆసియాలో తైవాన్ వంటి దేశాల కంటే మరింత తక్కువగా మన మహిళలు శ్రామికశక్తి తగ్గి, మహిళా నిరుద్యోగం పెరుగుతున్నది. అనేక కుటుంబాలలో గృహహింస రోజురోజుకూ పెరుగుతోంది. బాల్య వివాహాలు ఎక్కువ అయినాయి. సంపాదనలేక ముఖ్యంగా మహిళలు, బాలికలు పౌష్టికాహారలేమి, రక్తహీనత వంటి అనారోగ్యాలకు గురవుతున్నారు. నేటికీ అందరికీ కోవిడ్ టీకాలు రెండు డోసులు (వ్యాక్సినేషన్) పడలేదు. కోవిడ్ భయాలు ప్రస్తుతం ''ఒమిక్రాన్'' రూపంలో వెంటాడుతూ, ప్రతీ రోజూ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కోవిడ్ వైరస్ భారిన పడుతూ మూడో దశ (థర్డ్ వేవ్) ముంగిట నిలిచి ఉన్నారు. భవిష్యత్తులో ఎంతటి ప్రమాదం ముంచుకొస్తుందో ప్రస్తుతం అంచనా వేయలేని పరిస్థితి. భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో చెప్పలేని స్థితి నెలకొంది.
పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు పగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్క కూరగాయలు ధరలే 34.59శాతం పెరిగి సామాన్యులు జేబులకు చిల్లులు పెడుతున్నాయి. నేటికీ ధరలు అందుబాటులోకి, అదుపులోకి రాలేదు. ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నాలూ చేయడంలేదు. కనీసం వలస కార్మికులు సంఖ్య, కరోనాతో మృతి చెందిన వారి వివరాలు కూడా మన ప్రభుత్వాల వద్ద ఉండటంలేదు. ఎంత నిర్లక్ష్యం... పాలనలో పారదర్శకత ఎక్కడ...? ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు, రకరకాల నిర్బంధాలు, దాడులు... ఇది నేటి మన పాలకుల తీరు... మిడియా కూడా పాలక వర్గాలకు కొమ్ము కాస్తున్నది. నిజాలు, వాస్తవాలు ప్రజల ముంగిట ఉంచక పోవడం శోచనీయం... అంతేకాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు. దేశంలో బిలియనీర్ల సంఖ్య 142వరకూ పెరుగుతూ వచ్చింది. వీరికి ప్రభుత్వ విధానాలు, రాయితీలు ప్రోత్సాహకాలు బాగా కలిసి వచ్చాయి. అయితే ఇక్కడే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పేదలు మరింత పేదరికంలోకి జారుకున్నారు. నేటికీ 19కోట్ల మందికి మూడు పూటలా తిండిలేదు. పౌష్టికాహారం లోపంతో మహిళలు, బాలలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ధనికులకు, పెట్టుబడీదారులకు ఇచ్చే రాయితీలలో కనీసం మూడోవంతు కూడా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కేటాయించడంలేదు సరికదా, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ, మానిటైజేషన్ వంటి చర్యలు చేపడుతూ, బలహీన వర్గాల ప్రజలకు రక్షణగా ఉన్న రిజర్వేషన్స్ను గాలిలో దీపం చేస్తూ, వారి జీవితాలను దుర్భరం చేస్తూ పేదవారిని మరింత పేదరికం పాలు చేస్తున్నారు. ఉచితాల పేరుతో ఓట్లు సీట్లు సంపాదిస్తూ, అధికారం చేజిక్కించుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే యువతకు ఉద్యోగావకాశాలు కల్పించుట లేదు. అందరూ అసంఘటిత రంగంలోనే ఉపాధి వెతుక్కుంటూ జీవితాలు వెలిబుచ్చుతున్నారు. నేటికీ భారతదేశంలో 90శాతం జనాభా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. తాము చేసే ఉద్యోగాలకు, జీవితాలకు భరోసా లేకుండా జీవనయానం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాబోయే రెండు నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా తాత్కాలిక ఉపశమనం పాలకులు కలిగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తులో మంచి పాలన అందించే వారినే ఎన్నుకోవాలి... లేదంటే ప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు మరింత విపరీతంగా పెరిగి, మనపై మోయలేని భారం పడుతుంది అని అనుటలో ఏమాత్రం సందేహం లేదు. తస్మాత్ జాగ్రత్త..
ఒక దేశం యొక్క అభివృద్ధి ఆదేశ ప్రజల విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలపై ఆధారపడి ఉంటుంది అని నేటి ప్రభుత్వాలు గ్రహించాలి. ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వాలే నిర్వహించాలి. ప్రజా సంక్షేమమే పరమావధి అని భావించాలి. పరిశ్రమలు స్థాపించాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎగుమతులు ప్రోత్సహించాలి. విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాలి. ''మేధోవలస'' అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి. నూతన ఆవిష్కరణలు చేసేట్లు మన దేశంలో విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవాలి. మూఢ నమ్మకాలు ఆచారాలు సంప్రదాయాలకు తెరదించాలి. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచిపోషించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి పునాదులు వేయాలి. మతాతీత, కులాతీత సమసమాజ స్థాపనకు, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వాలు పాలన చేయాలి. కూనరిల్లుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు, నూతన జవసత్వాలు అందించాలి. స్వంతంత్ర సంస్థలను పారదర్శకంగా పనిచేసేటట్లు చూడాలి. చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. ధరలు నియంత్రణ చేయాలి. పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వాలి. అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించినపుడు మాత్రమే మనదేశంలో అందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, దేశాభివృద్ధికి వెన్నెముకలవుతారని ప్రభుత్వాలు గ్రహించాలి.
- ఐ. ప్రసాదరావు
సెల్ 9948272919