Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుల, మత సమీకరణలే అనాదిగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. యూపీలో బ్రాహ్మణ, దళిత, ముస్లింలను ప్రసన్నం చేసుకుంటే అధికార పీఠానికి రాచబాట పడినట్టే. యూపీలో కులాలకుంపట్లు, మతాల మఠాలతో ముఖ్యమంత్రి ఎవరన్నది చాల ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ రెండవసారి అధికారంలోకి రావటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే 80:20 ఫార్ములాను తెరపైకి తెచ్చింది. ఈ ఫార్ములా ప్రకారం రాష్ట్రంలో మతపరమైన పునరేకీకరణ తీసుకరావటానికి బీజేపీ యోగి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫార్ములా ప్రకారం రాష్ట్ర జనాభాలో 80శాతం మంది హిందువులు జాతీయతకు, ఉత్తమ పరిపాలనకు, అభివృద్ధికి కారకులని, మిగిలిన 20శాతం మంది ముస్లింలు హిందూ వ్యతిరేకులని, ఉగ్రవాద సానుభూతిపరులని యోగి ఆరోపిస్తున్నారు. యోగి ప్రభుత్వం ఒక వార్తా పత్రికకు ఇచ్చినా ప్రకటనలో రెండు ఫొటోలు ఉన్నాయి. ఒక దానిలో పెట్రోల్ బాంబు విసురుతున్న ఒక యువకుడు కనిపిస్తున్నాడు, రెండవదానిలో అదే యువకుడు చేతులు జోడించి క్షమాపణలు కోరుకొంటున్నాడు. చట్టానికి నిబద్ధులైన 80శాతం మంది జాతీయవాదులు ఇంకెంత మాత్రం 20శాతం మంది దౌర్జన్యాలకు భయపడవలసిన అవసరం లేదని, ఆ చట్ట విద్రోహులకు యోగి సర్కార్ ఒక గుణపాఠం అని ఆ ప్రకటన సందేశం. యూపీ జనాభాలో 20శాతం మంది ముస్లింలు ఉంటారు. యోగి వారిపై జాతి వ్యతిరేకులుగా ఆరోపణలు చేస్తున్నారు. దీని ద్వారా హిందూ ఓటర్లును ఏకం చేసి మళ్లీ అధికారంలోకి రావాలనేది వారి ప్రయత్నం. అయితే బీజేపీ నుంచి ముఖ్యమైన శాసన సభ్యులు పార్టీని వీడుతుండటం ఒక వైపు బీజేపీని కలవరపెడుతున్నది. పార్టీ వీడుతున్నవారంతా బీజేపీ ప్రభుత్వం దళిత, ఓబీసీలను నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శిస్తున్నారు.
యూపీ ఎన్నికల్లో అన్ని పార్టీల రాజకీయ అదృష్టాన్ని తారు మారు చేయగల సామర్థ్యం ఉన్న ముస్లింలు ప్రస్తుత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతారన్నది సర్వత్రా ఆసక్తిగా ఉంది. వీరంతా సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేస్తారని ఒక అంచనా... ఇక ఈ ముస్లిం ఓటర్ల చీలిక, మరోవైపు హిందూ ఓట్లను ఏకం చేయటం ద్వారా గత ఎన్నికల్లో భారీగా లబ్ది పొందింది బీజేపీ. కనుక ముస్లిం ఓట్లు చీలకుండా గంపగుత్తగా సమాజ్ వాదీ పార్టీకే పడేట్టుగా ఆపార్టీ ప్రణాలికలు రచిస్తోంది. యూపీలో మొత్తం 403అసెంబ్లీ స్థానాలలో ముస్లింలు 143స్థానాలలో గెలుపోటములను ప్రభావితం చేయగలరు. 36 స్థానాలలో అభ్యర్థులను వీరు ఏకపక్షంగా గెలుపించగలరు. 70 సీట్లలో ముస్లిం జనాభా 30శాతం వరకు ఉంటుంది. రాష్ట్రంలో మూడవ వంతు స్థానాలలో ముస్లిం ఓట్లు చాల కీలకంగా ఉన్నాయి. అయినా 2017 ముజఫర్‌నగర్ మత కలహలతో బీజేపీ 37స్థానాలలో గెలిచింది. సమాజ్‌వాదీ పార్టీ 17 స్థానాలలో గెలిచింది.
యూపీలో ముస్లిం అభ్యర్థులు సొంతగా గెలిచే రాంపూర్, మొరాదాబాద్, ముజఫర్‌నగర్, షహారన్పూర్, అమ్రోహౌ, చిదనోరే, మారేలి, సంబల్, బలరాంపూర్, బ్రహేర్చు, హఫీడ్ వంటి ప్రాంతాల్లో ముస్లిం జనాభా ఏకంగా 40శాతంపైనే ఉంటుంది. అందుకే ముస్లిం ఓట్లలో చీలికలు తేవడం, హిందూ ఓట్లను గంపగుత్తగా పొందడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకు హైదరాబాద్ పార్టీ అయిన ఎంఐఎం బీజేపీకి ఎంతో ఉపయుక్తంగా మారింది.
ముస్లింలకు అసదుద్దీన్ తనకు తానే జాతీయ నాయకుడనని ఆపాదించుకొంటున్నారు. బీహార్‌లో గెలుపే స్ఫూర్తిగా యూపీలో 100స్థానాలపై పోటీకి సై అంటున్నాడు. ముస్లిం ప్రాతినిధ్యం తగ్గించే ఈ బీజేపీ ఎత్తుగడలను ముస్లింలు అర్థం చేసుకోవాలి. యూపీలో గత ఎన్నికల ట్రెండ్‌ను పరిశీలిస్తే ముస్లిం ప్రాతినిద్యం పెరిగిన ప్రతి సారి బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. బీజేపీ తన పట్టు బిగించినప్పుడు ముస్లిం ప్రాతినిద్యం తగ్గిపోయింది. 1991 అసెంబ్లీ ఎన్నికలో 221స్థానాలలో బీజేపీ గెలిచి యూపీలో తన మెజారిటీ ప్రభుత్వాన్ని నెలకొలిపింది. ఈ ఎన్నికలో 23మంది ముస్లింలు మాత్రమే గెలిచారు. ఇది మొత్తం బలంలో 5.4శాతం మాత్రమే. అదే బీజేపీ అధికారం కోల్పోయినప్పుడు ముస్లిం ప్రాతినిద్యం 17శాతానికి పెరిగింది. 2012లో ఎస్పీ 68 ముస్లిం ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. ముస్లిం ఓట్లు చీలకుండా ఎస్పీ యాదవ్, ముస్లిం ఫార్ములాను వాడి ప్రతిసారి అధికారంలోకి వస్తుంది. బీఎస్పీ దళిత్, ముస్లిం, బ్రాహ్మణలను ఫార్ములా వాడి అధికారంలోకి వస్తుంది. 2017 ఎన్నికలో 38స్థానాలలో పోటీచేసిన ఎంఐఎం ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదు. ఇప్పుడు కూడా అసరుద్దీన్ అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ప్రయత్నాలతో ఖచ్చితంగా బీజేపీకి పూర్తిస్థాయిలో లాభం చేకూరుతుంది. ముస్లిం ఓట్లు చీలిపోయి తిరిగి బీజేపీకి అధికారాన్ని కట్టబెడుతాయి. యూపీలో ఎంత అరాచక పాలనా ఉన్నా హిందుత్వ అనే భావనతో అన్ని కొట్టుకుపోతాయనీ, చివరకు బీజేపీ అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందనీ ఆ పార్టీ ఆశిస్తున్నది. ఇదే జరిగితే ఈ దేశానికి అంతకన్నా ప్రమాదం మరొకటి ఉండదు.
సెల్: 9989236393
- జియాఉద్దీన్ మహమ్మద్